అమరావతి: కౌలు చట్టం–2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం తలపెట్టేందుకు సిద్ధమైంది. కౌలుదారుడికి సెంటు భూమి ఉన్నా కౌలు రైతుగా గుర్తించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కౌలు చట్టం–2024 పేరిట ముసాయిదాను సైతం సిద్ధం చేసింది. తద్వారా భూ యజమాని అనుమతి లేకుండానే కౌలు కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ ముసుగులో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నచ్చినోళ్లకు పెట్టుబడి సాయం, రుణాలు, నష్టపరిహారం, సబ్సిడీల లబ్ధి చేకూర్చేలా తెరవెనుక ఏర్పాట్లు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కొత్త చట్టం విభేదాలకు ఆజ్యం పోస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలిసిన వ్యక్తులకే తమ భూములను కౌలుకు ఇస్తుంటామని.. తమ అనుమతితో పనిలేకుండా ప్రభుత్వం ఎవరో ఒకరికి భూములను కౌలుకు ఇచ్చినట్టుగా రాసేసుకుని.. కౌలు కార్డులు జారీచేస్తే వాస్తవ హక్కుదారులమైన తాము ఏమైపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త చట్టం తీసుకురావడం వెనుక కుట్ర దాగి ఉందని, తమ భూములపై ప్రభుత్వం తనకు నచ్చినోళ్లకు మేలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని వాస్తవ రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కౌలుదారులు సైతం ఈ నిబంధనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కౌలు చేస్తున్న సాగుదారులకు కాకుండా కొత్త నిబంధన పేరిట వేరే వ్యక్తులకు కౌలు కార్డులు జారీచేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కౌలుదారుల్లో అత్యధికులకు 10 నుంచి 30 సెంట్ల వరకు భూమి ఉంటుందని, ఒక్క సెంటు భూమి ఉన్నా కౌలు కార్డులకు అర్హత లేదనే నిబంధన అసలుకే చేటు తెస్తుందని కౌలుదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త నిబంధనలతో అసలుకే మోసం పట్టాదార్ పాస్ బుక్ చట్టం–1971 లేదా ఇతర రెవెన్యూ చట్టాల ప్రకారం భూమిపై హక్కు కలిగి ఉండి, వెబ్‌ల్యాండ్ వంటి భూ రిజిస్టర్లలో నమోదైన కౌలు రైతులు కొత్త చట్టం ప్రకారం కౌలు కార్డులు పొందేందుకు అనర్హులు. అంటే సెంటు భూమి ఉన్నా సరే కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే విషయాన్ని కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన యాప్‌లో నమోదు చేసుకున్న వారు మాత్రమే కౌలు కార్డులు పొందేందుకు అర్హులు. అంటే.. భూమిని వాస్తవ కౌలుదారు కాకుండా వేరే వ్యక్తులు కౌలుకు చేస్తున్నట్టుగా యాప్‌లో నమోదు చేసుకుంటే వారిని కౌలు రైతుగా గుర్తించే ప్రమాదం ఉంది. యాప్‌పై అవగాహన లేని కౌలు రైతులు, అమాయకులైన కౌలు రైతులకు ఇలాంటి నిబంధనల వల్ల కీడు జరుగుతుందని రైతు, కౌలు రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. కొత్త చట్టం పేరిట తెస్తున్న నిబంధనల్లో మరో సమస్య కూడా ఉంది. అసలు రైతు కుటుంబ సభ్యులు, వారి సమీప బంధువులు భూమిని కౌలుకు చేస్తుంటే.. అలాంటి వారు కూడా కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే నిబంధన విధించారు. కౌలు రైతుల్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే