అధికారం అండతో అంగళ్లు కేసు మాఫీ

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌

నాడు అంగళ్లులో స్వయంగా దాడి చేయించిన చంద్రబాబు

307 సెక్షన్‌ కింద చంద్రబాబుపై నాన్‌ బెయిలబుల్‌ కేసు 

అధికారంలోకి రావడంతో విచారణ లేకుండానే కేస్‌ క్లోజ్‌

వైయస్సార్‌సీపీ నాయకులపై 307 సెక్షన్ల కింద కేసులు

అంబటి రాంబాబు తీవ్ర ఆక్షేపణ

లిక్కర్, ఇసుక, డెయిరీ, కేబుల్‌..అన్నింటా టీడీపీ సిండికేట్స్‌

టీడీపీ నాయకులకు సంపద సృష్టించడమే సీఎం ధ్యేయం

వైన్‌షాప్‌ల టెండర్లలో కూటమి ఎమ్మెల్యేల యథేచ్ఛ దందా

ఎమ్మెల్యేల వార్నింగ్‌. టెండర్లకు ముందుకు రాని వ్యాపారులు

ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం. అదీ మద్యం పాలసీ

ఇసుక పాలసీ మాదిరిగానే ఇదీ అట్టర్‌ఫ్లాప్‌ కావడం ఖాయం

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన అంబటి రాంబాబు

గుంటూరు: లిక్కర్, ఇసుక, డెయిరీ, కేబుల్‌ సిండికేట్లతో టీడీపీ నాయకులకు సంపద సృష్టించడం, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను కేసులతో వేధించడం తప్పించి నాలుగు నెలల పాలనలో చంద్రబాబు చేసింది శూన్యమని గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నాడు అంగళ్లులో చంద్రబాబు స్వయంగా దాడి చేయిస్తే, సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశారన్న మాజీ మంత్రి.. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు దర్యాప్తు ఎదుర్కోకుండా, కోర్టుల్లో నిజాయితీ నిరూపించుకోకుండా తనతో పాటు, టీడీపీకి చెందిన 20 మంది మీదున్న తీవ్రమైన కేసుల్ని చంద్రబాబు మాఫీ చేసుకుంటున్నారని ఆక్షేపించారు. అదే సమయంలో వైయస్సార్‌సీపీ నాయకుల మీద కొత్తగా 307 సెక్షన్‌ కింద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. గుంటూరు క్యాంప్‌ ఆఫీస్‌లో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

    నాడు అంగళ్లులో చంద్రబాబు రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు దాడులకు తెగబడడంతో పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో పాటు, పోలీసులూ గాయపడ్డారని గుర్తు చేశారు. అయితే నాడు ఫిర్యాదు చేసిన మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ ఉమాపతిరెడ్డి, ఇప్పుడు విచారణకు హాజరు కావడం లేదంటూ.. ఏకంగా కేసు మూసేయడం హాస్యాస్పదమని అంబటి అన్నారు. ఇదే చంద్రబాబు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 41–ఏ నోటీసులతో బెయిల్‌ పొందిన వైయస్సార్‌సీపీ నాయకులపై 307 సెక్షన్‌ కింద కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఉపయోగించాల్సిన పోలీస్‌ వ్యవస్థను, ఇలా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను బెదిరించడానికే వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
    నాణ్యమైన మద్యం పేరుతో చంద్రబాబు తీసుకొచ్చిన మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడిందని మాజీ మంత్రి వెల్లడించారు. కూటమి ఎమ్మెల్యేల బెదిరింపుల వల్ల వైన్‌షాప్‌ల  టెండర్లకు వ్యాపారులు ముందుకు రావడం లేదని తెలిపారు. రాష్ట్రంలో 3,390 షాపులకు ఇప్పటి వరకు కేవలం 8,274 అప్లికేషన్లు మాత్రమే రావడం.. మరోవైపు 961 షాపులకు ఒక్క అప్లికేషన్‌ కూడా రాకపోవడం దారుణ పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పారు. గతంలో రూ.2 లక్షల నాన్‌ రిఫండబుల్‌ ఫీజ్‌ ఉన్నా, ఒక్కో షాప్‌కు వందల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చేవని, దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల ఆదాయం వచ్చేదని గుర్తు చేశారు. కాగా, ఇప్పుడు లాటరీలో వైన్‌ షాప్‌లు దక్కించుకున్న వారు రూ.30 లక్షల కప్పం కట్టాలని ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని అంబటి తెలిపారు. ఇసుక పాలసీ మాదిరిగా లిక్కర్‌ పాలసీ కూడా అట్టర్‌ఫ్లాప్‌ కావడం ఖాయమని తేల్చి చెప్పారు.
    కూటమి పెద్దలు, ఎమ్మెల్యేలు దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారన్న మాజీ మంత్రి, తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఇసుక స్టాక్‌ పాయింట్లలో 80 లక్షల టన్నుల ఇసుక ఉంచితే, కూటమి ప్రభుత్వం రాగానే దోపిడి మొదలుపెట్టి, 40 లక్షల టన్నులు అమ్మేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర సంపదను దోచి టీడీపీ నాయకులకు సంపద సృష్టించేందుకే చంద్రబాబు పని చేస్తున్నారన్న అంబటి రాంబాబు, ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారని, ఇలాంటి కూటమికి ఎందుకు ఓటేశామని అంతా ఆలోచిస్తున్నారని వివరించారు.

Back to Top