మా పార్టీ శ్రేణుల‌పై దాడులు త‌ప్ప‌.. ప్ర‌జారోగ్యం ప‌ట్ట‌దా..?

డ‌యేరియాతో ప్ర‌జ‌లు అల్లాడుతుంటే కూట‌మి ప్ర‌భుత్వం ఏం చేస్తోంది..?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైయ‌స్ జ‌గ‌న్ నియ‌మించిన‌ స్పెషలిస్టు డాక్టర్లను ఎందుకు తొల‌గించారు..?

వైయ‌స్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు ఫైర్‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను, కార్యక‌ర్త‌ల‌ను వేధించ‌డం మీద ఉన్న దృష్టి ప్ర‌జారోగ్యంపై లేదా అని కూట‌మి ప్ర‌భుత్వాన్ని వైయ‌స్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్‌మోహ‌న్‌రావు ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో డ‌యేరియా విప‌రీతంగా పెరిగింద‌ని, ర‌క్షిత మంచినీటిని కూడా స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌పోతున్నార‌ని, ప్ర‌జ‌లంతా అనారోగ్యానికి గురై అల్లాడుతుంటే ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని నిల‌దీశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్‌మోహ‌న్‌రావు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల ఆరోగ్య స‌మ‌స్య‌లు ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌వా..? అని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. 

మాజీ ఎమ్మెల్యే మొండితోక‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రావు ఇంకా ఏం మాట్లాడారంటే..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. ప్రజారోగ్యాన్ని అస్సలు పట్టించుకోవడం లేదని, అందుకు ఇప్పుడు విజృంభిస్తున్న డయేరియా రుజువుగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు తెలిపారు. అయినా ఈ ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని, వ్యాధి నుంచి ప్రజలను కాపాడడం లేదని, చివరకు కనీసం రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఆయన ఫైర‌య్యారు.

బాధ్యతతో అప్పటి ప్రభుత్వం 
రాష్ట్రంలో ఆనాడు ప్రజలకు రక్షిత నీటి సరఫరా కోసం పక్కాగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి, ఇంజనీర్లకు ఆ బాధ్యత అప్పగించారని, నీటి నాణ్యత పరీక్షకు అవసరమైన కిట్లు కూడా వారికి అందజేశారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం వినియోగించుకోకుండా, ప్రజారోగ్యంతో ఆటలాడుతోందని, దీని వల్ల వారు నానా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 

ఇప్పుడు ప్రాణాలు బలి
గుంటూరులో మొదలైన డయేరియా, క్రమంగా అన్ని జిల్లాల్లో వ్యాపిస్తోందని, నిన్నటికి నిన్న (15వ తేదీ సోమవారం) కర్నూలు జిల్లా సుంకేశ్వరిలో జ్యోతి అనే నాలుగేళ్ళ పాప చనిపోయిందని, అంతకు ముందు మరోచోట రెండేళ్ళ పాప కూడా చనిపోయిందని మాజీ ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు వెల్లడించారు. నిజానికి ఇది ప్రభుత్వ లెక్క మాత్రమే అన్న ఆయన.. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని పేర్కొన్నారు. 

పాలన గాలికి వదిలి..
ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే కక్ష సాధిస్తూ, నిత్యం దాడులు చేస్తున్న అధికార పార్టీ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి, నెల రోజులు గడిచినా, ఇప్పటికీ పాలనపై దృష్టి పెట్టడం లేదని, ప్రజల సమస్యలు, వారి ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోవడం లేదని డాక్టర్‌ జగన్‌మోహన్‌రావు విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.

నాడు విప్లవాత్మక మార్పులు
విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన నాటి సీఎం వైయస్‌ జగన్, గత 5 ఏళ్లలో వాటిలో విప్లవాత్మక మార్పులు చేశారని, అనేక సంస్కరణలు తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. గ్రామాల్లో ప్రతి 2500 మందికి ఒక క్లినిక్‌ చొప్పున మొత్తం 10,008 విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశారని, అలాగే పట్టణ ప్రాంతాల్లో 500 అర్బన్‌ క్లినిక్స్‌ ఏర్పాటు, కొత్తగా 150 పీహెచ్‌సీల నిర్మాణంతో పాటు, మిగిలిన పీహెచ్‌సీలన్నింటినీ అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. దీంతోపాటు సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పతులు.. చివరకు టీచింగ్‌ ఆస్పతులను ఏ స్థాయిలో అభివృద్ధి చేశామనేది కళ్లకు కనిపిస్తున్నాయని గుర్తు చేశారు.

