అది బాబు ప్రభుత్వంలో తెచ్చి​న నెయ్యే

చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్‌ 12 నుంచే టీటీడీకి నెయ్యి సరఫరా ప్రారంభించిన ఏఆర్‌ డెయిరీ  

అమరావతి: జరగని తప్పు జరిగిందంటూ పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిచ్చి ప్రేలాపనలు పేలుతూ ఘోర అపచారానికి ఒడిగట్టారు. లడ్డూల తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ నిరాధారమైన, దారుణ ఆరోపణలు చేశారు. ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు) కాల్ఫ్‌ (సెంటర్‌ ఫర్‌ ఎనాలసిస్‌ అండ్‌ లెర్నింగ్‌ లైవ్‌ స్టాక్, ఫుడ్‌) టెస్ట్‌ రిపోర్ట్‌లను సీఎం చంద్రబాబు ఆధారంగా చూపుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో పాల ఉత్పత్తులు, ఆహార నాణ్యత సంస్థలలో పనిచేస్తూ విశేష అనుభవం గడించిన పలువురు నిపుణులను ఎన్‌డీడీబీ కాల్ఫ్‌ రిపోర్టుపై ‘సాక్షి’ సంప్రదించింది. జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఆ నెయ్యిలో లేవని వారంతా ముక్తకంఠంతో స్పష్టం చేశారు.   

⇒ నాలుగు శాంపిళ్లను పరీక్షించి ఎన్‌డీడీబీ కాల్ఫ్‌ ఇచ్చిన నాలుగు టెస్ట్‌ రిపోర్టులలో మిల్క్‌ ఫ్యాట్‌ వరుసగా 99.584, 99.610, 99.618, 99.677 శాతం ఉందని.. మిగిలిన 0.416, 0.390, 0.382, 0.323 శాతం మాయిశ్చర్‌ (తేమ), ఇత­రాలు (విటమిన్స్, కెరటిన్, మినరల్స్‌ తది­­తరాలు) ఉంటాయని నిపుణులు విశ్లేషించారు.  

⇒ కేజీ నెయ్యిలో ఏ సరఫరా సంస్థైనా 20 నుంచి 30 గ్రాముల వెజిటబుల్‌ ఆయిల్, జంతువుల కొవ్వు కలిపే స్థాయికి దిగజారదని స్పష్టం చేశారు.  

⇒ కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఎన్‌డీడీబీ కాల్ఫ్‌ టెస్ట్‌ రిపోర్టుల ఆధారంగా ఎందుకు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టకూడదో చెప్పాలంటూ ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌కు టీటీడీ మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ పి.మురళీకృష్ణ జూలై 27న జారీ చేసిన షోకాజ్‌ నోటీసులోనూ.. దానికి ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ఇచ్చిన జవాబును తిరస్కరిస్తూ జూలై 28న ఇచ్చిన రిజాయిండర్‌ షోకాజ్‌ నోటీసులోనూ జంతువుల కొవ్వు ఆ నెయ్యిలో కలిసిందని ఎక్కడా స్పష్టంగా తేలి్చచెప్పకపోవడాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వెజిటబుల్‌ ఆయిల్‌తో పాటు ఫారిన్‌ ఫ్యాట్స్‌ కలిసి ఉండొచ్చునంటూ అనుమానం మాత్రమే వ్యక్తం చేశారని పేర్కొంటున్నారు. 

⇒ సీఎం చంద్రబాబు మాత్రం టీటీడీ వెనక్కి పంపేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, దాన్ని శ్రీవారి లడ్డూల తయారీలో వాడారని.. వాటిని భక్తులకు పంపిణీ చేశారని.. భక్తులు వాటిని తినేశారంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తుండటంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

⇒ దీన్ని బట్టి చూస్తే.. సున్నితమైన అంశంపై ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న స్వార్థంతోనే పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు అపవిత్రం చేసి ఘోర అపరాధం చేశారన్నది స్పష్టమవుతోంది.  

⇒ స్వార్థ రాజకీయాల కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి వారితో ఆటలాడుకోవడం... భూలోక వైకుంఠం తిరుమలను అపవిత్రం చేసే దుస్సాహసానికి ఒడిగట్టడం నారా చంద్రబాబు నాయుడికి ఇదేమీ కొత్తేమీ కాదని టీటీడీ అధికారులు, అధ్యాత్మీక వేత్తలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

బాబు ప్రభుత్వంలోనే కల్తీ నెయ్యి సరఫరా.. 
⇒ స్పెషల్‌ గ్రేడ్‌ ఆగ్‌ మార్క్‌ ఆవు నెయ్యి కోసం 2024 మార్చి 12న టీటీడీ ఈ–టెండర్లు పిలిచింది. అయితే ఎన్నికల సంఘం మార్చి 16న సాధారణ ఎన్నికల షెడ్యూలును విడుదల చేయడంతో అదే రోజు నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దాంతో ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు.  

