అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలోని పిసినికాడ గ్రామంలో ఈనెల 7న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించే “చేయూత’ సభ భారీ ఎత్తున విజయవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. స్థానిక రింగ్‌రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ పార్టీ నాయకులు, శ్రేణులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సభను ఎన్నికల శంఖారావ సభగా పరిగణించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు భారీ సంఖ్యలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని నేతలను కోరారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారిలో చాలామందికి అవకాశాలు లభించాయని, మిగిలిన వారికి కూడా పార్టీలో తగిన న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రజలందరికీ అందాలంటే మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ఈ ప్రయత్నానికి పునాది అనకాపల్లిలోనే పడాలని ఆయన అన్నారు. ఇతర పార్టీల నుంచి మన పార్టీలోకి రావడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారని, వారిని స్వాగతించాలన్నారు. ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం సభలు విజయవంతం అవుతున్నాయని, పిసినికాడ సభ గొప్పగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీఐడబ్ల్యూఏ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ మరోసారి సీఎంగా జగన్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, పార్టీ అనకాపల్లి, కశింకోట మండల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్‌కుమార్, పార్టీ వైద్యవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డేడ లక్ష్మీనరసింహరావు తదితరులు పాల్గొన్నారు.