రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు? 

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సూటి ప్రశ్న‌

మోసంతో గెలిచారు.. పాలనలో ఓడారు 
 
చంద్రబాబు ఆరు నెలల పాలనంతా వంచన, మోసం

హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం 

సూపర్‌ సిక్స్‌ హామీల పేరుతో లబ్ధిదారులకు దగా

ఆరు నెలల్లోనే లబ్ధిదారులకు రూ.60 వేల కోట్లు బకాయి

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడి

2024లో రెండు ప్రభుత్వాల పాలన ప్రజలు గమనించారు

ఎవరి పాలన ఎలా ఉందనేది ప్రజలకు స్పష్టంగా తెలిసింది

కూటమి పాలన మోసాలను ప్రజలంతా గుర్తించారు

ఇప్పటికైనా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై వైఖరి ఏమిటో చెప్పాలి

స్టీల్‌ప్లాంట్‌పై ప్రధానితో స్పష్టమైన ప్రకటన చేయించాలి

ప్రెస్‌మీట్‌లో గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌
 

విశాఖపట్నం:  ముఖ్య‌మంత్రి చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సూటిగా ప్ర‌శ్నించారు. ఆ ర‌హ‌స్యం ఏంటో ప్రజలకు చెప్పాలని ఆయ‌న డిమాండు చేశారు. నమ్మకానికి, మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని పేర్కొన్నారు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో సూపర్‌ సిక్స్‌ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు. మంగళవారం విశాఖ‌లోని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాల‌యంలో గుడివాడ అమ‌ర్నాథ్ మీడియాతో మాట్లాడారు.

గుడివాడ అమ‌ర్నాథ్ ఏమ‌న్నార‌టే..

– ఈ ఏడాది.. మొదటి ఐదు నెలల వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం, ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనతో ప్రజలు నమ్మకానికి, మోసానికి మధ్య వ్యత్యాసాన్ని పూర్తిగా గ్రహించారు. 
– ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిజాయితీగా పని చేసిన ప్రభుత్వానికి, బూటకపు హామీలిచ్చి నమ్మించి మోసం  చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుందనేది గడిచిన ఏడాదిలో రెండు ప్రభుత్వాల పాలనతో ప్రజలు స్పష్టమైన అవగాహనకొచ్చారు. 
– మోసపు హామీలతో అధికారం సంపాదించారే కానీ, ఆరు నెలల పాలనతో ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం సంపాదించలేకపోయింది.  
– వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు, అర్హతే ప్రామాణికంగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. 
– డీబీటీ విధానం ద్వారా ఐదేళ్లలో సంక్షేమ పథకాల రూపంలో దాదాపు రూ. 2.74 లక్షల కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశాం. రూ.10 వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ సంస్థలకు థీటుగా తీర్చిదిద్దాం. 
– అదే నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను కూడా కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దాం. 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టాం. రామాయపట్నం, మూలపేట, బందర్‌ పోర్టు నిర్మాణాలు చేపట్టి దాదాపు పూర్తి చేసే స్థాయికి తీసుకొచ్చాం. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, ఫిషింగ్‌ హార్బర్లు నిర్మించాం.
– ఉత్తరాంధ్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ప్రారంభించాం. దేశంలో మొత్తం 11 ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో వస్తే ఒక్క ఏపీకే 3 ఇండస్ట్రియల్‌ కారిడార్‌ లు తీసుకొచ్చిన ఘనత వైయ‌స్‌ జగన్‌ నేతత్వంలోనే సాధించగలిగాం. అధికారంలో ఉన్నంత కాలం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఏపీని నిలెబట్టాం. – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చూపించాం. 

– మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని చెప్పడానికి ఈ ఆరు నెలల పాలనే సాక్ష్యం. 
– అధికారంలోకి రావడంతోనే డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలిస్తామని మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. ఈ ఆరు నెలల్లో నోటిఫికేషన్‌ ఇవ్వకుండా టీచర్‌ ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాడు.  
– పెట్టుబడి సాయం కింద ఏటా రైతులకిస్తామన్న రూ.20 వేలు ఇవ్వలేదు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్న తల్లికి వందనం అందడం లేదు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.1500 హామీకి అతీగతీ లేదు. 20 లక్షల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలిస్తామన్నారు. లేనిపక్షంలో నెలకు రూ.3 వేలు చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. 
– ఇవి కాకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్‌ ఖర్చుల మొత్తం బకాయి రూ.3,900 కోట్లు చెల్లించకుండా వదిలేశారు.
– ఆరోగ్యశ్రీ నెట్‌వర్స్‌ ఆస్పత్రుల బకాయిలు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించకపోవడంతో రోగులకు వైద్యం అందించని దుస్థితి నెలకొంది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కదాంతో మమ అనిపించారు.
– ఉచిత బస్సు ప్రయాణంపై ఒకసారి దీపావళి, ఒకసారి సంక్రాంతి, ఇప్పుడు ఉగాది అని మాయమాటలు చెబుతున్నారు. మోసం చేయడానికి కాకపోతే ఏ సంవత్సరం ఇస్తారో ఏ పండక్కి ఇస్తారో స్పష్టంగా చెప్పరు.  

చంద్రబాబు అప్పులతో రాష్ట్రం శ్రీలంక కాలేదా..?
– నాడు రాష్ట్రం శ్రీలంక అయిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఆయన నేతృత్వంలో కూటమి, అధికారంలోకి వచ్చాక, ఆరు నెలల్లోనే ఏకంగా  రూ.1.12 లక్షల కోట్ల అప్పు చేసింది. మరి ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయినట్టు కాదా..? 

