గుంటూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం కొంతమంది కోసమే పని చేస్తుందా? అని ఆమె ప్రశ్నించారు. మాజీ మంత్రి విడదల రజిని ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో పోలీసు బాసు.. పొలిటికల్ బాసుల కోసం పనిచేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం సోషల్ మీడియా ప్రతినిధులపై కుట్రతో జైలుకు పంపుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే సోషల్ మీడియాపై కేసులు పెడతారా?. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. మా నాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెడితే పోలీసులు ఏం చేస్తున్నారు?. 20 రోజుల క్రితం నాపై పెట్టిన పోస్టులకు సంబంధించి ఆధారాలతో సహా డీజీపీ, ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు లేవు. నా క్యారెక్టర్ దెబ్బ తినే విధంగా వ్యక్తిత్వ హననానికి గురి చేస్తూ టీడీపీ స్పాన్సర్ మీడియా పోస్టులు పెట్టింది. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం కొంతమంది కోసమే పని చేస్తుందా?. అక్రమంగా, అన్యాయంగా వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయి. మా నాయకుడు చెప్పాడంటే చేస్తాడు అంతే.. అది అందరికీ తెలుసు. మా నియోజకవర్గానికి చెందిన సుధారాణిని ఐదు రోజులు పాటు అక్రమంగా, అన్యాయంగా స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. మాటలతో చెప్పలేని విధంగా చిలకలూరిపేట సీఐ రమేష్ బూతులు మాట్లాడారు. సుధారాణి చెప్పిన విషయాలకు సాక్ష్యాత్తూ న్యాయమూర్తి చలించిపోయారంటే.. పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనే అర్థం అవుతుంది. సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ విడదల రజిని కామెంట్స్ చేశారు.