అనంతపురం: ఏపీలో కూటమి పాలనలో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైయస్ఆర్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపుతో వారిపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనల్లో పాల్గొన్న వైయస్ఆర్‌సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతపురం జిల్లాలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కూటమి నేతల మెప్పు కోసం వైయస్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడంతో తగ్గించాలని వైయస్ఆర్‌సీపీ పోరుబాట కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఘన విజయాన్ని అందుకుంది. పోరుబాటలో వైయస్ఆర్‌సీపీ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అక్రమ కేసులపై నిరసన కార్యక్రమం అనంతపురంలో ఉరవకొండ మాజీ విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతల ఫిర్యాదుతో వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి సహా 16 మంది పోలీసులు కేసులు పెట్టారు. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారని పచ్చ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఇదే సమయంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా కేసులు పెట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై పోలీసుల కేసులు పెట్టడంపై సర్వత్రా విమర్శలు ఎదరవుతున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడితోనే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.