చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యం

మాజీ మంత్రి అంబటి రాంబాబు
 

తాడేప‌ల్లి: గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయ్యిందని ఏపీ మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం చంద్రబాబు తాజాగా పొలవరంలో పర్యటించడం.. ప్రెస్‌మీట్‌ నిర్వహించి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో అంబటి స్పందించారు.   పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలు, పచ్చి అబద్ధాలని జలవనరుల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం పర్యటన సందర్భంగా తాను చేసిన తప్పులను గుర్తు చేసుకోకుండా జగన్ మోహన్ రెడ్డి గారిపై బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. చేసిన తప్పులను సవినయంగా ఒప్పుకొని చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇవి.

-    ప్రమాణస్వీకారం చేసిన 5 రోజులకే చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు. 
-    చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలూ కావు, వాస్తవాలు అవాస్తవాలూ కావు. చరిత్ర ప్రతి దాన్నీ గమనిస్తూనే ఉంటుంది. 
-    పోలవరానికి సంబంధించిన అంశాలను చాలా దుర్మార్గంగా ఎష్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించిన కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. 
-    ’’పోలవరానికి జగన్ ద్రోహం.. క్షమించరాని నేరం’’ అని ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్ లో పెట్టారు. 
-    మరొక ఇంగ్లీషు పత్రికలో పోలవరం నాలుగు సంవత్సరాలకు గానీ పూర్తి కాదు అనే మాట మాట్లాడారు.
-    చివరకు పోలవరం పూర్తిచేయాలంటూ ఇంకా నాలుగు సంవత్సరాలు పడుతుందనే మాట చంద్రబాబు మాట్లాడుతున్నారు. 
-    జగన్ మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనే మాట పదే పదే చెప్పే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు.
-    2019కు ముందు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలే పోలవరం విషయంలో సంక్షోభం వచ్చింది.
-    వైసీపీ వ్యక్తిగానో, జగన్ మోహన్ రెడ్డి గారి అనుంగు వ్యక్తిగానో, రాజశేఖరరెడ్డి గారి శిష్యుడిగానో లేదా బురదజల్లే ఉద్దేశంతోనో నేను ఇది చెప్పడం లేదు.
-    చంద్రబాబు హయాంలో నాలుగేళ్లు అయినా సరే… ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్న విశ్వాసం కనిపించడంలేదు. 
-    ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదాలు, చారిత్రక తప్పిదాలు ఈ పరిస్థితికి దారితీశాయి. 
-    ముందుగా స్పిల్‌వే, తర్వాత ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం పూర్తిచేయకుండా డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టడమే దీనికి ప్రధాన కారణం. 

-    డయాఫ్రం వాల్‌తో పాటు ఎగువ కాఫర్ డ్యామూ, దిగువ కాఫర్ డ్యామూ సమాంతరంగా చేశారు. దీనివెనుక అసలు కారణాలు చంద్రబాబుకు తెలుసు. 
-    చివరకు కాఫర్‌ డ్యాంల మధ్యఖాళీలు ఉంచేయడంతో వరదలకు డయాఫ్రంవాల్‌ పూర్తిగా దెబ్బతింది. 
-    భావర్ కంపెనీ వాళ్లు జర్మనీ వాళ్లు వచ్చి రూ.460 కోట్లు తీసుకుని డయాఫ్రం వాల్ వేసేశారు. 
-    స్పిల్‌వేను కంప్లీట్‌ చేయకపోవడంతో, ఎగువ కాఫర్‌ డ్యాం కంప్లీట్‌ చేయకపోవడంతో చివరకు వరదనీరు ఆ ఖాళీలగుండా ఉద్ధృతంగా ప్రవహించింది. 
-    దీనివల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందనేది పచ్చి వాస్తవం. 

