ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో భూస్థాపితం 

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి

వైయ‌స్ జగన్ మీద కోపంతోనే షర్మిల కాంగ్రెస్ పార్టీని నడుపుతోంది

వైయ‌స్ఆర్‌ పేరును చంద్రబాబు తొలగిస్తుంటే షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు?

తాడేపల్లి​: ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ ఏనాడో భూస్థాపితం అయ్యిందని.. అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌  జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్‌ పార్టీ చేసిన హడావిడిని రవిచంద్రారెడ్డి ఎండగట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు గ్రామ, గ్రామాన, మండల, జిల్లా కేంద్రాల్లోనూ , నగర కార్పొరేషన్, సెంట్రల్ ఆఫీస్‌తో సహా జెండా ఎగరవేశారని,  వైయ‌స్ఆర్‌ ను  అభిమానించే పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ…ఈ   75 సంవత్సరాల జయంతి ఉత్సవాలను అద్బుతంగా నిర్వహించినందుకు హృదయపూర్వక అభినందలు తెలియజేస్తున్నానని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కె రవిచంద్రారెడ్డి అన్నారు. 

మరోవైపు రాష్ట్రవిభజన తర్వాత  ఆంధ్రప్రదేశ్లో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ… స్వర్గీయ వైయ‌స్ఆర్‌  జయంతి కార్యక్రమంలో మేమూ ఉన్నామంటూ.. . నిర్వహించే ప్రయత్నం చేసిందని.. ఇందులో భాగంగా తెలంగాణాలో ఆ పార్టీ అధికారంలో ఉన్న నేపధ్యంలో వారు ఆర్ధిక సాయమో, మాట సాయమో చేస్తారని అక్కడ ముఖ్యమంత్రిని పిలిచి మర్చీ నిర్వహించిందన్నారు. అలాగే మరో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని షర్మిలగారు ఆహ్వానించినా వారు రాలేదన్నారు. 

వైయ‌స్ఆర్‌ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరపాలన్న తాపత్రయంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరులను తీసుకుని నిన్న మంగళగిరిలో షర్మిల గారి కోరిక మేరకు నిర్వహించిన సంస్మరణసభలోవైయ‌స్ రాజశేఖర్ రెడ్డి గారితో వారికున్న అనుబంధం గురించి మాట్లాడ్డంతో పాటు ఆయన చేసిన మంచి పనులు గురించి మాట్లాడారన్నారు. మరికొంతమందైతే కాంగ్రెస్ పార్టీ మరలా ఆంధ్రప్రదేశ్లో లేచి నిలవాలని కోరుకున్నారని.. కానీ వాళ్లందరూ అనుకూలంగా ఒక విషయాన్ని మర్చిపోయారని… విభజన చట్టం ద్వారా  కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నడ్డి విరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భూస్ధాపితం అయి, జవసత్వాలు లేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి… దాన్ని ఎలాగైనా మరలా లేచి నడిచేలా చేయాలన్న వారి తాపత్రయం తప్పు కానప్పటికీ అది ఆచరణ సాధ్యం కాని విషయమని తేల్చి చెప్పారు.

స్వర్గీయ వైయ‌స్ఆర్‌ చిత్రపటానికి ప్రతి ఇంట్లో వారి భవిష్యత్తుకు బాటలు వేసిన నాయకుడిగా కీర్తిస్తూ ముందడుగు వేస్తున్నారో…  అదే విధంగా ఇవాళ ఆయన వారసుడిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్ధాపించిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో అంతగా వేళ్లూనుకుందన్నారు. తండ్రి నాలుగు పథకాలతో చిరస్ధాయిగా నిలిచిపోతే… కొడుకుగా అనేక సంక్షేమ పథకాలుతో పాటు ఒక్క రూపాయి అవినీతి లేకుండా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు సంక్షేమ పథకాలు ద్వారా పేదలకు కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందించడం ద్వారా  
వైయస్.జగన్ ప్రజల్లో మనస్సుల్లో నిల్చిపోయారని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా నష్టపరిచిన కాంగ్రెస్ పార్టీ వారసత్వం కోసం, ఇంట్లో ఏదో విభేదాలున్నాయని బయటకు వచ్చి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకూడని మాటలు అనేకం మాట్లాడిన షర్మిల గారికి నాయకత్వాన్నిచ్చి ఆమె ద్వారా కాంగ్రెస్ లేచి పరిగెడుతుందని నమ్మిద్దామంటే ఆంధ్రప్రదేశ్లో అది అమలయ్యే కార్యక్రమం కాదని తేల్చి చెప్పారు. ప్రజలెప్పుడు మిమ్నల్ని దగ్గరికి తీసుకోరని తేల్చి చెప్పారు. 
ఇవాళ ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి నాయకత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు అజెండాను మోస్తూ… ఆ పార్టీకి తోకపార్టీగా మారిందన్నారు. కారణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీయే కూటమి అధికారంలో ఉన్నా… వాళ్లను నిలదీయడానికి ఈమె దగ్గర మాటలు లేవు కానీ.. ఎంతసేపు అన్న మీద అక్కసుతో వారసత్వం కోసం వైయ‌స్ఆర్‌ జపం చేస్తున్నారన్నారు. 

