పీఏసీ చరిత్రలో ఇది చీకటిరోజు 

ఛైర్మన్‌ పదవి ప్రతిపక్షానికి రానివ్వని వైనం

ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ధ్వజం

పీఏసీ ఏర్పాటుతో కూటమి ప్రభుత్వ పరువు పోయింది

ప్రతిపక్షానికి ఛైర్మన్‌ పదవిచ్చే సంప్రదాయాన్ని కాలరాశారు

ఆర్థిక విధ్వంసం సృష్టికే విపక్షానికి ఛైర్మన్‌ పదవి ఇవ్వలేదు 

కూటమి అవినీతి కుంభకోణాలు బయటకు రావొద్దనే కుట్ర

రాష్ట్రంలో తాలిబన్‌ పాలన నడుస్తుందనడానికి ఇదే సంకేతం  

ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ స్పష్టీకరణ

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చూసి ఎందుకు వణుకుతున్నారు

ఏ కమిటీల్లోనూ చోటు కల్పించకుండా జాగ్రత్త పడుతున్నారు

దేశంలో అవినీతి వ్యవహారాలను బయటపెట్టింది పీఏసీ ఛైర్మన్లే

ఇద్దరు సభ్యులున్న బీజేపీకి పీఏసీ చైర్మన్‌ పదవి దక్కింది

ప్రజాస్వామ్య వ్యవస్ధను గౌరవించే టీడీపీకి పీఏసీ పదవిచ్చాం

ప్రెస్‌మీట్‌లో తాటిపర్తి చంద్రశేఖర్‌ ప్రస్తావన

తాడేపల్లి: పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని.. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే ఖర్చులపై  పీఏసీ నిఘా ఉంటుందనే ఇలాంటి కుట్ర చేశారన్నారు. శుక్ర‌వారం ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ మీడియాతో మాట్లాడారు.

 

పీఏసీ చరిత్రలో చీకటిరోజు:
– స్వతంత్ర భారత చరిత్రతో పాటు, రాష్ట్ర ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చరిత్రలో ఈరోజును చీకటి రోజుగా చూడొచ్చు. సంప్రదాయబద్ధంగా దక్కాల్సిన పీఏసీ ఛైర్మన్‌ పదవిని విపక్ష వైయస్సార్‌సీపీకి దక్కకుండా కుట్ర చేశారు. పీఏసీ ఏర్పాటుతో కూటమి ప్రభుత్వం పరువు పోయింది.

శతాబ్ధ కాలంగా పీఏసీ వ్యవస్థ:
– ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ఖర్చులపై నిఘా పెట్టి ప్రజల డబ్బు వృథా కాకుండా వాచ్‌ డాగ్‌లా పని చేయడమే పీఏసీ ముఖ్య ఉద్దేశం. బ్రిటిషర్ల కాలం 1921 నుంచే ఈ వ్యవస్థ కొనసాగుతోంది. అయితే స్వాతంత్య్రం వచ్చే వరకు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లోని ఫైనాన్స్‌ మెంబర్‌ను పీఏసీ ఛైర్మన్‌గా ఎన్నుకునేవారు.

స్వాతంత్య్రానంతరం మారిన పద్ధతి:
– దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఆర్థిక మంత్రి పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించడం మొదలైంది. ఆ తర్వాత భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత.. అంటే జనవరి 26, 1950 నుంచి పీఏసీ ఛైర్మన్‌ ఎంపిక విధానం మారింది. పీఏసీ ఛైర్మన్‌ పదవి నుంచి ఆర్థిక మంత్రిని తప్పించి, విపక్షానికి ఆ పదవి ఇచ్చే సంప్రదాయం మొదలైంది.
– ఇంకా వ్యవస్థలో ఉన్నవారే పీఏసీలో ఉంటే, ఆర్థిక అవకతవకలు ఎత్తిచూపే అవకాశం ఉండదన్న నమ్మకంతో ఆ మంత్రిత్వ శాఖలోని వ్యక్తులు సభ్యులుగా ఉండకూడదని కూడా నిర్ణయించారు.
– అదే సంప్రదాయ పరంపరలో 1967లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ, సభలో 44 మంది సభ్యులున్న పార్టీకి చెందిన ఎంఆర్‌ మసానీని పీఏసీలో నియమించారు. 1981–82లో పార్లమెంట్‌లో ఇద్దరే సభ్యులున్న బీజేపీకి సంబంధించిన సతీష్‌ అగర్వాల్‌ను పీఏసీలో నియమించారు. 
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985లో టీడీపీ గెలవగా, కాంగ్రెస్‌కు 30 సీట్లు మాత్రమే వచ్చినా, ఏరాసు అయ్యపురెడ్డిని పీఏసీ ఛైర్మన్‌ను చేశారు.