-    ఈవాస్తవాలను దాచిపెట్టి, కాంట్రాక్టర్‌ను మార్చడం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందన్నట్టుగా చంద్రబాబు అవాస్తవాలు చెప్తున్నారు. 
-    ఇటు స్పిల్‌ వే పూర్తిచేయకపోవడం, మరోవైపు కాఫర్‌ డ్యాం పూర్తిచేయకపోడం, గోదావరి నదిని డైవర్షన్‌ చేయకపోవడంవల్ల 54 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొన్నాయనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారు. 
-    వీటికి సమాధానం చెప్పకుండా మీరు చేసిన తప్పులను జగన్ మోహన్ రెడ్డి గారిపైకి నెట్టేసి పబ్బం గడుపుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. 
-    పోలవరంలో జరిగిన అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు, మేధావులు, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్లు అర్థం చేసుకోవాలి. 
-    చంద్రబాబునాయుడు వల్ల ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. జీవనాడి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు వల్లే ఆలస్యం అయ్యింది. 
-    చివరకు ప్రజలు అధికారం ఇచ్చినా సరే ఐదేళ్లలో పూర్తిచేస్తామనే మాట చంద్రబాబు చెప్పలేకపోతున్నారు.
-    అశాస్త్రీయంగా చంద్రబాబు ఆలోచించడంవల్లే ఈ పరిస్థితి. 2019కు ముందు మీ సొంత తెలివితేటలు ఉపయోగించడం వల్ల అనేక తప్పులు చంద్రబాబు చేశారు. ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డం అన్యాయం. 
-    డయాఫ్రం వాల్‌ ఏం చేయాలన్నదానిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికే నిర్ధిష్టమైన నిర్ణయానికి రాలేదు. 
-    పోలవరం ప్రాజెక్టులో 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెప్తున్నారు. అసలు మేమేం చేశామో ససాక్ష్యంగా వివరించాం. 
-    మేం కట్టిన స్పిల్‌వే మీద చంద్రబాబు ప్రయాణించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. 
-    మేమే రెండు కాఫర్‌ డ్యాంలు పూర్తిచేశాం. గోదావరి నదిని పూర్తిగా స్పిల్‌వే మీదుగా డైవర్షన్‌ చేశాం. 
-    స్పిల్‌ ఛానల్‌, అప్రోచ్‌ ఛానల్‌ కూడా పూర్తి చేశాం. ఇవికాక క్రిటికల్‌ నిర్మాణాలు పూర్తిచేసి, గేట్లు అన్నీ పెట్టి… ప్రస్తుతం ఎంత వరద వచ్చినా ఆపరేట్‌ చేసే పరిస్థితికి ప్రాజెక్టును తీసుకెళ్లాం. 
-    కానీ చంద్రబాబు మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 
-    చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వెళ్తానంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నారు. కాబట్టి దీన్ని కూలంకషంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా. జగన్ మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. నాలుగు సంవత్సరాలకు అవుతుందా, ఐదు సంవత్సరాలకు అవుతుందా? చివరికి అపర మేధావినని, చక్రం తిప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం.. ఆయన ప్రభుత్వం చేసిన తప్పిదం తప్ప మరొకటి కాదు. 
-    అపర మేధావి, మోస్ట్ సీనియర్ అనుకునే నారా చంద్రబాబు నాయుడు సమయంలో జరిగిన విధ్వంసం వల్ల ప్రతి తెలుగువాడూ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది. దీనిపై నేను సవాల్ చేస్తున్నా. ఏవిధమైన తప్పిదం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది లేదు. 
-    చంద్రబాబు తన తప్పులను ఒప్పుకోవాలి. 

-    చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురావాలి. లేదంటే ద్రోహిగా మిగిలిపోతారు..
-    ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. భగవంతుడు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కూటమిని గెలిపించారు. టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇచ్చారు. మోడీ గారు చంద్రబాబుమీద ఆధారపడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. చంద్రబాబు చాలా లక్కీ. ఆంధ్రప్రదేశ్ కు కూడా లక్కీయే. ఇలాంటి పరిస్థితి రావాలని జగన్ మోహన్ రెడ్డి గారు చాలా సార్లు కోరుకున్నారు. ఆయనకు రాని అవకాశం టీడీపీకి వచ్చింది. ఇప్పుడు ధర్మపోరాట దీక్షలు అవసరం లేదు. మీ చేతిలో పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదాను తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణం పోయండని చంద్రబాబును డిమాండ్‌ చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు లాంటి ద్రోహి ఎవరూ ఉండరని మనవి చేస్తున్నా. చంద్రబాబు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రత్యేక హోదా, రాజధాని పునర్నిర్మాణం, పోలవరం నిర్మాణం ఇవన్నీ వదిలేసి జగన్ మోహన్ రెడ్డి గారిని రోజూ తిట్టుకుంటూ ఉంటే ఎవరు మిమ్మల్ని నమ్ముతారు?’’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. 

 

 

Back to Top