పెద్దిరెడ్డిపై ఆరోపణలన్నీ అసత్యాలే

ప్రభుత్వం ఏ విచారణ చేసుకున్నా తేలేది ఇదే  

చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టీకరణ

రాజకీయ కక్షతోనే పెద్దిరెడ్డిపై తప్పుడు కథనాలు

వైయ‌స్ఆర్‌సీపీ కీలక నాయకులే వారి టార్గెట్‌ 

మా పార్టీని దెబ్బ తీయాలని చంద్రబాబు కుట్ర  

ఎలాంటి వేధింపులకూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు

తేల్చి చెప్పిన భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి:  వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రాజకీయ కక్షతోనే.. ఆయన అటవీ భూములు ఆక్రమించారంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనం అచ్చేసిందని, ప్రభుత్వం దానిపై ఏ విచారణ చేసుకున్నా ఆయన కడిగిన ముత్యంలా బయటపడతారని వైయ‌స్ఆర్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ పత్రిక తప్పుడు కథనంపై ఆధారాలతో సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చినా.. దానికి కేవలం సింగిల్‌ కాలమ్‌ కేటాయించి, పత్రికా విలువలను తుంగలో తొక్కిందని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా, తమ పోరాటం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భూమన కరుణాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు. గురువారం భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి  తిరుపతిలో మీడియాకు వీడియో రిలీజ్ చేశారు.

భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే..:
మా పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారంటూ ఎల్లో మీడియా పత్రిక తప్పుడు కథనం రాసింది. ఆ అసత్య కథనాన్ని నిజమని నమ్మించేందుకు ఆ పత్రిక గట్టి ప్రయత్నం కూడా చేసింది. తాము ఏం రాసినా చెల్లుబాటవుతుంది. ఏం చెప్పినా జనం నమ్ముతారని అనుకుంటున్నట్లుంది. అందుకే ఆ పత్రిక కొంత కాలంగా పెద్దిరెడ్డిగారి కుటుంబంపై విష ప్రచారమే పనిగా పెట్టుకుంది.  

    వైయ‌స్ఆర్‌సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డిని వేధించడం ద్వారా మా పార్టీని దెబ్బ తీయవచ్చనే కుట్రతోనే చంద్రబాబు డైరెక్షన్‌లో ఆ పత్రిక అలాంటి అసత్య కథనాలు రాస్తోంది. దానిపై ఆయన గట్టిగా స్పందించి, అది తప్పుడు కథనమంటూ.. ఆధారాలతో సహా సవాల్‌ చేశారు. కానీ ఆయన వివరణకు ఆ పత్రిక ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. అలా ఆ పత్రిక జర్నలిజం విలువలను తుంగలో తొక్కింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ప్రభుత్వం ఎలాంటి విచారణ చేసుకున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారు. 

ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకపోయినా, ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా ప్రశ్నించడం మానేసి.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ మీద ద్వేషంతోనే మా పార్టీ నాయకులే లక్ష్యంగా ఆ పత్రిక విషం చిమ్ముతోంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గత జగన్‌ పాలన మీదకు నెట్టేసేందుకు అనుక్షణం తాపత్రయ పడుతోంది. మాపై ఎన్ని దాడులు చేసినా కూటమి ప్రభుత్వం మీద మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదు.

Back to Top