వైయస్ఆర్ జిల్లా: అక్రమ అరెస్టులు, కూటమి ప్రభుత్వ తీరుపై వైయస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను, నాయకులను పగలు రాత్రి తేడా లేకుండా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మా పీఏ రాఘవరెడ్డి నిత్యం పోలీసులతో మాట్లాడే వ్యక్తి. కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఇంటికి రాత్రులు వెళ్లి ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేశారు. లాఠీలతో డోర్లు కొట్టి ఇంట్లో వస్తువులను చిందరవందర చేసి భయపెట్టారు. భయాందోళన గురి చేయకుండా స్టేషన్‌కు రావాలని పిలిచినా రాఘవ వెళ్లేవారు. అలాంటిది ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం పోలీసులకు ఏముంది?’’ అంటూ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. వర్రా రవీంద్రారెడ్డిని నిన్న మహబూబ్‌నగర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు ఎల్లో మీడియానే రాసింది. కానీ పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు. వర్రా రవిని పోలీసులు అరెస్టు చేయలేదని.. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా అంతా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మాట్లాడుతున్నారు. వర్రా రవి అరెస్టుకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని... వర్రా రవికి ఏదైనా జరిగితే వైయస్ఆర్‌సీపీదే బాధ్యత అంటూ బీటెక్ రవి మాట్లాడారు. వాస్తవాలు తెలియకుండా బీటెక్ రవి ఇలా అబద్ధాలు మాట్లాడటం సరికాదు. నిన్న రాత్రి అంతా కడప డీటీసీలో వర్రా రవిని వేధించారు. పోలీసుల చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. తక్షణమే వర్రా రవిని కోర్టులో హాజరు పరచాలని అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.