తాడేపల్లి: రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే పట్టించుకోని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, దురుద్దేశంతోనే రాయలసీమలో యువతను రెచ్చగొట్టేందుకు గాలివీడు వచ్చారని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ఆక్షేపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో చివరకు న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన వెల్లడించారు. అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గాలివీడు ఘటన. టీడీపీ కుట్ర: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాటలో భాగంగా, రాయచోటిలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా కూడా పని చేసిన సీనియర్ లాయర్ సుదర్శన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం తర్వాత స్వగ్రామానికి వెళ్తూ, మధ్యలో గాలివీడు ఎంపీపీ కార్యాలయం చేరుకున్నారు. అందుకు కారణం ఆయన తల్లి ఎంపీపీ. ఆమె గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో సమావేశానికి హాజరవుతున్నారు. ఆమెను కలవడానికి సుదర్శన్‌రెడ్డి ఆ కార్యాలయానికి వెళ్లారు. దీన్ని ముందే పసిగట్టిన టీడీపీ శ్రేణులు సమావేశాన్ని రసాభాస చేయడానికి సిద్ధమయ్యారు. సమావేశంలో ఎలాగైనా రచ్చ చేయాలని నిర్ణయించిన టీడీపీ శ్రేణులు దాదాపు 100 మందిని సమీకరించి కారం పొడి, పెప్పర్ పౌడర్‌తో దాడి చేసే ప్రయత్నం చేశారు. ముందస్తుగానే ఎంపీడీవో, ఇతర అధికారులను ప్రలోభాలకు గురిచేసి సుదర్శన్‌రెడ్డి దాడి చేశాడని కట్టుకథ అల్లారు. టీడీపీ శ్రేణులు వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద చేస్తున్న దాడులను మరుగున పడేసేందుకు చేసిన పన్నాగం ఇది. పోలీసుల దారుణ వ్యవహారం: ఈ ఘటనలో సుదర్శన్‌రెడ్డి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది. సీనియర్ న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా ఆయన ప్రజలకు సేవలందిస్తున్నారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ రికార్డు కూడా లేదు. అలాంటి వ్యక్తిని టెర్రరిస్టు, సంఘ విద్రోహ శక్తిని తీసుకెళ్లినట్టు చొక్కా పట్టుకుని తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవాదిపై దాడిని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా ఖండించాలని కోరుతున్నాం. వైయస్ఆర్‌సీపీని కట్టడి చేసే కుట్ర: నిజానికి అక్కడ ఎంపీడీఓకు ఎలాంటి దెబ్బలు తగలకపోయినా, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తమ్ముడు లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయనను కడప రిమ్స్‌కు తరలించారు. గాలివీడు మండలంలో చురుకుగా పని చేస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులను గుర్తించి, వారిని కట్టడి చేయడం కోసం కుట్ర చేస్తూ, అందరిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు విచారకరం: పరామర్శ పేరుతో వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోకుండా, రాజకీయ వ్యాఖ్యలు చేయడం విచారకరం. రాజకీయ దురుద్దేశంతో గాలివీడు వచ్చి రాయలసీమ యువతను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి 11 సీట్లే వచ్చాయి. తొక్క తీసి నేల మీద కూర్చోబెడతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. దాడి చేసిన వారిని నిలదీయకుండా, బాధితులను పరామర్శించకుండా రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రెచ్చగొట్టేలా మాట్లాడడం ఏ మాత్రం సరికాదు. అవేవీ పవన్‌కు కనిపించడం లేదా?: పోలీసుల కళ్లెదుటే పోలీస్ స్టేషన్లలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేస్తుంటే పవన్ నోరు మెదపడం లేదు. మా పార్టీ నాయకుల ఆస్తులు లాక్కుంటుంటే నోరెత్తడం లేదు. మధ్యాహ్న భోజన పథకంలో కార్మికులు మొదలు వాలంటీర్ల వరకు ఉద్యోగాల నుంచి పీకిపారేస్తున్నా న్యాయం చేయడం లేదు. ఎవరైనా నిరసన తెలిపితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని కూటమి పాలన వైఫల్యంపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. అయినా ఎక్కడా బాధితులను పవన్‌కళ్యాణ్ పరామర్శించిన దాఖలా లేదు. చివరకు తన సొంత నియోజకవర్గంలో జరిగిన అత్యాచార ఘటన విషయంలోనూ బాధితురాలకి అండగా ఉంటానని భరోసా ఇచ్చింది లేదు. అరాచకాలు చేస్తున్న సొంత పార్టీ వారిని కనీసం కట్టడి చేయడం లేదు. సమగ్ర దర్యాప్తు చేయాలి: అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన ఘటనపై నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు చేయాలి. ఈ ఘటనలో కీలకంగా ఉన్న సుదర్శన్‌రెడ్డి, ఆయన తల్లిగారి కాల్ డేటాతోపాటు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఆయన సోదరుడు, ఎంపీడీవో, ఇతర అధికారుల కాల్‌డేటాను సమగ్రంగా పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లాయర్లకే రక్షణ లేదు: అనంతపురంలో ఒక సివిల్ పంచాయతీలో శేషాద్రి అనే న్యాయవాదిని స్టేషన్‌కి పిలిపించి, సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బంది అవమానించారు. తీవ్ర మనోవేదనకు గురైన ఆ దివ్యాంగ న్యాయవాది ప్రాణాలు విడిచారు. సివిల్ పంచాయతీల్లో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. లాయర్ మృతికి బాధ్యులైన పోలీసులపై ప్రైవేట్ కేసులు కూడా వేస్తామని మనోహర్‌రెడ్డి వివరించారు.