తాడేపల్లి: కూటమి సర్కార్ రాష్ట్రంలోని వలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మోసపూరిత హామీలను నమ్మి అమాయక వలంటీర్లు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లకు ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీ మేరకు పెంచుతామన్న రూ.10వేలతో ఇప్పటివరకు ఉన్న మొత్తం బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. వలంటీర్లకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఎన్నికలకు ముందు ఉగాది పండుగ రోజున అంటే గత ఏడాది ఏప్రిల్ 9న ఉగాది పచ్చడి తింటూ... వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతానని చంద్రబాబు తియ్యని మాటలు చెప్పాడు. వలంటీర్లకు చంద్రబాబు బొనాంజా అంటూ ఆయనకు వంతపాడే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పతాక శీర్షికల్లో కథనాలను ప్రచురించాయి. కూటమి మేనిఫెస్టోలో కూడా వలంటీర్ల గౌరవ వేతనం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతామన్న హామీని పొందుపరిచారు. దేవుడు, పంచాగర్తల సమక్షంలో హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక 2.66 లక్షల మంది వలంటీర్లను రోడ్డుపాలు చేశారు. కనీసం విధుల్లోకి కూడా తీసుకోకుండా దారుణంగా మోసం చేశారు. వారి కుటుంబాలతో ఓటేయించుకుని అవసరం తీరాక వారికి వెన్నుపోటు పొడిచారు. ఉద్యోగాలు తీసేయనని, వలంటీర్లు రూ. 10 వేల దగ్గర ఆగిపోకుండా రూ. 50 వేలు, లక్ష సంపాదించుకునే అవకాశాలు కల్పిస్తానని చెప్పి మరీ అధికారంలోకి వచ్చాక వలంటీర్ వ్యవస్థనే లేకుండా చేసిన మోసగాడు చంద్రబాబు. వలంటీర్లకు అన్నగా నిలబడతానన్న పవన్ ఎక్కడా? 2024 జూన్ 1న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వలంటీర్లలో లక్ష మంది మహిళలున్నారు. వారందరికీ అన్నగా చెబుతున్నాను, మీకు రూ. 5వేలు ఇస్తే ఇంకో రూ. 5 వేలు కలిపి రూ. 10 వేలు ఇచ్చే మనసున్న వ్యక్తిని అని అధికారంలోకి వచ్చాక కూడా హామీ ఇచ్చాడు. నేను ఎవరి పొట్ట కొట్టే వ్యక్తిని కాదని నమ్మబలికాడు. ఇప్పుడు ఆయన ఎక్కడా వలంటీర్ అనే మాట కూడా మాట్లాడటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను విధుల్లో కొనసాగించడంతోపాటు గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచమని ధర్నా చేస్తున్న వలంటీర్లను ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తోంది. వారు నోరెత్తకుండా అణగదొక్కుతోంది. వలంటీర్లను కొనసాగించమని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీలు సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తే 2023 ఆగస్టు నుంచి వలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అధికారికంగా సమాధానం చెప్పారు. మంత్రి చెప్పినట్టు 2023 ఆగస్టు నుంచే వలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేనట్టయితే జూన్ 2024 వరకు వలంటీర్లు వేతనాలు ఎలా అందుకున్నారో సమాధానం చెప్పాలి. వ్యవస్థ లేనప్పుడు 2024 ఏప్రిల్ 9న ఉగాది రోజున చంద్రబాబు వేతనాలు రూ. 10 వేలకు పెంచుతానని హామీ ఎలా ఇచ్చాడు? అంతేకాకుండా 2024 సెప్టెంబర్‌లో విజయవాడ వరదల్లో వలంటీర్ల సేవలను అధికారికంగా ఎలా ఉపయోగించుకున్నారు? కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన వలంటీర్ల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా తప్పు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 4.57 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించిన ఘనత వలంటీర్లది. అలాంటి వలంటీర్లను నమ్మించి నట్టేట ముంచారు. వారి కుటుంబాలను రోడ్డున పడేశారు. కూటమి పార్టీల మోసపు హామీలను నమ్మి ఓటేసిన పాపానికి అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.