కొత్త ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి వైయ‌స్ఆర్‌ ఆరోగ్యశ్రీ వరకు పేర్లు మారుస్తుంటే ఎందుకు నిలదీయడం లేదని, మీ తండ్రి గారి మీద మీకు ప్రేమ ఉందా ? లేదా? అని  షర్మిలను సూటిగా ప్రశ్నిస్తున్నానన్నారు. ఆ పేర్లను నిలబెట్టి మరింత పురోభివృద్ధిని ప్రజలకిచ్చిన నాయకుడిగా వైయస్.జగన్ మోహన్ రెడ్డి చిరస్ధాయిగా నిలబడతారన్నారు. 

 సాక్షాత్తూ వైయ‌స్ఆర్‌ విగ్రహాలని పట్టపగలే కూలగొడుతూ, పెట్రోల్ పోసి తగలబెడుతుండే మీ నోరు ఎందుకు పెగలడం లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.  లోపాయికారీగా ఆంధ్రజ్యోతి పేపర్కు పుల్ పేజీ యాడ్స్ ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదని… వాళ్ల అజెండా మీద మీరు చంద్రబాబు నాయుడు కోసం తోకపార్టీగా మిగిలి ప్రజల మభ్యపెడితే మాత్రం అది తప్పని చెప్పదల్చుకున్నామన్నారు. 
నిన్న అనేక మంది మంత్రులతో పాటు వచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతిలో వచ్చిన పేక్ న్యూస్ గురించి మాట్లాడుతూ… కడపలో ఉప ఎన్నిక వస్తుందని… ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ రాబట్టుకునే విధంగా, అక్కడ షర్మిలను గెలిపించడానికి ఉర్రూతలూగుతున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారని రవిచంద్రారెడ్డి ఎద్దేవా చేసారు. 
ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉండగా… తన సొంత జిల్లా మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిని గెలిపించుకోలేక, బీజీపీకి చెందిన డీ కే అరుణ ఎంపీగా గెలిస్తే ఎందుకు నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారన్నారు. మీరు నివాసం ఉంటున్న హైదరాబాద్, సికింద్రాబాద్లను కాంగ్రెస్ కోసం గెలిపించుకోలేని మీరు కడపకు వచ్చి ఏదో చేసేస్తామని ఇక్కడ ప్రసంగాలివ్వడం సరికాదన్నారు. మీ మాటలను నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు.
ఎవరు అవునన్నా… కాదన్నా.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని.. మీ లోపాయికారీ బంధం ప్రజలకు స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు. 
బీజీపీ అంటే బాబు, జగన్ ,పవన్ అని మీరు అన్నారు కానీ.. ఎన్డీయేలో చేరినది బాబు, పవన్ మాత్రమేనని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఏ పార్టీతోనూ పొత్తు కోసం వెంపర్లాడలేదని స్పష్టం చేసారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జెండా మీద స్పష్టమైన అజెండాతో ప్రజల తీర్పును కోరామే కానీ.. మేం ఎన్టీయేలో చేరాలనుకుంటే చంద్రబాబునాయుడు గెలిచేవారు కాదన్నారు. మేం పొత్తులకు వ్యతిరేకం కాబట్టి మీరు అందివచ్చిన అన్ని అవకాశాలను, అందరి కాళ్లూ, గెడ్డాలు పట్టుకుని పొత్తులు కుదుర్చుకుని మీరు అధికారంలోకి వచ్చారన్నారు.
కానీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం కట్టుబడి ఉందని..  మా జెండా, అజెండాతో పేద ప్రజల  పక్షాన నిలిచామని.. నాలుగు రోజుల వెనుకా ముందు అయినా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేసారు.  ఈ బ్రేక్ పీరియడ్లో ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత… ప్రభుత్వం అమలుచేయని హామీలు గురించి, ప్రజల పట్ల మోసపూరిత విధానాలు అవలంభిస్తే… వాటి గురించి ప్రజల గొంతుకై, ప్రజలతో కలిసి మమేకమై రోడ్లెక్కి పోరాటాలు చేసే సత్తా ఆంధ్రప్రదేశ్లో ఒక్క వైయస్సార్సీపీకి మాత్రమే ఉందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ కి,  ఇక్కడి ప్రజలకి మాత్రమే అంకితమైన పార్టీ అని వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తెలియజేశారన్నారు. 
కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏపీలో అధికారంలోకి వస్తే తెలంగాణాలో పార్టీని నిలబెడతానని, దేశంలోనే చక్రం తిప్పుతానని చెబుతారు. చంద్రబాబు గారూ మీకు ఇవాళ అద్బుతమైన అవకాశం ఏర్పడింది… ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులు, విభజన చట్టం హామీలు గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. 
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి, రాష్ట్రానికి మేలు చేయడంతో పాటు వాళ్ల తప్పులను ఒప్పుకుని, లెంపలేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పేవరకు కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమే విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్‌కు నష్టమని మరోసారి స్పష్టం చేసారు.

Back to Top