తాడేపల్లి: సోషల్‌మీడియా కార్యకర్తలకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడు ఎం. మనోహర్‌రెడ్డి భరోసానిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం, పోలీసులు దాష్టీకానికి పాల్పడుతున్నారని, రాష్ట్రంలో అరాచక పాలనకు ఇది నిదర్శనమని వారు ధ్వజమెత్తారు. అరెస్టులు చేసినవారి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించడంలేదని, న్యాయపరంగా వారికి సహాయం అందకుండా వారి హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై విమర్శలు సంధిస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం దమనకాండకు దిగుతోందన్నారు. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛపై దాడిగా దీన్ని అభివర్ణించారు. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నవారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారపార్టీ వారి ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను కచ్చితంగా కోర్టుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసు అధికారులపై కచ్చితంగా కేసులు నమోదుచేసి వారిని కోర్టుకులాగుతామని హెచ్చరించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడమని ప్రశ్నించాఉరు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న పోలీసులను గుర్తిస్తున్నామన్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారిని వెంటనే విడిచిపెట్టాలని, చట్టాన్ని మీరితే సహించబోమన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపితే.. ఈప్రభుత్వానికి అదే డెత్‌బుక్ అవుతుందని హెచ్చరించారు. ఒక్కరోజులోనే నమోదైన వివరాలను వెల్లడించారు. గుడివాడలో రెండు కేసులను నమోదుచేశారన్నారు. ఇప్పటికే పలుమార్లు పోలీసుల వేధింపులకు గురైన ఇంటూరి రవికిరణ్‌ను మళ్లీ రేపు హాజరుకావాల్సిందిగా పోలీసులు సమాచారం ఇచ్చారన్నారు. నందిగామ, భీమవరం, కొల్లిపర, వినుకొండ, వింజమూరుల్లో కేసులు నమోదుచేశారని చెప్పారు. లండన్‌లో ఉన్న వారిపై కూడా కేసులు నమోదు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు.