అమరావతి: రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేటే పైచేయి సాధించింది. ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఆ ‘పచ్చ’ముఠా పూర్తిగా హైజాక్ చేసేసింది. ప్రభుత్వ ముఖ్య నేత పన్నాగం.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెండర్ల వైపు ఇతరులెవ్వరూ కన్నెత్తి చూడకుండా ఎప్పటికప్పుడు వారిని అడుగడుగునా అడ్డుకుంటూ హడలెత్తించారు. తద్వారా.. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ద్వారా భారీ దోపిడీకి మొదటి అంకాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 87,116 దరఖాస్తులు రాగా.. వాటిలో దాదాపు 99 శాతం టీడీపీ మద్యం సిండికేట్‌వే. సాధారణ వ్యాపారులు దరఖాస్తులు దాఖలు చేయకుండా.. అదే సమయంలో తమలో తామే పోటీపడినట్లు బిల్డప్ ఇస్తూ మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియను ఏకపక్షంగా పూర్తిచేశారు. ఇక లాటరీ ద్వారా టీడీపీ సిండికేట్ ఏకపక్షంగా మొత్తం 3,396 దుకాణాలను దక్కించుకోవడం.. ఆ తర్వాత యథేచ్ఛగా మద్యం ఏరులను పారిస్తూ భారీ దోపిడీకి తెగబడటమే తరువాయి. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దందా.. 2014–19 కంటే రెట్టింపు స్థాయిలో మద్యం వ్యాపారం ద్వారా దోపిడీయే లక్ష్యంగా అధికార టీడీపీ కూటమి మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియను శాసించింది. ఎందుకంటే ఏకంగా ముఖ్యనేతే ఇందుకు పచ్చజెండా ఊపడంతో ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డూ అదుపులేకుండా చెలరేగిపోయారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ మద్యం సిండికేట్‌ను ఏర్పాటుచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినవారు తప్ప ఇతరులెవరూ దరఖాస్తులు చేయడానికి వీల్లేదని హెచ్చరికలు జారీచేశారు. కాదని ఎవరైనా దరఖాస్తు చేసినా వారికి మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎవరూ షాపులు అద్దెకు ఇవ్వకూడదని బహిరంగంగానే ప్రకటించారు. ఇక ఇతరులు తమ సొంత దుకాణాల్లో ఏర్పాటుచేసుకుంటే ఎక్సైజ్ శాఖ అధికారులతో తరచూ తనిఖీలు, దాడులతో వేధిస్తామని అల్టిమేటం జారీచేశారు. అయినా కొందరు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడి బెదరగొట్టారు. దీంతో అసలు టెండర్లు దాఖలు చేసేందుకు సాధారణ వ్యాపారులెవరూ సాహసించలేదు. నిజానికి.. టెండర్ల ప్రక్రియలో మొదటి వారం రోజులు ఒక్కో దుకాణానికి సగటున 10 కూడా దరఖాస్తులు రాలేదు. దీంతో టీడీపీ సిండికేట్ వ్యవహారం బహిరంగ దందాగా మారింది. ఆ తర్వాత ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వ ముఖ్యనేత కొత్త ఎత్తుగడ వేశారు. దరఖాస్తుల సంఖ్య కొంత పెంచాలని.. కానీ, అవి కూడా టీడీపీ సిండికేట్ సభ్యులవే ఉండేలా చూడాలన్నారు. తద్వారా ఒక్కో మద్యం దరఖాస్తుకు రూ.2 లక్షల వరకు నాన్ రిఫండబుల్ డిపాజిట్ భరించాలన్నారు. ఎలాగూ మద్యం దందా ద్వారా విచ్చలవిడి దోపిడీకి పచ్చజెండా ఊపాం కదా అని అసలు లోగుట్టు చెప్పారు. ఫలితంగా.. టీడీపీ సిండకేట్ సభ్యులే ఒక్కొక్కరు వేర్వేరు పేర్లతో దరఖాస్తులు దాఖలు చేశారు. దాచినా దాగని దందా.. ఇక టీడీపీ మద్యం సిండికేట్ దందాకు ఎంతగా కనికట్టు చేయాలని చూసినా కుదరలేదు. తెలంగాణతో పోల్చిచూస్తే రాష్ట్రంలో ఈ దరఖాస్తుల ప్రక్రియ ఎంత ఏకపక్షంగా సాగిందన్నది స్పష్టమవుతోంది. విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నదైన తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య కూడా తక్కువే. తెలంగాణలో గత ఏడాది మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు పిలవగాఏకంగా 1.