ఉచితం పేరుతో ఇసుక దోపిడీ

వైయస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజం

ఓ వైపు ఫ్రీ అంటూనే రీచ్‌లలో రేట్లతో ఫ్లెక్సీలా?

మేనిఫెస్టోలో హామీలకు తూట్లు పొడుస్తున్న సీఎం చంద్రబాబు

వైయ‌స్ జగన్ హయాంలో ఖజానాకు ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం

ఆ డబ్బంతా ఇప్పుడు ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?

పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి పారదర్శకంగా అమలు చేసిన వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం

మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అందుబాటులో 80 లక్షల టన్నుల ఇసుక

ఇప్పుడు 45 లక్షల టన్నులే ఉందంటున్నారు.. 35 లక్షల టన్నుల ఇసుక ఏమైంది?

ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ఇసుక ఇవ్వాలని డిమాండ్

 తాడేపల్లి: ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని వైయస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ఉచితం అంటూనే చార్జీలు బాదేస్తున్నారని, ఇసుక రీచ్ లలో రేట్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చిందని, ఇప్పుడు ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ప్రశ్నించారు. ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్ బాబు మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

హామీలకు తూట్లు పొడిచిన చంద్రబాబు
ఎన్నికల హామీలో ప్రధానమైన ఉచిత ఇసుక ఒట్టిదే అని తేలిందని సుధాకర్ బాబు అన్నారు. రీచ్ లలో మీరు కట్టాల్సినవి కట్టాలని మళ్లీ కొత్త స్కీమును తెచ్చారన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తూట్లు పొడవడం ఇదేం కొత్త కాదరని, టీడీపీ కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీలన్నింటికీ తూట్లు పొడుచుకుంటూ ముందుకెళ్తోందని దుయ్యబట్టారు.ఇసుక ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించారని, ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారన్నారు.ఈ సందర్భంగా నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో రూ.1225కు టన్ను అమ్ముతున్నట్టుగా పేర్కొన్న ఫ్లెక్సీ ఫొటోను మీడియాకు చూపించారు. ఇప్పుడు దీన్ని ఉచితం అని అందామా, చంద్రబాబు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 

ఆ సొమ్మంతా టీడీపీ నాయకుల జేబుల్లోకి.. 
వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.750 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ఇప్పుడు రీచ్ ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గరకు వెళ్తోందని ప్రశ్నించారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి వచ్చిన రూ.750 కోట్లు ఇప్పుడు టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్తున్న మాట నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ఇసుక విషయంలో చంద్రబాబు చేసిన మోసాలు ఎవరూ చేయరన్నారు. 2014-19 కాలంలో వాళ్లు చేసిన అక్రమాలు ఇసుక తవ్వకాలు, అనేక జీవోలు విడుదల చేయడాన్ని హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ తప్పు పట్టిందన్నారు. అయినా ఇప్పుడు కూడా అదే పాలసీని ఉచితం పేరుతో తీసుకొచ్చారన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపో దగ్గర రూ.1225కు ఇసుకను అమ్ముతున్న మాట వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఉన్న అగనంపూడి డిపో వద్ద టన్ను ఇసుకకు రూ.1394కు అమ్ముతున్న మాట నిజమా కాదా? అని ప్రశ్నించారు. ఇదే రేట్లతో అమ్మితే ప్రభుత్వానికి రూ.750 కోట్లు ఖజానాకు వచ్చాయన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో నర్సీపట్నంలో రూ.1400కు ఇసుక ఇచ్చిందని, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి పారదర్శకంగా ఇచ్చామని గుర్తు చేశారు. అదే రీచ్ లో ఇప్పుడు రూ.1225కు అమ్ముతున్నారని, అదేనా ఇప్పుడు తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ అని ప్రశ్నించారు. 

