నా భర్తను ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పండి

కృష్ణ‌లంక పోలీసు స్టేష‌న్ ఎదుట మాజీ ఎమ్మెల్యే వంశీ భార్య పంక‌జ‌శ్రీ ఆందోళ‌న‌
 

విజయవాడ: తన భర్తను ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పడం లేదని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. పోలీసులు వివరాలు ఏమీ చెప్పడంలేదని.. లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు.  ఏ కేసులో అరెస్ట్‌ చేశారో చెప్పడం లేదని.. ఎఫ్‌ఆర్‌ కాపీ కూడా ఇవ్వడం లేదని వంశీ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావుతో కలిసి వల్లభనేని వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వ‌ద్ద‌కు చేరుకోగా ఆమెను  పోలీసులు అనుమతించకపోవడంతో ఆందోళ‌న చేప‌ట్టారు. మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ఆమె ప్రశ్నించారు. వంశీ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని చెప్పినా పోలీసులు  పోలీస్‌స్టేషన్‌ లోపలికి రానివ్వడం లేదని.. తన భర్తను చూసేందుకు లోపలికి పంపాలని పంకజశ్రీ కోరారు.  

వంశీని టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారు:  మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు 
`వంశీని టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారు. లోకేష్‌ చెప్పడం వల్లే అక్రమ కేసులు బనాయించారు. ఇలాంటి విష సంస్కృతిని అందరూ ఖండించాల్సిందే. కక్ష సాధింపులో భాగంగానే వంశీని అరెస్టు చేశారు. రాజ్యాంగ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉంది` అని జగన్మోహన్‌రావు అన్నారు.

వల్లభనేని వంశీ అరెస్ట్‌ చెల్లదు: లాయర్‌ చిరంజీవి
సుప్రీంకోర్టు నిబంధనలను పోలీసులు పాటించడం లేదని వంశీ తరఫు లాయర్‌ చిరంజీవి అన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్‌ చెల్లదని.. ఆయనను కావాలనే  అరెస్ట్‌ చేశారన్నారు. ఏం కేసులు పెట్టారో తెలీదు. పోలీస్ స్టేషన్‌లో వంశీ లేరని అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు ఫిర్యాదు చేశారు? కేసు ఎందుకు పెట్టారో చెప్పడం లేదు. వంశీ లాయర్‌నని చెప్పినా లోపలకి అనుమతించడం లేదు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది. వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు. తప్పుడు కేసులతో వంశీని ఎవరూ ఏం చేయలేరు’’ అని అడ్వకేట్‌ చిరంజీవి అన్నారు.

Back to Top