తాడేపల్లి: ప్రభుత్వ పెద్దల అవినీతి, చేతకానితనాన్ని ప్రశ్నించకుండా, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను మేనేజ్ చేసిన చంద్రబాబు.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అరెస్టులతో వేధించి భయభ్రాంతులకు గురి చేస్తే తమ ప్రభుత్వానికి తిరుగుండదని భావిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు వి.మనోహర్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు పుత్తా శివశంకర్‌రెడ్డి, కొమ్మూరి కనకారావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, కనకారావు మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై ప్రభుత్వం కక్ష కట్టిందన్న వారు, రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రశ్నిస్తే అరెస్టులు చేసి కేసులు పెడుతోందని, పార్టీ సోషల్ మీడియాకు భయపడే ప్రభుత్వం ఈ పని చేస్తోందని వారు ఆక్షేపించారు. కృష్ణా జిల్లాలో ఒక్కరోజే 42 మందిపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన వారు, వరద సహాయ పనుల్లో చోటు చేసుకున్న అంతులేని అక్రమాలను ప్రశ్నించారని కేసుల నమోదు అత్యంత హేయమని అన్నారు. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన: సుప్రీంకోర్టు నిబంధనలను సైతం ఉల్లంఘించి అర్థరాత్రి వేళ తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం లేదని మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, కొమ్మూరి కనకారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మఫ్టీలో వచ్చే పోలీసులను చూస్తుంటే వచ్చిన వారు పోలీసులో, టీడీపీ కార్యకర్తలో తెలియడం లేదని చెప్పారు. అవసరమైతే ప్రైవేటు కేసులు పెడతాం: సీఎం చంద్రబాబు తన పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైయస్సార్‌సీపీ సోషల్ మీడియా వారియర్స్‌పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మనోహర్‌రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరు పర్చాలని ఉన్నా, పోలీసులు యథేచ్ఛగా ఆ నిబంధన ఉల్లంఘిస్తూ, అచ్చం పచ్చ చొక్కాలు తొడుక్కున్న టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర పోలీసుల వ్యవహారం చూస్తుంటే.. ‘పోలీసులకు తలకాయ ఉన్నది టోపీ పెట్టుకోవడానికే.. కానీ ఆలోచించడానికి కాదు’ అన్న విప్లవకవి చరబండరాజు మాటలు గుర్తొస్తున్నాయని తెలిపారు. టీడీపీ నాయకుల ఆదే«శాలతో ప్రతీకార చర్యలకు దిగితే అవసరమైతే పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామని, చివరకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి పోరాడతామని మనోహర్‌రెడ్డి వెల్లడించారు. రెడ్‌బుక్ మీకు డెత్ బుక్ అవుతుంది: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా నియంతలు హిట్లర్, గడాఫీల తరహాలో పాలన కొనసాగుతోందని.. మరోవైపు అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, హింస పెరిగిపోయాయని పుత్తా శివశంకర్‌రెడ్డి ఆరోపించారు. రేపిస్టులు, రౌడీలు, గూండాలు యథేచ్ఛగా తిరుగుతున్నా అరెస్టు చేయడానికి సంశయిస్తున్న పోలీసులు, ప్రభుత్వ తప్పుడు చర్యలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ తన అఫీషియల్ అకౌంట్లలో మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్, ఆయన కుటుంబం గురించి అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే, ఆ పోస్టులపై సుమోటోగా చర్యలు తీసుకుని.. అలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, నారా లోకేశ్‌లను విచారించవచ్చు కదా అని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం వైయస్ విజయమ్మ కారు ప్రమాదానికి గురైతే టైరు మార్చుకుంటున్న ఫోటోలు టీడీపీ తన అధికారిక ఖాతాలో పెట్టి తల్లిని చంపడానికి వైయస్ జగన్ కుట్ర చేశాడని రాస్తే వారి మీద ఒక్క కేసైనా నమోదు చేశారా అని నిలదీశారు. మరోవైపు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని గతంలో ప్రకటించిన పవన్‌కళ్యాణ్, వారి పాలన వైఫల్యాలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేయిస్తామని బెదిరించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. లోకేశ్ రెడ్ బుక్ పాలన ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో డెత్ బుక్ అవుతుందని పుత్తా శివశంకర్‌రెడ్డి హెచ్చరించారు. 4వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు చాలా మందికి జీతాలు పడలేదన్న ఆయన, మరి ప్రభుత్వం ఈ నాలుగున్నర నెలల్లో చేసిన రూ.60 వేల కోట్ల రుణం ఏమైందని ప్రశ్నించారు. తమది మంచి ప్రభుత్వం అని గప్పాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం అవినీతిపై ప్రశ్నిస్తే భయపడి అరెస్ట్‌లు చేస్తోందని కొమ్మూరి కనకారావు ఆక్షేపించారు. జగన్‌గారు ఒక్క పిలుపునిస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు రోడ్లమీద కొస్తారని, వారిని భయపెట్టడానికి అరెస్టులు చేస్తూ పోతే, పోలీస్ స్టేషన్లు కూడా సరిపోవని ఆయన హెచ్చరించారు.