కాంట్రాక్టు పనుల ఒప్పందాలన్నీ రద్దయినట్టే

గ్రామ సభల తీర్మానాలే చెల్లుబాటు అవుతాయి

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి స్పష్టీకరణ

హైకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు

కోర్టు తీర్పు అమలు చేయాలని కలెక్టర్లను కోరతాం

ఆ మేరకు ఈనెల 17న వినతి పత్రాలు ఇస్తాం

తీర్పును ఉల్లంఘిస్తే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం 

ప్రెస్‌మీట్‌లో వెన్నపూస రవీంద్రారెడ్డి వెల్లడి

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ చట్టాన్ని ఉల్లంఘించి, కాంట్రాక్టు పద్దతిలో టీడీపీ నాయకులకు పనులు కేటాయిస్తూ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు తీర్పు చెప్పిందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ ఈనెల 17న వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం తరఫున రాష్ట్రంలోని అన్ని కలెక్టర్లకు వెళ్లి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదన్న రవీంద్రారెడ్డి, అధికారులు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే మరోసారి కోర్టుకు వెళ్లడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. గురువారం  తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోఆయ‌న మీడియా సమావేశంలో మాట్లాడారు.

చట్టాలను ఉల్లంఘించి పనుల కేటాయింపు:
    2005 ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ యాక్టు ప్రకారం గ్రామ సభల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు తీర్మానం చేసి ఆమోదించిన పనుల్ని మండల పరిషత్‌కి పంపడం, ఆపై జిల్లా పరిషత్‌కి పంపడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన పనుల్ని మాత్రమే ఆమోదించాలనేది చట్టపరంగా జరిగే విధానం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ వ్యవస్థను కాలరాసి కూటమి పార్టీ ఎమ్మెల్యేలు సూచించిన వారికే పనులు కట్టబెడుతున్నారు. ఉపాధి హామీ కూలీల పొట్టకొట్టి టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. 
    తెలుగుదేశం పార్టీ నాయకులు వేసుకున్న లేఅవుట్లను అభివృద్ధి చేసుకోవడానికి ఉపాధి హామీ నిధులు దారి మళ్లిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ పంచాతీరాజ్‌ విభాగం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో హైకోర్టులో కేసులు నమోదు చేయడం జరిగింది. 

ఒప్పందాలు చెల్లబోవని హైకోర్టు తీర్పు:
    ఉపాధి హామీ కూలీలకు అన్యాయం జరుగుతోందని, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించిన న్యాయస్థానం కాంట్రాక్టు విధానంలో పనులు కేటాయించడాన్ని నిలిపివేయాలని స్పష్టంగా చెప్పింది.  దీంతోపాటు ఇప్పటివరకు జరిగిన ఎంవోయూలు కూడా చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. చట్టాలపై గౌరవం లేకుండా ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న కూటమి నాయకులకు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. 
    వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్‌ విభాగం తరఫున ఈనెల 17వ తేదీన గ్రీవెన్స్‌ సెల్‌ రోజున రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్‌ కార్యాలయాలకు వెళ్లి హైకోర్టు తీర్పును అమలుచేయాల్సిందిగా వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. గ్రామ సర్పంచ్‌ చేసిన తీర్మానం చేసిన పనులకు మాత్రమే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తాం. 
    15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి దాదాపు రూ.1000 కోట్ల నిధులు కేటాయించి దాదాపు నెల గడుస్తున్నా పంచాయతీలకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా  దారి మళ్లించారు.  

పవన్‌కళ్యాణ్‌ పదో ర్యాంకును తీసుకున్నట్టేనా?:
    మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు.. నారా లోకేష్‌కి 8వ ర్యాంకు, పవన్‌ కళ్యాణ్‌కి 10 వ ర్యాంకు ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి–పంచాయతీరాజ్‌ శాఖలు నిర్వహించే పవన్‌ కళ్యాణ్, తనకు పదో ర్యాంకు ఇవ్వడంపై లోకేష్‌ కన్నా వెనకబడిపోయానని అంగీకరించినట్లేనా?..ఆయ‌నే స‌మాధానం చెప్పాలి. లేదా చంద్రబాబును నిలదీయాలి.    

నాడు గ్రామాల్లో సంపద సృష్టించాం:
    గతంలో వైయ‌స్‌ జగన్‌ సీఎంగా పనిచేసిన సమయంలో ప్రతి గ్రామంలో రూ.2 కోట్ల ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్‌ సెంటర్లు నిర్మించి సంపద సృష్టించాం. గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేశాం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలవుతున్నా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. ప్రభుత్వ నిధులతో టీడీపీ నాయకులు జేబులు నింపుకొంటున్నారు.  
    కేంద్రం నుంచి అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకురావడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం, ప్రశ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల మీద, వారి ఇళ్ల మీద పడి భౌతిక దాడులకు తెగబడుతున్నారు.  ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వెన్నపూస రవీంద్రారెడ్డి ఆక్షేపించారు.
 

Back to Top