అనంతపురం: తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నారని, ఆయనది దివాళాకోరు రాజకీయమని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. నాలుగున్నరేళ్లు నిద్రపోయి ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఉరవకొండలో పేదల కాలనీకి పయ్యావుల కేశవ్ పేరు పెట్టడంపై శుక్రవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉరవకొండలో పేదల కోసం 88 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఘనత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక్క ఎకరా భూమి కూడా అదనంగా కేటాయించలేదని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పేదలకు ఏ పని చేయకపోయినా కాలనీకి తన పేరు పెట్టించుకోవటం.. పయ్యావుల కేశవ్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమంటూ మండిపడ్డారు. ఉరవకొండ రెవెన్యూ కార్యాలయాలను టీడీపీ ఆఫీసుగా మార్చేయటం దురదృష్టకరమన్నారు.