ముచ్చుమర్రి ఘటన ముమ్మాటికీ బాబు సర్కార్‌ వైఫల్యమే 

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

బాలిక తల్లిదండ్రులకు వైయ‌స్ జ‌గ‌న్ అండ‌

రూ.10 ల‌క్ష‌ల చెక్కు అందించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

నంద్యాల జిల్లా: ముచ్చుమర్రి బాలిక ఘటన కలిచివేసిందని.. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు పాప ఆచూకీ దొరక లేదని నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఘటన కేసులో నిందితులకు బెయిల్ లభించడంపై ఆయన  స్పందిస్తూ.. దిశ చట్టాన్ని అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేసేశారన్నారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలన్నారు. బాలిక తల్లిదండ్రులకు వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పడూ అండగా ఉంటుందన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 10 ల‌క్ష‌లు మంజూరు చేశార‌ని, ఆ చెక్కును ఇవాళ అంద‌జేసిన‌ట్లు కాట‌సాని తెలిపారు.

బాబు, పవన్ ఎందుకు స్పందించడం లేదు:  ఎమ్మెల్యే విరూపాక్షి
ముచ్చుమర్రి బాలిక ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మహిళలపై అరాచకాలు పెరిగాయని మండిపడ్డారు. ముచ్చుమర్రి బాలిక ఘటన ముమ్మాటికీ ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు అంటూ విరుపాక్షి ప్రశ్నించారు.

హోంమంత్రికి ఈ ఘటనలు కనబడవా?: ఇషాక్‌ బాషా
ముచ్చుమర్రి బాలిక లైంగికదాడి ఘటన చాలా బాధాకరమని.. నాలుగు నెలలు గడిచిన ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేదని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అన్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు బెయిల్ వచ్చింది. రాష్ట్ర హోంమంత్రికి ఈ ఘటనలు కనబడుతున్నాయా?. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయ‌ని ఇషాక్‌ బాషా చెప్పారు. కార్య‌క్ర‌మంలో నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ధార సుధీర్‌, గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, జెడ్పీ చైర్మ‌న్ ఎర్ర‌బోతుల పాపిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top