బాబూ..ఏం చేశార‌ని మీకు ఓట్లు వేయాలి ?

మహిళా వ్యతిరేకి చంద్రబాబు..
 విలువలు లేని చంద్రబాబు ప్రభుతాన్ని గంగలో కలపాలి
 వైయస్‌ జగన్‌పై చంద్రబాబు మెప్పుకోసమే పరిటాల సునీత విమర్శలు
హైదరాబాద్ః మహిళలు చంద్రబాబు నాయుడిని ఎందుకు గెలిపించాలని వైయస్‌ఆర్‌సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు.హైదరబాద్‌ వైయస్‌ఆర్‌సీపీ సెంట్రల్‌ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఏం మంచి చేశావని  ఓట్లు వేయాలని మహిళలను అడుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ప్రశ్నలకు సంధించారు. వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టినందుకు ఓట్లు వేయ్యాలా...రిషితేశ్వరి  లాంటి చదువుల సరస్వతీని ర్యాంగింగ్‌ పేరుతో చంపేసినందుకు ఓట్లు వేయ్యాలా..అప్పులు చేసి నారాయణ కాలేజిలో చదువుతున్న ఆడపిల్లలను ఒత్తిడికి గురిచేసి చంపేస్తున్నందుకు ఓట్లు వేయ్యాలా.. ఆక్వా వద్దంటూ పోరాటం చేస్తున్న మహిళలను కొట్టి వారి మీద కేసులు పెట్టినందుకు ఓట్లు వేయ్యాలా.. అమాయక మహిళలను కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లోకి దించి వారిని వ్యభిచారుల్లా మారుస్తున్నందుకు ఓట్లు వేయ్యాలా..డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని వారిని అప్పలపాలు చేసినందుకు ఓట్లు వేయ్యాలా.. దాచేపల్లిలో ముక్కుపచ్చలారని ఏడేళ్లు చిన్నారిపై అత్యాచారం జరిగినందుకు  ఓట్లు వేయ్యాలా.. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేయాలని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళలను ఓట్లు వేయాలని చంద్రబాబు  బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోలో డ్వాక్రా రుణాలు వడ్డీతో మాఫీ చేస్తానని స్పష్టంగా ఉందన్నారు.మహిళల సంక్షేమం,భద్రత విషయంలో ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ను తొలగించడం సిగ్గుచేటన్నారు. మేనిఫెస్టో ప్రజలు చూస్తే చొక్కాపట్టుకుని నిలదీస్తారనే భయంతో చంద్రబాబు తొలగించారన్నారు.  మాటపై  నిలబడకుండా చంద్రబాబు తన చిత్తశుద్ధి ఏమిటో నిరూపించుకున్నారన్నారు. ఐదేళ్లలో రూ. 28వేల కోట్లు మహిళలను అప్పులపాలు చేశారన్నారు. సీఎం చేసిన మొదటి ఐదు సంతకాలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలన్నారు. ఒక రూపాయి కూడా డ్వాక్రా రుణమాఫీ కాలేదని స్వయంగా మంత్రి పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా తెలిపారన్నారు. ఐదేళ్లలో మహిళలకు అప్పులే మిగిల్చిన చంద్రబాబుకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.  దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా డ్వాక్రా మహిళలకు పావలావడ్డీకి రుణాలిచ్చి ఆదుకున్నారన్నారు. ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. మేనిఫెస్టోలో లేకపోయిన ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఎంతోమంది మహిళలకు ఆపరేషన్లు చేయించడంతో బాటు వారి భర్తలు,పిల్లలకు కూడా చేయించి వారి జీవితాలను నిలబెట్టిన ఘనత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిదన్నారు. అలాగే మేనిఫెస్టోలో లేని ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టి ఎంతోమంది ఆడపిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లను చేశారన్నారు.108 తో ఎంతో మంది ప్రాణాలు కాపాడరన్నారు .కాని టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరువందల హామీలను తుంగలో తొక్కారన్నారు. వైయస్‌ఆర్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. వైయస్‌ఆర్‌ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసి విద్యుత్‌ బకాయిలను రద్దు చేశారన్నారు. మహిళల అక్రమరవాణాలో రాష్ట్రాన్ని నెంబర్‌ స్థానంలో నిలబెట్టిన చంద్రబాబును చూస్తే మహిళలకు అసహ్యమేస్తుందన్నారు. మహిళా మంత్రిగా ఉన్న పరిటాల సునీత మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. వైయస్‌ జగన్‌కు పాదయాత్రలో మహిళలు హారతులిచ్చి బ్రహ్మరథం పడుతున్నారని అది చూసి సహించలేక చంద్రబాబు,పరిటాల సునీత  అవ్వాకులు చవ్వాకులు పేలుతున్నారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారన్నారు.నీతిలేని..విలువలేని చంద్రబాబు ప్రభుత్వాన్ని గంగలో కలపాలన్నారు. పరిటాల సునీత లాంటివారు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారో అనంతపురంలో సర్వే చేస్తే తెలుస్తుందన్నారు. చంద్రబాబు మెప్పు కోసం పరిటాల సునీత వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు.
 
Back to Top