ఏపీలో రెడ్‌ బుక్ రాజ్యాంగం అమ‌లు

లోక్‌స‌భ‌లో రాజ్యాంగంపై చర్చలో ఎంపీ గురుమూర్తి 

ఢిల్లీ: ఏపీలో రాజ్యాంగం బదులుగా రెడ్‌ బుక్‌ పాలన జరుగుతోందని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా  వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఆయన పాల్గొన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతోందని.. కూటమి ప్రభుత్వం కేవలం వట్టి మాటలకే పరిమితమైందన్నారు. గత వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం సామాజిక న్యాయానికి, పారదర్శకతకు అద్దం పట్టిందన్న గురుమూర్తి.. జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, వైయ‌స్ఆర్ చేయూత లాంటి పథకాలు అణగారిన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.

ఈ పథకాలు ఆయా వర్గాలను పైకి తీసుకొచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, వారి అభివృద్ధికి పాటుపడ్డారు. రాజ్యాంగం ఒక జీవన పత్రం. అసమానతలను తగ్గించే ఒక సాధనం రాజ్యాంగం. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సోదర భావనకు రాజ్యాంగం పెద్దపీట వేసింది. కేశవానంద భారతి కేసు రాజ్యాంగం పునాదులను మరోసారి నిర్వచించింది. 75 ఏళ్ల ఈ రాజ్యాంగ ప్రయాణంలో ఎంతో ప్రగతి సాధించాం.’’ అని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.

‘‘ప్రపంచంలోనే అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించింది. అనేక కోట్ల మంది ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకున్నారు. మన రాజ్యాంగ సంస్థలపై విశ్వాసాన్ని ప్రకటించారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు నిర్ణయాత్మక  చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ ఎకానమీ నుంచి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది.

అక్షరాస్యతలో 74 శాతం సాధించాం. జీవన స్థాయి 70 ఏళ్లకు పెరిగింది. వాతావరణం మార్పులు జీ-20 విషయాల్లో భారత ప్రపంచం నాయకత్వం వహిస్తుంది. పెరుగుతున్న ఆర్థిక సమానతలు ఇంకా సవాలుగానే పరిణమిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు, లింగ అసమానత్వాన్ని రూపుమాపితేనే నిజమైన సమానత్వం వస్తుంద‌ని ఎంపీ గురుమూర్తి చెప్పారు.

Back to Top