దళితులపై దాష్టీకం

ధర్మవరంలో దళిత మహిళలను చిత్రహింసలు పెట్టిన టీడీపీ నేతలు

ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం 

అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు 

ఫిర్యాదు ఇచ్చినా కేసు నమోదు చేయని పోలీసులు 

రక్షించండంటూ మంత్రి సత్యకుమార్‌కు బాధితుల వేడుకోలు  

ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల దాషీ్టకాలు మరింత పెచ్చుమీరాయి. దళిత మహిళలను అకారణంగా చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీనగర్‌ బండగుంత వద్ద దళిత మహిళలు పద్మ, కల్పన నివాసం ఉంటున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న కంపచెట్ల వల్ల ఇళ్లలోకి పాములు చేరుతున్నాయని, వాటిని తొలగించాలని మునిసిపల్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మునిసిపల్‌ సిబ్బంది సోమవారం కంపచెట్లు తొలగించేందుకు పూనుకున్నారు.  
విషయం తెలుసుకున్న 34వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్‌ ముతుకూరు బీబీ.. ‘వాళ్లు వైయ‌స్ఆర్‌సీపీ వలంటీర్లుగా పనిచేశారు. వాళ్లు చెబితే కంపచెట్లు ఎలా తొలగిస్తారంటూ మునిసిపల్‌ సిబ్బందిపై దౌర్జ­న్యం చేశారు. దీంతో దళిత మహిళలకు, టీడీపీ వార్డు ఇన్‌చార్జ్‌ ముతుకూరు బీబీకి మధ్య వాగ్వా­దం చోటుచేసుకుంది. బీబీ దళిత మహిళలపై చేయిచేసుకుంది. దీంతో వారు కూడా ఆమెను ప్రతిఘటించారు. 

దీన్ని అవమానంగా భావించిన బీబీ తన సోదరుడైన నాగూర్‌ హుస్సేన్‌కు జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను అనుచరగణంతో దళిత మహిళలను ఇష్టానుసారం చితకబాదారు. మహిళల ఛాతి, తలపై దాడి చేశారు. కొట్టొద్దంటూ కాళ్లు పట్టు­కుని వేడుకున్నా కనికరించలేదు. నాగూరు హుస్సేన్‌ గతంలో నేరచరితుడు కావడంతో మహిళల హాహాకారాలు విన్న స్థానికులు కనీసం విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు. చివరకు బాధిత మహిళలు ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలో పడిపోయారు. 

పట్టించుకోని పోలీసులు 
ఈ అమానుష దాడి సోమవారం జరిగింది. తీవ్రగాయాలతో ఉన్న బాధిత మహిళలు పద్మ, కల్పనను బంధువులు ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల బంధువులు ధర్మవరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాస్పత్రిలో సైతం ఎంఎల్‌సీ (మెడికో లీగల్‌ కేస్‌) నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అక్కడా పట్టించుకోలేదు.

‘చంపేస్తారు.. కాపాడండి’ 
‘సార్‌.. మేం దళిత మహిళలం. ఇంటిముందు కంపచెట్లు తొలగించమని మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు టీడీపీ నాయకులు చెప్పుకోలేని రీతిలో కులం పేరుతో తిడుతూ ఇష్టానుసారం చిత్రవథ చేసి కొట్టారు. పోలీసులకు చెబితే ఎవరూ పట్టించుకోలేదు. మేం సాధారణ మహిళలం. భవిష్యత్‌లో మమ్మల్ని బతకనిస్తారన్న నమ్మకం లేదు. కచి్చతంగా చంపేస్తారు. దయవుంచి కాపాడండి’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్‌ను, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ను సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. 

బాధితులు ధర్మవరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నాగూర్‌హుస్సేన్, ముతుకూరు బీబీ, స్టాలిన్, జగ్గు, కుళ్లాయప్ప, జగదీష్‌, అల్లాబకాష్‌ తమపై దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వివరణ కోరేందుకు టూటౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన  ఆయన అందుబాటులోకి రాలేదు.

Back to Top