‘ఏడీఆర్‌’ రిపోర్టుపై ఇప్పుడేమంటారు?:
– దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు నాయకుడు అని ఏడీఆర్‌ రిపోర్టు బయటపెట్టింది. నాడు రూ.400 కోట్లతో మా నాయకుడు వైఎస్‌ జగన్‌ ధనిక సీఎంగా ఇదే సంస్థ రిపోర్టు విడుదల చేస్తే.. హాహాకారాలు చేసిన చంద్రబాబు, ఎల్లో మీడియా.. ఈరోజు దానికి డబుల్‌ రూ.935 కోట్లతో చంద్రబాబు దేశంలోనే రిచ్చెస్ట్‌ సీఎంగా నిలిచిన దానికి ఏం సమాధానం చెబుతారు?.
– పూర్‌ టు రిచ్‌ అనే చంద్రబాబు హామీ పేదలకు చెప్పాలి. పాల వ్యాపారంతో వేల కోట్లు ఎలా సంపాదించవచ్చో, ఆ కిటుకు చెబితే అందరూ ధనవంతులవుతారు.

లబ్ధిదారుల బకాయిలు రూ.60 వేల కోట్లు:
– సూపర్‌ సిక్స్‌ పథకాల రూపంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం గడిచిన ఆరు నెలల్లో రూ.60 వేల కోట్లు బకాయి పడింది. 
– రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వాల్సి ఉంది. దీనికి నెలకు రూ.3 వేల కోట్లు కావాలి. అదంతా బకాయి. ఏకంగా రూ.18 వేల కోట్లకు చేరింది.
– పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వలేదు. ఆ బకాయి రూ.10 వేల కోట్లకు చేరింది.
– తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలుంటే అందరికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా 80 లక్షల మంది లబ్ధిదారులకు రూ.12 వేల కోట్లు బకాయి పడ్డారు. 
– నిరుద్యోగ భృతి కింద 20 లక్షల మంది యువతకు నెలకు రూ.600 కోట్ల చొప్పున, ఈ ఆరు నెలల్లో రూ.3600 వేల కోట్లు బకాయి పడ్డారు.  
– ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన బకాయిలు రూ.900 కోట్లు, దీపం పథకం సిలిండర్లు.. ఇలా అన్ని లెక్క తీస్తే లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం దాదాపు రూ.60 వేల కోట్లకుౖ పైగా బకాయి పడింది. 

ప్రభుత్వ ఆదాయం పడిపోయింది
– కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ ఆదాయం దారుణంగా  పడిపోయింది. వ్యాపారాలు లేవు. నగదు చలామణి కూడా తగ్గింది. కూటమి పాలన కష్టాలకు ఆఖరుకి ఆలయాల్లో హుండీ ఆదాయం కూడా పడిపోయింది. దేవుడికి భక్తులు హుండీలో కానుకలు కూడా వేయలేకపోతున్నారు. 
– సంక్షేమ పథకాలు అమలు చేయక, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయక.. మరి ఈ ఆరు నెలల్లో చేసిన రూ.1.12 లక్షల కోట్ల అప్పంతా ఏమైపోతున్నట్టు?. దీనికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. 
– వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. సీఎంకు పాలనపై పట్టు తప్పింది. చివరికి బీసీ మంత్రులను టార్గెట్‌ చేసే దాకా దిగజారిపోయారు. 
– మంత్రులని కూడా చూడకుండా బీసీలను వేధిస్తున్నారు. మా పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ఒక కార్యక్రమంలో కలవడమే తప్పన్నట్టు.. సీనియర్‌ మంత్రి పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషలతో వరుసపెట్టి క్షమాపణలు చెప్పించారు. 
– ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌.. మా నాయకులు బొత్స సత్యనారాయణకు ఎయిర్‌పోర్టులో కనపడినప్పుడు మర్యాదపూర్వకంగా నమస్కారం చేసిన పాపానికి ఆయనతోనూ క్షమాపణలు చెప్పించుకునే దాకా వదల్లేదు. 

– విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రంతో స్పష్టమైన ప్రకటన చేయించలేకపోయారు. ఆఖరుకి పరిస్థితి ఎలా తయారైందంటే.. యూనియన్‌ నాయకులు స్థానిక ఎంపీ భరత్‌ను కలిసినప్పుడు ఉద్యోగులకు జీతాలు అందడం లేదా? అని అంటున్నారంటే వారి చిత్తశుద్ధి అర్థమవుతుంది. 
– ఇద్దరే ఇద్దరు ఎంపీలతో జేడీఎస్‌ కర్నాటకలో స్టీల్‌ప్లాంట్‌కు రూ.15 వేల కోట్లు కేటాయించుకుంటే.. 21 మంది ఎంపీలతో కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను కాపాడలేరా..?  ఆంధ్రుల హక్కుగా ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ కోసం అల్టిమేటం ఇవ్వలేరా..? 
– వచ్చే నెల 8న ప్రధాని మోదీ వచ్చినప్పుడైనా స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయించాలి. 

రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు:
– ఇంత కాలం కూటమి ప్రభుత్వానికి హామీలు నెరవేర్చే సమయం ఇచ్చాం. కానీ వారు నిలబెట్టుకోలేక పోయారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం. హామీల అమలు కోసం పోరాడుతాం.
– ఇప్పటికే రైతు సమస్యలపై, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై రెండుసార్లు ఉద్యమించాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల కోసం జనవరి 29న మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం.   
– పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్, 26 జిల్లాలు పర్యటించి, నాయకులు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించి,  పోరాట కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేస్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వివరించారు.

Back to Top