పీఏసీల ద్వారానే వెలుగులోకి ఆర్థిక అక్రమాలు:
– రాజీవ్‌గాంధీ ప్రభుత్వాన్ని వణికించిన 1.4 బిలియన్ల బోఫోర్స్‌ కుంభకోణం 1980–90 మధ్యలో, చంద్రజిత్‌యాదవ్‌ పీఏసీ చైర్మన్‌గా ఉన్నప్పుడే బయటపడింది. 2జీ స్ప్రెక్ట్రం కేసు కూడా మురళీమనోహర్‌ జోషి పీఏసీ చైర్మన్‌గా ఉండగానే వెలుగు చూసింది. ఆ సమయంలో పీఏసీ అభ్యంతరాల మేరకు సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్సులు రద్దు చేసింది. 
– 2010లో కోల్గేట్‌ వ్యవహారం, ఆ తర్వాత కామన్వెల్త్‌ గేమ్స్‌లో జరిగిన అవినీతి, హర్షత్‌ మెహతా స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణం.. ఇవన్నీ వెలుగులోకి తెచ్చింది పీఏసీలే.

ఇప్పుడు కూటమి ప్రభుత్వ కుట్ర:
– అంత ఘనచరిత్ర కలిగిన పీఏసీల పరువు తీస్తూ, దశాబ్ధాల సంప్రదాయానికి మంగళం పాడుతూ, కుట్ర చేసిన కూటమి ప్రభుత్వం, పీఏసీ ఛైర్మన్‌ పదవి విపక్షానికి రాకుండా అడ్డుకుంది. తద్వారా తమ యథేచ్ఛ దోపిడిని ఎవరూ ప్రశ్నించకూడదన్న ధోరణితో కూటమి ప్రభుత్వం వ్యవహరించింది.
– పీఏసీ ఛైర్మన్‌ పదవి విపక్షానికి ఇవ్వడం ఇష్టం లేకపోతే, నామినేషన్‌ ప్రక్రియను ఎందుకు తీసుకొచ్చారు? దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారు? అప్పుడు కూడా అసెంబ్లీ అధికారులు అందుబాటులో లేకుండా మూడు గంటలపాటు మేము ఎదురుచూసేలా చేశారు?.

ఆరోజు మేమూ మీలా వ్యవహరించి ఉంటే..:
– అసలు 11 మంది సభ్యులున్న వైయస్సార్‌సీపీకి పీఏసీ ఛైర్మన్‌ పదవి ఇవ్వకూడదని ఎక్కడైనా ఉందా? గత మా ప్రభుత్వ హయాంలో టీడీపీ   23 మంది సభ్యులతో గెలిచినా, తర్వాత ఆ పార్టీ బలం 18కి తగ్గినా కూడా మేము పీఏసీ ఛైర్మన్‌ పదవి పయ్యావుల కేశవ్‌కు ఇచ్చాం.
– ఈరోజు మీరు చేసినట్లు ఆరోజు మేం కూడా ఓటింగ్‌కి వెళ్లుంటే మీకు ఆ పదవి దక్కేదా? ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాం కాబట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాం కాబట్టి, బలం లేకపోయినా టీడీపీకి ఆ పదవి ఇచ్చాం.
– జగన్‌గారు భయపడే అసెంబ్లీకి రావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏసీ ఛైర్మన్‌ అయితే మీకెందుకు భయం? ఆయనకు ఆ పదవి రాకుండా ఎందుకు అడ్డుకున్నారు?. 
– మూడు కమిటీలకు సంబంధించి సభ్యుల్లో ప్రతిపక్ష వైయస్సార్‌సీపీ నుంచి ఒక్కరికి కూడా చోటు కల్పించలేదు? ఎందుకు?
– పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా పీఏసీని ప్రతిపక్షానికే ఇచ్చేవారు. ఎప్పుడైతే దేశం తాలిబన్ల చేతికి వెళ్లిందో అప్పుడే ఈ వ్యవస్థను రద్దు చేశారు.. ఇదే తరహాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాలిబన్ల మాదిరిగా పీఏసీ చైర్మన్‌ పదవిని తీసుకున్నారంటే ప్రజాస్వామ్యంపై మీకున్న గౌరవం ఏపాటిదో అర్థమవుతోందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు.

Back to Top