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే.. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 57 దరఖాస్తులు దాఖలయ్యాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అంతేకంటే అధికంగా 3,396 మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు పిలిచారు. కానీ, దరఖాస్తులు మాత్రం కేవలం 87,116 మాత్రమే రావడం గమనార్హం.అంటే సగటున ఒక మద్యం దుకాణానికి 25 మాత్రమే వచ్చాయి. చివరికి..ఆ దరఖాస్తులుకూడా టీడీపీ సిండికేట్‌వే. ‘బెల్టు’లూ బార్లా.. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పంచాయతీలో రెండు నుంచి ఆరు వరకు బెల్టుషాపులను ఏర్పాటుచేసేందుకు కసరత్తు జరుగుతోంది. పట్టణాల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటికే గత టీడీపీ హయాంలోని బెల్టు షాపుల నిర్వాహకులతో సిండికేట్ సభ్యులు మంతనాలు మొదలుపెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బలంగా ఉన్న మద్యం సిండికేట్లే ఇప్పుడూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఈ సిండికేట్లను వెనకుండి నడిపిస్తున్నారు. ఒకవేళ లాటరీలో బయటివారికి షాపులు దక్కినా వారి వ్యాపారం సజావుగా సాగాలంటే తమ సిండికేట్లలో కలవాల్సిందేనని సంకేతాలిస్తున్నారు. ఇక ఒక్కో బెల్టుషాపు ఏర్పాటుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్టు చెల్లించాలని చెబుతున్నట్లు తెలిసింది. డిపాజిట్ చేసిన వారికే తమ షాపుల పరిధిలో బెల్టుషాపు ఏర్పాటుకు అనుమతించి అందుకు అవసరమైన సరుకు ఇస్తామంటున్నారు. లేనిపక్షంలో దాడులు చేయించి కేసులు పెట్టిస్తామని హెచ్చరిస్తున్నట్టు సమాచారం. కాగా.. షాపుల నిర్వహణ తగ్గించుకునేందుకే సిండికేట్లు బెల్టుషాపుల ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో మద్యం షాపు నిర్వహణకు నెలనెలా అన్ని రకాల ఖర్చులకు లక్షకు పైగానే వ్యయమవుతుందని వారి అంచనా. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే వారు ‘బెల్టు’ వైపు మొగ్గుచూపుతున్నారు. చివరిరోజూ అరాచకమే.. టెండర్ల చివరిరోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. టెండరు కేంద్రాల వద్ద సినీఫక్కీ మాదిరిగా ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరులు మాటువేశారు. ఉదయం నుంచి సాయంత్రం గడువు ముగిసే వరకూ అడుగడుగునా నిఘా ఏర్పాటుచేశారు. వేరే వ్యక్తి ఎవరైనా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లినా.. టెండరు వేసేందుకు దరఖాస్తు తీసుకున్నా.. క్షణాల్లో వారిపై బెదిరింపులకు పాల్పడేలా మందీమార్బలాన్ని మోహరించారు. ‘ఏం మిస్టర్.. ఎక్సైజ్ ఆఫీస్‌కి వెళ్లావట. దరఖాస్తు చేద్దామనా? అప్‌లై చేసి చూడు.. మా వాళ్లను కాదని టెండరు వేస్తే తాటతీస్తా’.. అంటూ కృష్ణాజిల్లాలోని ఓ ఎమ్మెల్యే మద్యం షాపు దరఖాస్తు కోసం వెళ్లిన వ్యక్తిని బెదిరించారంటే అధికార పార్టీ సిండికేట్ల అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. అలాగే.. ఇదే జిల్లా గన్నవరం, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో గతంలో షాపులు నిర్వహించుకున్న వారు లేదా స్థానికులు లేదా ఇతర పార్టీల వారు దరఖాస్తుకు వెళ్తే స్థానిక ఎమ్మెల్యేల అనుచరులు వార్నింగ్‌లు ఇచ్చి వెనక్కి పంపేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఒకవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు.. సామ, దాన, భేద దండోపాయాలనూ పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రయోగించింది. చివరికి.. అధికార పార్టీ నేతలకూ ఈ హెచ్చరికలు తప్పలేదని భోగట్టా.