‘రెడ్‌బుక్‌’ కుట్రలు.. ఆగని అక్రమ కేసులు.. వేధింపులు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ‘లుక్‌అవుట్‌’ పేరుతో ‘సజ్జల’ అడ్డగింత

కనీస సమాచారం లేకుండా నోటీసులు

తాను విదేశాలకు వెళ్లడం లేదని.. తిరిగి వచ్చానని చెప్పడంతో అనుమతి.. అప్పటికే హైదరాబాద్‌ విమానం టేకాఫ్‌

ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైయ‌స్ఆర్‌సీపీ నేత దేవినేని అవినాశ్‌ లక్ష్యంగా అక్రమ కేసులు

వెర్రితలలు వేస్తున్న చంద్రబాబు రెడ్‌బుక్‌ కుట్రలు

వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అదేపనిగా కక్షసాధింపు

అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ కుట్రలు వెర్రితలలు వేస్తున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ నేతలే లక్ష్యంగా వరుస అక్రమ కేసులతో వారిని వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరతీస్తోంది. అందులో భాగంగానే.. గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని వక్రీకరిస్తూ.. ఆ ఉదంతంతో ఎలాంటి సంబంధంలేని వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. 

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌లపై లుక్‌అవుట్‌ నోటీసు జారీచేయడమే ఇందుకు తాజా నిదర్శనం. నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం మొన్న అధికారంలోకి వచ్చీరాగానే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే దాదాపు నిర్మాణం పూర్తయిన వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయాన్ని అర్థరాత్రి బుల్డోజర్లతో కూల్చివేసింది. దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో స్టే మంజూరైంది. 

అయినాసరే కూల్చివేతకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు ఆదేశాలతోనే వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేశారు కాబట్టి. కానీ, మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడలేని అత్యుత్సాహం చూపిస్తోంది. 

అప్పట్లో టీడీపీ నేత పట్టాభి నాటి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు మనస్తాపం చెంది తీవ్రస్థాయిలో నిరసన తెలిపి ధర్నా చేశారు. ఈ ఘటనను వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.

నోటీసులతో వేధింపులు..
ఈ నేపథ్యంలో.. వైయ‌స్ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన మరో విమానంలో హైదరాబాద్‌కు రావల్సి ఉంది. కానీ, సజ్జలపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ అయ్యిందని ఇమిగ్రేషన్‌ అధికారులు ఆయన్ని అడ్డుకున్నారు. లుక్‌అవుట్‌ నోటీసు జారీ అయిన విషయంపై తనకు సమాచారం లేకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదు. 

అలాగే, కొన్నిరోజుల క్రితం విదేశాలకు వెళ్తున్నప్పుడు లేని లుక్‌అవుట్‌ నోటీసు.. విదేశాల నుంచి తిరిగి స్వదేశానికి వచ్చినప్పుడు ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. తాను విదేశాలకు వెళ్లడంలేదని.. తిరిగి వచ్చానని.. తనను హైదరాబాద్‌ వెళ్లేందుకు అడ్డుకోవడం ఏమిటని నిలదీస్తే ఇమిగ్రేషన్‌ అధికారులు నీళ్లు నమిలారు. కొద్దిసేపటి తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లేందుకు అనుమతించారు. 

కానీ, అప్పటికే ఆయన ప్రయాణించాల్సిన హైదరాబాద్‌ విమానం టేకాఫ్‌ అయిపోయింది. ఇదే తరహాలో కొన్నిరోజుల క్రితం మరో వైయ‌స్ఆర్‌సీపీ నేత దేవినేని అవినాశ్‌ను కూడా శంషాబాద్‌ విమానాశ్రయంలో అడ్డుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. ఇదే అక్రమ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ప్రభుత్వం వేధిస్తోంది. 

ఆయన్ని అక్రమంగా అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయనపై మరో అక్రమ కేసులో అరెస్టుచేయడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం. ఇదే రీతిలో లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్‌లతోపాటు ఇతర వైయ‌స్ఆర్‌సీపీ నేతలే లక్ష్యంగా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది.

మూడోసారి వైయ‌స్ఆర్‌సీపీ నేతల విచారణ..
ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ సోమవారం మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో వారిని మంగళగిరి రూరల్‌ పోలీసులు విచారించడం ఇది మూడోసారి. 

మరోవైపు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకుడు పానుగంటి చైతన్య సోమవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజులు రిమాండ్‌ విధించింది. అనంతరం చైతన్యను పోలీసులు గుంటూరు సబ్‌ జైలుకు తరలించారు.

Back to Top