కాంగ్రెస్, టీడీపీ ఖాళీ!

‘రాజకీయాల్లో హత్యలుండవు- అన్నీ ఆత్మహత్యలే!’ అన్నాడో పెద్దమనిషి. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ ఇదే విషయాన్ని పోటీపడి రుజువు చేస్తున్నాయి. ఇందులో ఒకపార్టీ -కాంగ్రెస్- వయసు 127 సంవత్సరాలు కాగా, మరో పార్టీ -టీడీపీ- సరిగ్గా మూడు పదుల వయసు ఈ ఏడాదే పూర్తి చేసుకుంది. ఇప్పటికే రెండు పార్టీల నుంచీ చురుకయిన నాయకులూ కార్యకర్తలూ నిష్ర్కమించారు. త్వరలోనే మిగతా వారు కూడా వలసపోతారని చెప్తున్నారు. ఈ పరిణామాలు ఆయా పార్టీల నాయకులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లు మరిన్ని తప్పులు చేస్తూ, వలసల క్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మొదటి నుంచీ ఈ రెండు పార్టీలకూ జీవగడ్డగా ఉంటూ వచ్చింది. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈ సరికే ఖాళీ అయ్యిందనీ, త్వరలోనే టీడీపీ ఈ జిల్లాలో అదృశ్యమయిపోతుందనీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను సోమవారం ఉదయం -అగస్ట్ 13న- వైఎస్ విజయమ్మ ఫీజు దీక్షలో పాల్గొనేందుకు ఏలూరు వెళ్తూ మీడియాతో మాట్లాడిన ఉదయభాను ఈ విషయం చెప్పారు. అంతేకాదు- సెప్టెంబర్ మొదటివారంలో పామర్రులో జరిగే ఓ సభలో ఈ రెండు పార్టీల నుంచీ వేలాదిమంది కార్యకర్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురనున్నారనికూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కాంగ్రెస్-టీడీపీల చరిత్రను ఒక్కసారి సమీక్షించుకోవాలి. మహాత్మ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా మెలగిన డాక్టర్ భోగరాజు పటాభి సీతారామయ్య, రైతు పెద్ద అనిపించుకున్న గొట్టిపాటి బ్రహ్మయ్య, ‘హరిజన నాయకుడు’ అనిపించుకున్న అన్నె అంజయ్య, బహుముఖ ప్రజ్ఞావంతుడు యార్లగడ్డ వెంకన్న చౌదరి తదితరులందరూ కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ సృష్టించిన మహనీయులే. కానీ, వాళ్ల చేతులమాదుగా నిర్మితమయిన కాంగ్రెస్ కంచుకోట ఏనాడో బీటలువారి, ఇప్పుడు శిథిలాలయంగా మారింది. ముఖ్యంగా, వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి జీవరసం ఇంకిపోయింది. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాములలో నిర్జీవమవుతున్న కాంగ్రెస్‌కు చీడపీడలూ తెగుళ్ల సమస్య తీవ్రతరమవుతూ వచ్చింది. జనంలో కాంగ్రెస్ మీద నమ్మకం క్రమంగా సడలిపోయింది. పార్టీలో కాస్త పనిచేస్తాడనిపించుకున్న ప్రతి నేతా బయటికి దారితీస్తున్నారు. ఇవేవో కాకతాళీయంగా జరుగుతున్న సంఘటనలు కావు. ఒక పెద్ద క్రమంలో చిన్ని చిన్ని విడిభాగాలు మాత్రమే.ఇలాంటి పరిణామం -అందరి కన్నా ఎక్కువగా- ఎవరికి సహకరించాలి?
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన పక్షంలో అది ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఉపయోగపడాలి! కానీ, అలా జరక్కపోవడమే కృష్ణా జిల్లా రాజకీయాల ప్రత్యేకత! మూడు దశాబ్దాల కిందట పుట్టుకొచ్చిన టీడీపీకి బీజావాపనం జరిగిందే కృష్ణా జిల్లాలో. ఈ పార్టీ సృష్టికర్త ఎన్‌టీ రామారావు పుట్టిపెరిగిన ఊరు -నిమ్మకూరు- కృష్ణా జిల్లాలోనిదే. టీడీపీలో ఎన్‌టీఆర్, ఆయన కుటుంబ సభ్యులూ కాకుండా చెప్పుకోదగిన నేతలు ఎవరూ లేరు. అయితే, ఛోటామోటా నాయకుల్లో అత్యధికులు ఈ జిల్లా నుంచే వచ్చారు. టీడీపీ అధ్యక్ష స్థానంలో ఎవరుంటే వాళ్లను, దైవసమానులుగా చిత్రించి ప్రచారం చెయ్యడంలో ఈ ద్వితీయ శ్రేణి నాయకత్వం అద్వితీయ పాత్ర పోషిస్తూ వచ్చింది. ఇక, తమ నేతను అంతర్జాతీయ స్థాయికి పెంచి చూపించడంలో ఈ వర్గం దిట్ట. ఈ శ్రేణుల అండతోనే చంద్రబాబు ఇంతకాలం నెగ్గుకొచ్చారు. ఇటీవలి కాలంలో -ముఖ్యంగా ఆ మధ్యన జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ ఒక్క నియోజకవర్గంలోనూ గెలవకపోగా, అనేక నియోజకవర్గాల్లో ధరావతు కూడా కోల్పోయిన నేపథ్యంలో- ఈ ద్వితీయ శ్రేణి నేతలు పార్టీనుంచి బయటపడాలని నిశ్చయించుకున్నారు. సామాజిక వర్గం, డబ్బు, ఎన్టీర్ ఫ్యామిలీ సెంటిమెంట్‌లాంటివేవీ పనిచెయ్యడం లేదు. వైఎస్‌ఆర్ ఆశయాలనే విధానాలుగా చేసుకుని పుట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పూర్వరంగం సహకరించడం సహజం. కృష్ణా జిల్లా టీడీపీ -అర్బన్- శాఖ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ విజయవాడ పురవీథుల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన రెడ్డిని కలవడం టీడీపీలో -ముఖ్యంగా యువనాయకుల్లో- కదలిక పుట్టించింది. అప్పుడే ఈ వర్గం నుంచి వలసలు మొదలయ్యాయి. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు -నాని- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీ నుంచి వలసలు మరో మలుపు తిరిగాయి. సామాజిక వర్గాల భిన్నత్వాలకు అతీతంగా ఈ వలసలు సాగుతున్నాయి.మొన్నటి ఉప ఎన్నికల్లో టీడీపీ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టామని మాత్రమే చంద్రబాబు అనుకున్నారు. కానీ, ఆ వర్గాలు శాశ్వతంగా పార్టీకి దూరమయిపోయే ప్రమాదం ఉందని ఆయన గ్రహించలేదు. క్రమంగా అదే జరిగింది. బెడిసికొట్టిన ఈ ఉప ఎన్నికల వ్యూహం కూడా తాజా పరిణామాలకు తోడయింది. చిత్రమేమిటంటే, ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి సహకరించలేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఈ పరిస్థితి నుంచి అత్యధికమయిన ఫలితం రాబట్టుకుంది. ఇది ఇలాగే జరిగితే, సామినేని ఉదయభాను చెప్పినట్లే, కృష్ణా జిల్లాలో కాంగ్రెస్- టీడీపీ కనుమరుగయిపోవడం ఖాయమే!

Back to Top