చిత్తూరు మేయర్‌పై సీఐ అనుచిత ప్రవర్తన

‘నువ్వు మేయర్‌ అయితే నాకేంటి? ఏం తమాషాలు చేస్తున్నావా?’

చిత్తూరు: గాంధీ జయంతి రోజే  నగర ప్రథమ పౌరురాలైన మహిళా మేయర్‌కు అవమానం జరిగింది. నడిరోడ్డుపై కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజలు చూస్తుండగానే మహిళా మేయర్‌ ఆముదపై ట్రాఫిక్‌ సీఐ నిత్యబాబు దౌర్జన్యపూరితంగా వ్యవ­హ­రించడం, ఏకవచనంతో రెచ్చిపోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఓ దశలో మేయర్‌ను కొట్టడానికి మీదిమీదికి వెళుతున్నాడేంటి అంటూ చుట్టూ ఉన్న జనం నోరెళ్లబెట్టారు.

బుధవారం మహా­త్ముడి జయంతిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించ‌డానికి మేయర్‌ ఆముద, కలెక్టర్‌ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, పలువురు అధికారులు వచ్చారు. అధికారుల వాహనాలతో పాటు ఎమ్మెల్యే వాహనాలు రోడ్డుకు ఓ­వైపు పార్కింగ్‌ చేశారు. మేయర్‌ వాహనానికి స్థలం లేకపోవడంతో మరోవైపు పార్కింగ్‌ చేశారు. అప్ప­టికే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్‌ సీఐ నిత్యబాబు.. మేయర్‌ కారును అక్కడి నుంచి తీసేయాలని చెప్పాడు.

కార్యక్రమం అయిపోగానే వెళ్లిపోతామని మేయర్‌ డ్రైవర్‌ చెప్పినా సీఐ అంగీకరించలేదు. దీంతో డ్రైవర్‌ కారును కొద్దిసేపు పీసీఆర్‌ కళాశాల చుట్టూ తిప్పి.. కార్యక్రమం అయిపోవస్తుండటంతో కార్యక్రమం జరిగే ప్రాంతానికి కారును తీసుకొచ్చాడు. మేయర్‌ కారులోకి ఎక్కి, బయల్దేరబోతుండగా సీఐ మళ్లీ వచ్చారు. కారు అద్దాలను బాదుతూ బండి తీయాలంటూ రచ్చ చేశారు.

లోపల మేయర్‌ ఉన్నారని, వెళ్లిపోతున్నామని డ్రైవర్‌ చెబుతున్నా సీఐ వినలేదు. దీంతో ఆగ్రహించిన మేయర్‌ వాహ­నం దిగి కిందకు వచ్చారు. తమ వాహనానికి ముందు, వెనుక కలెక్టర్, ఎమ్మెల్యే కార్లు ఉంటే ఎలా వెళతామని ప్రశ్నించారు. దీంతో సీఐ మరింతగా రెచ్చిపోయారు. ‘నువ్వు మేయరైతే నాకేంటి? డ్రైవర్‌తో మాట్లాడుతుంటే నువ్వు వస్తావెందుకు? ఏం తమాషా చేస్తున్నావా?’ అంటూ ఏక వచనంతో సంబోధిస్తూ ఓ దశలో మేయర్‌పైకి సీఐ దూసుకెళ్లారు.  

Back to Top