ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల జిల్లా పరిషత్, మరికొన్ని ఎంపీపీలు, ఇంకొన్ని చోట్ల సర్పంచ్‌లు, ఉప సర్పంచుల ఎన్నికలు.. ఏ ఎన్నిక అయితేనేం... కూటమి నాయకులది ఒకటే లక్ష్యం. అధికారాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా వైయస్ఆర్‌సీపీ హవాకు అడ్డు కట్టవేయడం. అయితే ప్రజల అండ, సామాన్య కార్యకర్తల తెగువ, నాయకుల చొరవతో వారి ఆటలు సాగలేదు. ఈ పరిణామాలువైయస్ఆర్‌సీపీ శ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి. గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు తెగువ చావనైనా చస్తా... పార్టీ మారను ఆస్తిపాస్తులకు ఆమె నిరుపేద కావచ్చు కానీ.. గుణంలో మాత్రం సంపన్నురాలు. స్వపక్షాన్ని కాదని విపక్షానికి ఓటేస్తే చాలు తన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. ఇంటా బయట ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తన వ్యక్తిత్వాన్ని వీడలేదు. చావనైనా చస్తాను కానీ, పార్టీ మారనంటే మారనని పోలీసులతోనే తెగేసి చెప్పారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ. అనారోగ్య సమస్యలతో భర్త శ్రీనివాస్ చనిపోయారు. దీంతో వితంతు పింఛన్, కొబ్బరితోటపై వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఆమె కుటుంబాన్ని నెట్టుకోస్తోంది. పెద్దకుమార్తె 9వ తరగతి, చిన్న కుమార్తె 6వ తరగతి చదువుతున్నారు. యలమంచిలి మండలంలో 17 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను వైయస్ఆర్‌సీపీకి 13, కూటమికి నలుగురు సభ్యుల బలం ఉంది. ఎలాగైనా సరే వైయస్ఆర్‌సీపీ సభ్యులను లాక్కుని ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలని టీడీపీ నేతలు బెదిరింపులు, ప్రలోభాలకు తెర లేపారు. ‘నువ్వు పార్టీ మారితే రూ.5 లక్షలు ఇస్తాం. మీ పిల్లల చదువు, ఉద్యోగం, పెళ్లి బాధ్యత తీసుకుంటాం’ అని బేరం పెట్టారు. ఇందుకు ఆమె నో చెప్పి వైయస్ఆర్‌సీపీ శిబిరానికి వెళ్లింది. ఇదే అదనుగా టీడీపీ నేతలు ఆమె ఇంటికి వెళ్లి కుమార్తెలకు ఆశ చూపించారు. టీడీపీ నేతల కుట్రను అర్థం చేసుకోలేని ఆ పిల్లలతో ‘మా అమ్మను కిడ్నాప్ చేశారు’ అని పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. దీంతో పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్, పట్టణ సీఐ కోలా రజనీకుమార్, యలమంచిలి ఎస్సై కర్ణీడి గుర్రయ్య ఎంపీపీ కార్యాలయం వద్దకు వెళ్లి సత్యశ్రీని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ తన పిల్లలను చూసిన సత్యశ్రీ ఏం జరిగిందో ఊహించింది. ‘మాకు వైయస్ఆర్ అంటే ప్రాణం. మా కుమార్తెకు భారతి అని పేరు పెట్టుకున్నాం. నన్ను బలవంతంగా పార్టీ మారాలని బెదిరిస్తే ఉరేసుకుని చస్తాను కానీ, పార్టీ మారే ప్రసక్తి లేదు. ఇలా బలవంతం చేయడం తగదు’ అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ముఖంపై తెగేసి చెప్పడంతో దిమ్మెరపోయిన పోలీసులు తిరిగి ఆమెను మండల పరిషత్ కార్యాలయం వద్ద దిగబెట్టారు. సత్యశ్రీ తీరు రాజకీయ ఊసర వెల్లులకు చెంపపెట్టు అని ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటున్నారు. మరో పార్టీకి ఎలా మద్దతిస్తాను? అంబేడ్కర్‌కాలనీ–2 ఎంపీటీసీ సభ్యురాలు సృజన ‘జగనన్నను చూసి ప్రజలు నన్ను గెలిపించారు. అలాంటప్పుడు నేను జగనన్న పార్టీకి కాకుండా మరో పార్టీకి ఎలా మద్దతు ఇస్తాను?’ అని అంబేడ్కర్‌కాలనీ–2 ఎంపీటీసీ సభ్యురాలు సృజన కుండబద్దలు కొట్టారు. టీడీపీ నేతల బెదిరింపులతో వారి క్యాంపులో ఉన్నప్పటికీ, తీరా ఓటు వేసే సమయానికి అనుకున్న విధంగా చేసి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం ఎంపీపీ స్థానం విషయంలో ఏ మాత్రం బలం లేకపోయినా తమ ఖాతాలో వేసుకోవాలని కూటమి నాయకత్వం ఆశించింది. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా ఎంపీపీ అభ్యర్థిగా ప్రచారం జరిగిన వైయస్ఆర్‌సీపీ నేత ఆంజనేయరెడ్డి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇక ఎంపీపీ తమదే అని భావించారు. ఎంపీటీసీగా ఉన్న సృజన కుటుంబ సభ్యునిచేతే ఆంజనేయరెడ్డిమీద తప్పుడు కేసు పెట్టించారు. అయితే ఆంజనేయరెడ్డిమీద పెట్టింది తప్పుడు కేసేనని స్వయంగా బాధితునిగా పేర్కొన్న మోహన్‌దాస్ పేర్కొంటుండడంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నించిన పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎంపీటీసీ సృజన పార్టీకి తమ మద్దతు మారదని స్పష్టంచేస్తూ, ఓటింగ్‌లో పాల్గొని కూటమి నేతలకు చెంపపెట్టుగా నిలిచారు. జగనన్న ఫొటోతో గెలిచిన నేను ఎలా మరచిపోతాను? మర్రివేముల ఎంపీటీసీ సభ్యురాలు నాగేంద్రమ్మ పుల్లలచెరువు ఎంపీపీ ఉపాధ్యక్ష పదవికి ఈనెల 27వ తేదీ ఎన్నిక నిర్వహించారు. వరికల్లు నాగేంద్రమ్మ మర్రివేముల ఎంపీటీసీ సభ్యురాలిగా వైయస్ఆర్‌సీపీ నుంచి గెలుపొందారు. ఆమె భర్త వరికల్లు పోలయ్య ముటుకుల సబ్‌స్టేషన్‌లో నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. కూటమి నాయకుల బెదిరింపులతో ఇతను టీడీపీ వారికే ఓటెయ్యాలని భార్యకు సూచించారు. అయితే వైయస్ జగన్ ఫొటోతో గెలిచిన తాను టీడీపీకి ఎలా ఓటేస్తానని తిరస్కరించారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థికే మద్దతు ఇచ్చి.. ఇంట్లో గొడవలు రాకుండా కొద్ది రోజులు పుట్టింటికి వెళ్లారు.