సిండికేట్‌.. ఆన్‌‘లైన్‌’

 
‘ఆన్‌లైన్‌’లో అడ్డంకులు.. ‘ఆఫ్‌లైన్‌’లో బెదిరింపులు!

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ‘సాంకేతిక’ అడ్డంకులు

ఎక్కడైనా అరకొరగా వచ్చినా కాగితాలపైనే నింపుతున్న సిబ్బంది  

ఆఫ్‌లైన్‌ కోసం కార్యాలయాల వద్దకు వెళ్తే బెదిరించి వెనక్కి పంపేస్తున్న పచ్చ ముఠాలు

8,274 దరఖాస్తుల్లో 6,520 ఆఫ్‌లైన్‌లోనే ఒక్కో షాపు కోసం కనీసం 3 దరఖాస్తులూ అందని వైనం

దుకాణాలను ఏకపక్షంగా సిండికేట్‌కు కట్టబెట్టే ఎత్తుగడ  

అమరావతి: రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర తీసిన నేపథ్యంలో ‘‘ముఖ్య’’నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. మద్యం షాపుల ఏర్పాటుకు ‘‘ఆఫ్‌లైన్‌’’ ద్వారా వేల సంఖ్యలో అందుతున్న దరఖాస్తులు సిండికేట్‌ దందాకు పక్కా నిదర్శనంగా నిలుస్తోంది. 

ఆన్‌లైన్‌ ద్వారా అక్కడక్కడా అరకొరగా వచ్చిన దరఖాస్తులను సైతం సిబ్బంది ద్వారా కాగితాలపై నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20 –30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లోనూ కనీసం పది దరఖాస్తులు అందుతాయి. అలాంటిది మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తున్నా ఒక్కో దుకాణానికి కనీసం మూడు దరఖాస్తులు కూడా రాకపోవటాన్ని బట్టి టీడీపీ మద్యం సిండికేట్‌ ఏ స్థాయిలో శాసిస్తోందో వెల్లడవుతోంది. 

రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకుగానూ ఇప్పటివరకు 8,274 దరఖాస్తులు మాత్రమే అందడం.. అది కూడా దాదాపుగా అంతా ఆఫ్‌లైన్‌లోనే రావడం గమనార్హం. ప్రైవేట్‌ మద్యం దుకాణాల ద్వారా టీడీపీ సిండికేట్‌ దోపిడీకి కూటమి ప్రభుత్వం రాచబాట పరిచింది. టీడీపీ సిండికేట్‌ మినహా ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్‌ శాఖ ద్వారా ఎత్తుగడ వేసింది. 

కేవలం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాలకు వచ్చి సమర్పించే దరఖాస్తులకే ప్రాధాన్యమిస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు సాంకేతిక అడ్డంకులు సృష్టిస్తూ టీడీపీ సిండికేట్‌కు కొమ్ముకాస్తోంది. ఇతరులు ఎక్సైజ్‌ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసేందుకు యత్నిస్తే బెదిరించి వెనక్కి పంపుతున్నారు.

రాష్ట్రంలో 3,396 ప్రైవేట్‌ మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం ఎక్సైజ్‌ శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 1 నుంచి 10వతేదీ వరకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు (ఆఫ్‌లైన్‌) చేసుకోవడంతోపాటు ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చని పేర్కొంది. 

మొదటి రోజైన మంగళవారం 200 దరఖాస్తులు అందగా ఆశ్చర్యకరంగా కేవలం రెండు మాత్రమే ఆన్‌లైన్‌లో రావడం గమనార్హం. తాజాగా ఆదివారం నాటికి మొత్తం 8,274 దరఖాస్తులు రాగా వీటిలో 6,520 ఆఫ్‌లైన్‌లోనే స్వీకరించడం గమనార్హం. 1,754 దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో అందాయి.

ఎక్సైజ్‌ కార్యాలయాల్లో తిష్ట
మద్యం దుకాణాల లైసెన్సులన్నీ గంపగుత్తగా టీడీపీ సిండికేట్‌కే దక్కాలని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఎక్సైజ్‌ శాఖ సాంకేతికంగా మోకాలడ్డుతోంది. ఎంతోమంది ఆన్‌లైన్‌ ద్వారా మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదు. సాంకేతిక కారణాలు, సర్వర్‌ డౌన్‌ అంటూ దరఖాస్తులు అప్‌లోడ్‌ కావడం లేదని చెబుతున్నారు. 

ఎక్సైజ్‌ అధికారులను సంప్రదిస్తే కనీస స్పందన లేదని పేర్కొంటున్నారు. ఇదే అదునుగా టీడీపీ సిండికేట్‌ సభ్యులు నేరుగా ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాలకు వచ్చి ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. వారంతా ఎక్సైజ్‌ కార్యాలయాల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు తిష్ట వేస్తున్నారు. ఇతరులు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారు. తమను కాదని దరఖాస్తు చేసినా లైసెన్సులు రావని, లాటరీ ద్వారా ఎంపిక అన్నది పూర్తిగా బోగస్‌ అని తేల్చి చెబుతున్నారు.

దాడులు.. కేసుల బెదిరింపులు
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేస్తామని మొండికేస్తున్న వారిని టీడీపీ సిండికేట్‌ తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. ‘మమ్మల్ని కాదని దరఖాస్తు చేస్తే ఊళ్లో వ్యాపారం చేయగలవా? నీకు మద్యం దుకాణం కోసం షాపు ఎవరు అద్దెకు ఇస్తారో చూస్తాం. సొంత దుకాణంలో పెడితే ఎక్సైజ్‌ అధికారులతో దాడులు చేయిస్తాం. అక్రమ కేసులు బనాయిస్తాం.. ’ అని ఎక్సైజ్‌ అధికారుల సమక్షంలోనే హెచ్చరిస్తున్నారు. 

సిండికేట్‌కు సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తు చేస్తే ఫోన్‌ నంబర్లు సేకరించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతరులు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసేందుకు వెనుకాడుతున్నారు. మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ఎక్సైజ్‌ శాఖ ఏ రోజుకు ఆ రోజు అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. తద్వారా పారదర్శకతకు పాతరేస్తూ ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు దుకాణాల లైసెన్సులు కట్టబెట్టేందుకు సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Back to Top