⇒ ఈ టెండర్లు 2024 మే 8న టెండర్లు ఖరారయ్యాయి. కేజీ రూ.319.80 చొప్పున పది లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ దక్కించుకుంది. టీటీడీకి నెయ్యి సరఫరాను జూన్‌ 12 నుంచి ఆ సంస్థ ప్రారంభించింది. అదేరోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. దీన్ని బట్టి ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ సంస్థ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేజీ కాదు కదా కనీసం ఒక గ్రాము నెయ్యిని కూడా టీటీడీకి సరఫరా చేయలేదన్నది స్పష్టమవుతోంది. 

⇒ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జూన్‌ 12, 21, 25, జూలై 4వ తేదీలలో ఏఆర్‌ ఫుడ్స్‌ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో ఒక్కో ట్యాంకర్‌ నుంచి మూడు శాంపిళ్లను తీసుకుని తిరుమలలోని టీటీడీ ల్యా»ొరేటరీకి టీటీడీ మార్కెటింగ్‌ విభాగం అధికారులు పంపారు. టెండర్‌లో పేర్కొన్న ప్రమాణాల మేరకు ఆ నెయ్యి ఉందని తేల్చడంతో ఆ నాలుగు ట్యాంకర్లను టీటీడీ అధికారులు గోదాములోకి అనుమతించి నెయ్యిని ఆన్‌లోడ్‌ చేసుకున్నారు.  

⇒ ఈ క్రమంలో జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 15న రెండు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీకి ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ పంపింది. ఆ ట్యాంకర్ల నెయ్యి శాంపిళ్లను పరీక్షించిన టీటీడీ ల్యా»ొరేటరీ టెండర్‌లో పేర్కొన్న ప్రమాణాల మేరకు లేదని తిరస్కరించింది. ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కి పంపేశారు. అంటే..  కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు వాడ­లేదన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు మాత్రం శ్రీవారి లడ్డూల తయారీలో జంతు­కొవ్వు కలిసిన నెయ్యిని వాడారంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తుండటం గమనార్హం.

సీఎంకు ఇచ్చిన నివేదికలో ఒకలా.. షోకాజ్‌ నోటీసుల్లో మరోలా  
కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు గత ఆదివారం సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరాను జూన్‌ 12 నుంచి ప్రారంభించిందని.. ఎనిమిది ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసిందని నివేదికలో పేర్కొన్నారు. ఇందులో నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యంగా ఉందని టీటీడీ ల్యాబొరేటరీ తేల్చిందని వెల్లడించారు. జూలై 6, 15న సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యంగా లేదని.. ఆ నెయ్యి శాంపిళ్లను ఎన్‌డీడీబీ కాల్ఫ్‌కు పరీక్షల నిమిత్తం పంపామని వివరించారు. 

ఎన్‌డీడీబీ జూలై 23న టెస్ట్‌ రిపోర్టులు ఇచ్చిందని.. ఆ నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిల్స్‌తోపాటు జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేసిందన్నారు. దాంతో నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపేశామని.. సరఫరాను ఆపేశామని.. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతూ జూలై 27న షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని నివేదికలో పేర్కొన్నారు. కానీ.. ఇదే అంశంపై ఎన్‌డీడీబీ టెస్ట్‌ రిపోర్టులు ఇచ్చిన రోజు అంటే జూలై 23న తిరుమలలో ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు ట్యాంకర్లలో నెయ్యి కల్తీ అయినట్లు నివేదికలో తేలిందని.. వనస్పతి డాల్డా లాంటి వెజిటబుల్‌ ఆయిల్స్‌ కలిసి ఉండొచ్చునని చెప్పారు. 

ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌కు జూలై 27న ఇచ్చిన షోకాజ్‌ నోటీసులోనూ.. 28న ఇచ్చిన రిజాయిండర్‌ షోకాజ్‌ నోటీసులోనూ నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిల్‌ కలిసిందని, ఫారిన్‌ ప్యాట్‌ కలిసి ఉండే అవకాశం ఉండొచ్చునని టీటీడీ పేర్కొంది. కానీ.. రెండు నెలల తర్వాత సీఎంకు ఇచ్చిన నివేదికలో టీటీడీ ఈవో శ్యామలరావు మాట మార్చడం గమనార్హం. సీఎంవో నుంచి తీవ్ర స్థాయిలో వచ్చిన ఒత్తిడికి తలొగ్గే ఈవో శ్యామలరావు జూలై 23న మీడియాతో ఒకలా మాట్లాడి.. ఈనెల 22న సీఎంకు మరోలా నివేదిక ఇచ్చారనే అభిప్రాయం టీటీడీ అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.  

Back to Top