ఉచితం అంటూనే రకరకాలుగా వసూళ్లు
సీనరేజీ, లోడింగ్, ట్రాన్స్ పోర్టు, ర్యాంప్ నిర్వహణ, అడ్మిన్ ఎక్స్ పెన్సెస్, డీఎంఏ, మెరిట్ ఫీజులు, జీఎస్టీ అని రకరకాల పేర్లతో డబ్బులు వసూలు చేసి ఉచితం అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రజలకు విపరీతంగా హామీలిచ్చి గెలిచిన తర్వాత తుంగలో తొక్కడం చంద్రబాబు నైజం అన్నారు. ఉచిత ఇసుక విధానం కూడా ఇదే కోవలోకి వస్తుందన్నారు. సీనరేజీ కింద రూ.88లు తీసుకుంటారంట, తవ్వినందుకు రూ.30లు తీసుకుంటారంట, బోట్స్‌మెన్‌ సొసైటీలు అయితే టన్నుకు రూ.225లు తీసుకుంటారంట, రీచ్‌ నుంచి డంప్‌కు తరలిస్తే.. మళ్లీ రవాణా ఖర్చు కింద కి.మీ.కు రూ.4.9ల చొప్పున వసూలు చేస్తారంట, మళ్లీ నిర్వహణ ఖర్చు కింద మరో రూ.20లు తీసుకుంటారంట, మళ్లీ వీటన్నింటికీ 18శాతం జీఎస్టీ కట్టాలట, ఇదంతా వెరసి సామాన్యుడిపై మీరు ఉచితం అనే పేరుతో దాదాపు గత ప్రభుత్వం పెట్టిన రేటుకే మళ్లీ మీరు అమ్ముతున్నారని సుస్పష్టంగా వెల్లడవుతోందన్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు ఇసుక తెచ్చుకునే పరిస్థితి ఉండదని, జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ముందస్తుగానే నిల్వలు చేసుకుని సరఫరా చేసేవాళ్లమని గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో నిల్వ చేసిన ఇసుక ఏమైందని ప్రశ్నించారు. నిల్వ చేసిన ఇసుకను ఉచితంగా ఇచ్చేయాలని, ఎందుకు చార్జ్ చేస్తున్నారని ప్రశ్నించారు. 

35 లక్షల టన్నుల ఇసుక ఏమైంది? 
మా ప్రభుత్వం దిగిపోయి మీ ప్రభుత్వం వచ్చే నాటికి 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో అందుబాటులో ఉందన్నారు. ఇప్పుడు 45 లక్షల టన్నులే అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోందన్నారు. సుమారు 35 లక్షల టన్నుల ఇసుక మాయమైందన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కొట్టేశారా? అని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 2014-19 కాలంలో అనేక జీవోలు తెచ్చారని, లీజుల విషయంలో నియమాలను పూర్తిగా ఉల్లంఘించారన్నారు. 2014 ఆగస్టు 28న ఏపీఎండీసీకి రీచ్ లు అన్నీ అప్పగిస్తూ జీవో తెచ్చారన్నారు. ఆ తర్వాత రీచ్ లు జిల్లా మహిళా సమాఖ్యలకు అందజేశారన్నారు. తదుపరి 2016లో ఈ విధానాన్ని సమీక్ష చేయడం కోసం మంత్రులతో సబ్ కమిటీని వేశారన్నారు. 2016 జనవరి 15న మరో జీవో ఇచ్చారన్నారు. టెండర్ కమ్ ఈ ఆక్షన్ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారన్నారు. అనూహ్యంగా రెండు నెలల పరిధిలోనే దాన్ని పక్కన పెట్టారన్నారు. ఉచితంగా ఇసుక అంటూ మార్చి 4, 2016న ఒక మెమో జారీ చేశారన్నారు. దీనికి అనుగుణంగా ఏప్రిల్‌ 6, 2016న జీవో 43 జారీ చేశారన్నారు. ఇది నాలుగో జీవో అన్నారు. న్యాయసమ్మతం లేకుండా, కసరత్తు లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఉచితంగా రీచ్ లు చేయాలని తెలుగుదేశం నాయకుల చేతుల్లోకి అప్పగించారన్నారు. 

న్యాయస్థానాలు తప్పు పట్టినా మారరా?
ఉచితం పేరుతో సహజ వనరులను పూర్తిగా దోచుకుంటున్నారని, ప్రయివేటు వ్యక్తులు దోపిడీకి పాల్పడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొన్న మాట నిజమా కాదా అని ప్రశ్నించారు. 2016-19 మధ్య కాలంలో దాదాపు వెయ్యికి పైగా అక్రమ కేసులు నమోదయ్యాయన్నారు. ఇది కేవలం గోరంతేనన్నారు. ఉచితంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పెట్టుకుని పూర్తిగా దోచేశారని హైకోర్టు చెప్పిందన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని తుంగలో తొక్కడాన్ని నిరసిస్తున్నామని, వెంటనే ప్రజలకు ఎక్కడికక్కడ అవసరమైన మేరకు ఇసుకను అందించాలని డిమాండ్ చేశారు. ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయవద్దన్నారు.

Back to Top