చట్టవిరుద్ధంగా న్యూస్‌ ఛానళ్లు ఆపుతారా? 

ఏపీలో టిడిపి సర్కారు కక్ష సాధింపుపై ఢిల్లీ హైకోర్టు సీరియస్‌

న్యూస్‌ ఛానళ్లను చట్టవిరుద్ధంగా నిలిపివేయడంపై ఆగ్రహం

తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

ట్రాయ్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దన్న NBF

న్యూఢిల్లీ:  ‘సాక్షి టీవీ’ సహా టీవీ9, NTV, 10TV  ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో చట్టవిరుద్ధంగా నిలిపివేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కక్షలకు వార్తా ఛానళ్లను బలి చేయొద్దని సూచించింది. ‘సాక్షి టీవీ’ సహా టీవీ9, NTV, 10TV  ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో తక్షణం పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉండడం వల్ల ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌-NBF ఆశ్రయించగా.. న్యాయస్థానం ఈ ఉత్తర్వులిచ్చింది. TV9, సాక్షి, 10టీవీ, NTV న్యూస్‌ ఛానెల్స్‌ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ 15 మంది మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ NBF హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా న్యూస్‌ఛానెల్స్‌ని బ్లాక్‌ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టిందని తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చరిత్రాత్మకమైనవి NBF అభినందించింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పిందని NBF తెలిపింది. 

ఏపీలో ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు కేబుల్‌ ఆపరేటర్లను బెదిరించి ఛానళ్లను నిలిపివేశారని న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ ఆరోపించింది. ట్రాయ్‌ నిబంధనల ప్రకారం ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం చట్టవిరుద్ధమనీ, అలాగే కేబుల్‌ ఆపరేటర్లతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌-NBF గుర్తుచేసింది. 

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా అవసరమని హైకోర్టు జోక్యం చాటిచెప్పిందని NBF తెలిపింది. దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయుల హక్కులను పరిరక్షించడానికి హైకోర్టు ఆదేశం నాంది పలుకుతుంని ఆశిస్తున్నట్లు ఈ సంస్థ వ్యాఖ్యానించింది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ, స్వేచ్ఛాయుత, స్వతంత్ర మీడియాను ప్రోత్సహించినందుకు ఢిల్లీ హైకోర్టుకు NBF అభినందనలు తెలిపింది. ఇక ముందు ఇలా ఛానెల్స్‌ ప్రసారాల నిలిపివేతలను అడ్డుకోడానికి ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని NBF విజ్ఞప్తి చేసింది. అనవసర జోక్యాలు లేకుండా మీడియా ఛానెల్స్‌ పనిచేసే వాతావరణం కల్పించాలని NBF విన్నవించింది. 

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై హ‌ర్షం:  మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
ఏపీలో నాలుగు తెలుగు న్యూస్‌ ఛానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలంటూ కేబుల్‌ ఆపరేటర్లకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున హర్షం వ్యక్తంచేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛను బలోపేతం చేసే చర్యగా, మీడియా స్వేఛ్చను పరిరక్షించే తీర్పుగా దీన్ని భావిస్తున్నాం.  ఢిల్లీ హైకోర్టు తీర్పును సహృదయంతో అర్థంచేసుకుని నిలిపేసిన న్యూస్‌ఛానళ్ల ప్రసారాలను తిరిగి ప్రారంభించాలని కేబుల్‌ ఆపరేటర్లకు విజ్ఞప్తిచేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు చెప్పే హక్కు అందరికీ ఉంటుందని, ఛానళ్ల పునరుద్ధరణ ద్వారా వాటిని గౌరవించనట్టే అవుతుందని తెలియజేసుకుంటున్నామ‌ని మాజీ మంత్రి, బొత్స సత్యన్నారాయణ పేర్కొన్నారు.

Back to Top