వారంతా వాస్తవ సాగుదారులైన కౌలు రైతుగా అనర్హులవుతారు. కొత్త కౌలు చట్టాన్ని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముసాయిదా ఏం చెబుతోందంటే.. కౌలు చట్టం–2024 ప్రకారం భూ యజమానుల అనుమతితో పనిలేకుండా చుట్టుపక్కల రైతుల అభిప్రాయాల మేరకు గ్రామసభల్లో కౌలుదారులను గుర్తిస్తామని ప్రభుత్వం చెబుతోంది. యజమాని మూడు రోజుల్లో సమ్మతి ఇవ్వకుంటే డీమ్డ్ సమ్మితి (భూ యజమాని సమ్మతి తెలిపినట్టు)గా పరిగణించి కౌలు కార్డు జారీ చేస్తారు. ఒకవేళ తాను ఎవరికీ తన భూమిని కౌలుకు ఇవ్వలేదని భూ యజమాని అభ్యంతరం వ్యక్తం చేసినా పరిగణనలోకి తీసుకోరు. చుట్టుపక్కల రైతుల అభిప్రాయాలే ప్రామాణికంగా ఇచ్చే కౌలు కార్డుల ప్రామాణికంగానే పంట రుణాలిస్తారు. ఈ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పంట రుణాలు ఇవ్వకూడదని, భూ యజమానులు గత సీజన్‌లో తీసుకున్న పంట రుణాలను రెన్యువల్ చేసుకున్నా, అదే సీజన్‌లో కొత్తగా తీసుకున్న పంట రుణాలను లాంగ్ టర్మ్ రుణాలుగా పరిగణించేలా బ్యాంకులను ఆదేశించేలా నిబంధన పెడుతున్నారు. కౌలు కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలివీ అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులున్నారు. ఇందులో 16 లక్షల మంది కౌలుదారులు. సెంటు భూమి కూడా లేకుండా వ్యవసాయం చేస్తున్న వారు 8–10 లక్షల మంది ఉంటారని అంచనా. కౌలు కార్డులు పొందిన వారు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం పొందవచ్చు. సబ్సిడీపై. విత్తనాలు, ఎరువులు పొందవచ్చు. ఎలాంటి పూచీకత్తు లేకుండా సాగు చేసే పంటలను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.1.60 లక్షల వరకు పంట రుణాలు పొందవచ్చు. సాగు చేసిన పంట ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతే నష్టపరిహారంతో పాటు పంటల బీమా పరిహారం పొందవచ్చు. కొత్త వివాదాలకు ఆజ్యం పరిసర రైతులు మౌఖికంగా ధ్రువీకరిస్తే కౌలు కార్డులు ఇవ్వొచ్చన్న నిబంధన గ్రామాల్లో భూ యజమానులు, కౌలు రైతుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తుందన్న వాదన వినిపిస్తోంది. అన్నదాత సుఖీభవతో పాటు ఇతర సంక్షేమ ఫలాల కోసం ఎలాంటి భూమి లేనివారు, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ నిబంధన సాకుతో స్థానిక అధికారులను ప్రలోభపెట్టి అడ్డగోలుగా కార్డులు పొందడం, వాటిద్వారా సంక్షేమ ఫలాలు స్వాహా చేయడం వంటి అవకతవకలు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. కార్డులు జారీచేసే వరకు రుణాలివ్వకూడదన్న నిబంధనతో సకాలంలో పంట రుణాలు పొందే అవకాశం సాగుదారులైన భూ యజమానులకు లేకుండా పోతుందంటున్నారు. డబుల్ ఫైనాన్స్ ఇవ్వలేమని, గతంలో తీసుకున్న రుణాలు రెన్యువల్ చేసుకున్న తర్వాత వాటిని లాంగ్ టర్మ్ రుణాలుగా మార్చడానికి నిబంధనలు అంగీకరించవని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. కౌలుదారుడు రుణం తీసుకుని చెల్లించలేని పక్షంలో, వ్యక్తిగత అవసరాల కోసం భూమిని తనఖా లేదా, అమ్ముకునేటప్పుడు తమకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళనను భూ యజమానులు వ్యక్తం చేస్తున్నారు.