ప్రభుత్వ నిర్వాకం. రాని మెడికల్‌ సీట్లు
నాడు సీఎం వైయస్‌ జగన్, ఇంకా ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టారని.. వాటిలో 5 కాలేజీలు గత విద్యా సంవత్సరం నుంచే పని చేస్తున్న అంశాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రస్తావించారు. నిజానికి ఈ విద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉందని.. కానీ ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల, వాటికి ఇప్పుడు జాతీయ వైద్య మండలి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. దీని వల్ల రాష్ట్రం కొత్తగా 500 మెడికల్‌ సీట్లు కోల్పోయిందని ఆక్షేపించారు. 

జగన్‌ చిత్తశుద్ధి
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించే ఆరోగ్య సురక్ష.. వంటి కార్యక్రమాలు దేశంలో కూడా ఎక్కడా జరగలేదన్న మాజీ ఎమ్మెల్యే.. అవి ప్రజారోగ్యంపై నాటి సీఎం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఇంకా వైద్య శాఖలో మొత్తం 54 వేల నియామకాలు, కొత్తగా అవసరమైనన్ని 108, 104 సర్వీసులు.. నాటి ప్రభుత్వంలో కీలక నిర్ణయాలని చెప్పారు. 

వైద్యుల తొలగింపు
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం కోసం గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం 152 మంది స్పెషలిస్టు వైద్యులను నియమించగా, వారిని తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని డాక్టర్‌ జగన్‌మోహన్‌రావు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్ట్‌ క్లినిక్‌లకు శ్రీకారం చుడుతూ, ఆ క్లినిక్‌ల నిర్వహణ కోసం 8 స్పెషాలిటీల్లో గత ప్రభుత్వం, 2021లో.. 152 మంది వైద్య నిపుణులను నియమించగా.. వారిని వెంటనే తొలగించాలని వైద్య శాఖ, అన్ని జిల్లాల డీహెచ్‌ఓంఓలను ఆదేశించిందని చెప్పారు. డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ సర్జరీ, జనలర్‌ మెడిసిన్, గైనకాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్‌ విభాగాల్లో మొత్తం 152 మంది వైద్య నిపుణులను నియమించారని.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల, ఆ వైద్య సదుపాయం గ్రామీణ ప్రజలకు దూరమైందని ఆవేదన చెందారు.

మెడికోలకు వెన్నుపోటు
ఏరు దాటాక తప్ప తగలేసే అలవాటు ఉన్న చంద్రబాబు, ఈ రంగంలో కూడా అదే పని చేశారని, వైద్య విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ జగన్‌మోహన్‌రావు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానం ఎత్తేస్తామని, ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇచ్చిన చంద్రబాబు, తీరా అధికారంలోకి వచ్చాక ప్లేట్‌ ఫిరాయించారని, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని కొనసాగిస్తామని ఏకంగా హైకోర్టుకే నివేదించారని వెల్లడించారు. మెడికల్‌ కాలేజీల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లకు సంబంధించిన జీఓ:107, 108ని తాము అధికారంలోకి రాగానే, 100 రోజుల్లో రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా ఆనాడు ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. నిజానికి చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయలేదని, అప్పుడూ, ఆ తర్వాత కూడా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలనే ప్రోత్సహించారని గుర్తు చేశారు.

నందిగామలో ఆస్పత్రి
ఎన్‌టీఆర్‌ జిల్లాలో 100 పడకల ఆసుపత్రి లేకపోవడంతో, ఆనాడు సీఎం వైయస్‌ జగన్‌తో మాట్లాడి, నందిగామ నియోజకవర్గం హైవేపై ఉందని, కాబట్టి అక్కడ ఆ ఆస్పత్రి నిర్మించాలని ఒప్పించి, మంజూరు చేయించుకున్నామని మాజీ ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు వెల్లడించారు. ఆ ఆస్పత్రికి అవసరమైన సిబ్బంది నియామకం పూరై్తందని.. కాగా, ఆస్పత్రికి 5 ఎకరాల స్థలం అవసరం కాగా.. ఆ సేకరణలోపే ప్రభుత్వం మారిందని తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ ఆస్పత్రి ఏర్పాటుపై, ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని పేర్కొన్న ఆయన, వీలైనంత త్వరగా నిర్మాణం చేయాలని కోరారు.

Back to Top