సాగు.. బాగోలేదు

ఓవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి.. వీటిని మించి ప్రభుత్వ నిర్లక్ష్యం

ప్రత్యామ్నాయ ప్రణాళిక లేని సర్కారు.. రైతుల సౌకర్యాల్లోనూ కోత

ఖరీఫ్‌లో దెబ్బతిన్న రాష్ట్ర రైతులు

లక్ష్యానికంటే అతి తక్కువగా పంటల సాగు

ఎన్నడూ లేని విధంగా 15.95 లక్షల ఎకరాలు సాగుకు దూరం

మరో 6 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు.. ఈసారి భారీగా పడిపోనున్న దిగుబడులు

సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు.. సాగైంది  69.7 లక్షల ఎకరాల్లోనే 

మిగతా పంటలదీ ఇదే పరిస్థితి

 అమ‌రావ‌తి:  వ్యవసాయం దండగ అని చెప్పే చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పంటల దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ ఖరీఫ్‌ సీజన్‌ చెబుతోంది. చంద్రబాబు ప్రభుత్వం సాగులో రైతులకు అండగా ఉండకపోవడం.., విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించకపోవడం.., ఉన్న సౌకర్యాలను కూడా తొలగించడం, అతివృష్టి, అనావృష్టికి తగ్గట్లుగా పంటల ప్రణాళిక రచించకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతింది. 

ఖరీఫ్‌ సీజన్‌  ప్రారంభం నుంచి ఓ వైపు అతివృష్టి, మరో వైపు అనావృష్టి అన్నదాతలను ఉక్కిరిబిక్కిరిచేయగా, వాటికి మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం వారిని కోలుకోలేని దెబ్బతీసింది. ఫలితంగా 85.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంతో ప్రారంభమైన ఈ సీజన్‌ చివరికి 69.70 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ఎన్నడూ లేని రీతిలో 15.95 లక్షల ఎకరాలు సాగుకు దూరంగా ఉండిపోయాయి. ఆరు లక్షల ఎకరాల్లో పంటలు వర్షాలు, వరదలతో  పనికిరాకుండా పోయాయి. 

వర్షాలు కురిసినా.. 
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో తొలకరిలో మంచి వర్షాలే కురవడంతో సాగుకు తిరుగుండదని రైతులు ఆశించారు. జూన్‌ నుంచి సెపె్టంబర్‌ మధ్య  574.70 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, రికార్డు స్థాయిలో 689 మిల్లీమీటర్లు కురిసింది. దీంతో రైతులు ఉత్సాహంగా పంటలు వేశారు. జూలై, సెపె్టంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 

మరోపక్క తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాయలసీమలో రైతులను దెబ్బతీశాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, అందుకు తగిన సహకారంతో ముందుకు రావాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక లేకపోవడంతో లక్షలాది ఎకరాల్లో రైతులు సాగుకు దూరమయ్యారు. సాగైన ప్రాంతాల్లో సైతం ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చే పరిస్థితి లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు.

లక్ష్యం కుదించినా.. సాగవని పంటలు 
గత ఏడాది సాగు కొంత తగ్గడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు లక్ష్యాన్ని 89. 37 లక్షల ఎకరాల నుంచి 85.65 లక్షల ఎకరాలకు కుదించారు. అయినప్పటికీ లక్ష్యానికంటే తక్కువగా అతికష్టం మీద 69.71 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు 
సాగయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో సాగు లక్ష్యం 37.59 లక్షల ఎకరాలకు 24 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. ఒక్క జిల్లాలో కూడా లక్ష్యం మేరకు 100 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవలేదు.  

ఖరీఫ్‌లో 39.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 34.62 లక్షల ఎకరాల్లోనే సాగైంది. రాష్ట్రవ్యాప్తంగా 4.88 లక్షల ఎకరాల్లో నాట్లే పడలేదు. వర్షాలు, వరదలకు మరో 5 లక్షల ఎకరాల్లో సాగైన పంట పూర్తిగా దెబ్బతింది. సజ్జలు, రాగులు, మొక్కజొన్న, కందులు, మినుము మాత్రమే ఆశాజనకంగా సాగయ్యాయి. ఆముదం, సోయాబీన్‌ మినహా ఇతర నూనె గింజలు, పత్తి సాగు గణనీయంగా తగ్గిపోయింది. మొత్తంగా ఆహార ధాన్యాల పంటలు 50 లక్షల ఎకరాల్లో, నూనె గింజలు 8.50 లక్షల ఎకరాల్లో, పత్తి 6.62 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. 

167.15 లక్షల టన్నుల దిగుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. విస్తీర్ణం తగ్గడంతోపాటు వర్షాలు, వరదలు, తెగుళ్లతో  140 లక్షల టన్నులు కూడా రావడం కష్టమని అంచనా వేస్తున్నారు. ధాన్యం దిగుబడి లక్ష్యం 85.47 లక్షల టన్నులు కాగా, ఈసారి 70 లక్షల టన్నులు దాటదని చెబుతున్నారు. పత్తి, వేరుశనగ దిగుబడి సగానికి తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. 

రాయలసీమలో పరిస్థితి దయనీయం 
రాయలసీమ జిల్లాల్లో మెజార్టీ మండలాల్లో 60 రోజులకుపైగా చినుకు జాడలేదు. జూన్‌లో 7, జూలైలో 95, ఆగషు్టలో 76 మండలాల్లో లోటు వర్షపాతం నమోదయింది. జూలైలో 113 మండలాలు, ఆగస్టులో 244 మండలాల్లో వర్షాలే లేవు. దీంతో పంటల సాగు తగ్గిపోయింది. రాయలసీమలో 13.50 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వేరుశనగ ప్రస్తుతం 6.25 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. 8 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన పత్తి 6 లక్షల ఎకరాలు మించలేదు. 4.39 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వరి 3 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. 

ఇతర పంటల పరిస్థితీ ఇదే విధంగా ఉంది. సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల బోర్లన్నీ ఒట్టిపోయాయిు. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సాగు దూరమైన చోట ప్రత్యామ్నాయ పంటలకు 70 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అంచనా వేయగా, ప్రభుత్వం అతికష్టమ్మీద 24 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేయగలిగింది. దీంతో రైతులకు ప్రత్యామ్నాయం కూడా లేకపోయింది.  

Back to Top