వైయస్ఆర్ జిల్లా: ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతారని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా పెన్షన్ తప్ప చెప్పిన పథకాలు ఒక్కటీ అమలు కావడం లేదని మండిపడ్డారు . విజయవాడ వదరపాలు కావడానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ధ్వజమెత్తారు. కొవ్వొత్తులకు రూ. 26 కోట్లు, పులిహోరకు రూ. 360 కోట్లు ఖర్చు అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. సోమవారం శివప్రసాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయిందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం చంద్రబాబు, ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ఆయన వ్యక్తిత్వం అపవిత్రం అని, ఆయనది కళంకిత రాజకీయం అని ఆక్షేపించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల మానప్రాణాలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని, ఇందుకు ప్రభుత్వానిదే పూర్తి బా«ధ్యత అని స్పష్టం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో అన్ని వేళల్లో అందరినీ మోసం చేసి మభ్య పెట్టలేరన్న వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తుంటామని తేల్చి చెప్పారు. నాలుగు నెలల్లో పెన్షన్ మొత్తం పెంచడం మినహా, ఏ ఒక్క హామీ అమలు చేయలేదని గుర్తు చేశారు. అందులోనూ ప్రతి నెలా కోత పెడుతూ, ఇప్పటికే 1.5 లక్షల పెన్షన్లు తొలగించాని వెల్లడించారు. విజయవాడ వరదల్లో ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతో, భారీ నష్టం సంభవించిందని.. మరోవైపు బాధితులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని, 10 శాతం మందికి కూడా సాయం చేయలేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. వరద బాధితులకు సాయంలోనూ అంతులేని అవినీతికి పాల్పడ్డారని, దాతలు ఇచ్చిన వందల కోట్ల విరాళాలపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందన్న రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ప్రభుత్వ వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త అంశాన్ని తెర మీదకు తెస్తారని, అందులో భాగంగానే టీటీడీ లడ్డూపై ఆరోపణలు చేశారని తెలిపారు. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిలదీసినా చంద్రబాబు వైఖరిలో మార్పు రాలేదని దుయ్యబట్టారు. నిజానికి టీటీడీ లడ్డూలో కల్తీ లేదని, చంద్రబాబే వ్యక్తిత్వమే కల్తీ అని, ఆయనే కళంకితుడని మాజీ ఎమ్మెల్యే అభివర్ణించారు.