చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం సర్వనాశనం

మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

వ్యూహాత్మక తప్పిదాలన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగాయి

కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టుకు ఎందుకు తీసుకున్నారు?

2013-14 రేట్లతో 2016లో అంగీకరించడం ద్రోహం కాదా?

స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, నది డైవర్షన్‌ పూర్తి చేయకుండా కాఫర్‌ డ్యాములు ప్రారంభించడం తప్పు

అన్ని అనుమతులూ తీసుకొచ్చింది డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు

వైయ‌స్ఆర్‌ కంటే ముందే సీఎం అయిన బాబు...పోలవరంపై ఎందుకు ధ్యాస పెట్టలేదు?

చారిత్రాత్మక తప్పిదాలన్నీ చంద్రబాబు చేసి అవన్నీ జగన్‌ గారిపై రుద్దేస్తారా?

బాబు వైఖరి చూస్తే ఆయన హయాంలో పూర్తిచేసే ఉద్దేశం లేదని వ్యాఖ్య

తాడేపల్లి:  ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం అయ్యిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రాజెక్టు విషయంలో వ్యూహాత్మక తప్పిదాలు అన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారని, 2013-14 రేట్లతో 2016లో ప్రాజెక్టును టేకోవర్ చేసి తప్పు చేశారన్నారు. అన్ని అనుమతులూ తీసుకొచ్చి దివంగత వైయ‌స్ఆర్‌ పోలవరానికి ప్రాణం పోశారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. 

శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు అబద్ధాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం పేరుతో పోలవరం గురించి ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని అంబటి అన్నారు. చంద్రబాబు ఇచ్చిన శ్వేతపత్రంలో వాస్తవాలు లేవని, అన్నీ తప్పులు చెబుతున్నామన్న భయం లోపల ఉందన్నారు. ఎప్పుడు పూర్తి చేస్తారంటే దానికి సమాధానం లేదన్నారు. ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు ఇకపై వెళ్లబోనని ఇవాళ చెప్పాడన్నారు. అదేమంటే వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి విధ్వంసం అంటున్నారని, కాంట్రాక్టర్లను మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయిందంటున్నారన్నారు. మళ్లీ వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతారనే భయం, ఆయనకు 40 శాతం ఓట్ల శాతం ఉందనే భయం, మీరు ముగ్గురు కలిసినా కేవలం 56 శాతం మాత్రమే వచ్చాయని మీకు తెలుసని, మళ్లీ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఇంతై, అంతై వటుడింతై అన్నట్టుగా రాబోయే కాలంలో ఎదిగిపోతాడు కాబట్టి, చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేడు కాబట్టి ఇలా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. 

అన్ని అనుమతులు తెచ్చిందివైయ‌స్ఆర్‌ గారే
కేంద్రంతో  మాట్లాడి వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారు అనేక అనుమతులు తీసుకొచ్చారన్నారు. 2005 సెప్టెంబర్‌లో నిర్మాణ స్థలానికి, 2005 అక్టోబర్‌లో పర్యావరణ, 2006 జూలైలో వన్యప్రాణుల రక్షణ, 2007 ఏప్రిల్‌లో పునరావాస ప్రణాళిక, 2008లో పాపికొండల వన్యప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపునకు అనుమతులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. అలాగే 2008 డిసెంబర్‌లో అటవీ శాఖ స్టేజ్‌ 1, 2009 జనవరిలో సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి, 2009 ఫిబ్రవరిలో కేంద్ర ప్రణాళిక శాఖ అనుమతి, 2009 మార్చిలో కేంద్ర ఆర్థిక శాఖ కమిటీ అనుమతులు తీసుకొచ్చారన్నారు. 2010 జూలైలో అటవీ శాఖ స్టేజ్‌ 2 అనుమతి లభించిందని, ఈ ఫైల్‌ అంతా వైయస్సార్‌ గారి హయాంలోనే నడిచిందని గుర్తు చేశారు. అనేక సార్లు విజిట్ చేసి, ఎంపీలతో కలిసి వెళ్లి అన్ని అనుమతులూ తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు అని కొనియాడారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు కలలుగన్న ప్రాజెక్టు ఇదని,  ఆయన టైమ్ లోనే నిర్మాణం ప్రారంభమైందని, కాలువలు తవ్వారన్నారు. రాజశేఖరరెడ్డి గారి కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని, కానీ జీవనాడి అయిన పోలవరాన్ని గురించి ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు పోలవరం గురించి శ్రద్ధ, ఆలోచన లేదని అంబటి రాంబాబు విమర్శించారు. 

చంద్రబాబు చేసిన ఘోర తప్పిదాలు
చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాల వల్లే పోలవరం సర్వనాశనమైందని అంబటి మండిపడ్డారు. ఒక్కరోజులో 32,315 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ వేసి గిన్నీస్ రికార్డు అని చంద్రబాబు డబ్బా కొట్టుకున్నారన్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి, 2024లో ప్రాజెక్టును ఏ స్థితికి తెచ్చిందీ ప్రజెంటేషన్‌ ద్వారా అంబటి రాంబాబు చూపించారు. చంద్రబాబు తప్పిదాలను ఈ సందర్భంగా అంబటి వివరించారు. 

స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, నది డైవర్షన్‌ కంప్లీట్ కాకుండా కాఫర్‌ డ్యాములు ప్రారంభించి డయాఫ్రం వాల్ పూర్తి చేయడం.
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాసం, రిహ్యాబిలిటేషన్‌, వాటర్ కాంపోనెంట్, విద్యుత్ కాంపోనెంట్.. ప్రతిదీ కూడా కేంద్రమేచేసి ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టును మీరు తీసుకోవడం చారిత్రాత్మక తప్పిదం.
2018కే పూర్తి చేసి నీళ్లు నిలబెట్టి అపరభగీరథుడు చంద్రబాబు అని నిరూపిస్తామన్న మీరు అది చేయలేకపోయారు.
మొదటగా పనులు చేపట్టిన ట్రాన్స్ ట్రాయ్ ఏజెన్సీ వాళ్లు కోరినట్లుగా 2011-12 రేట్ల ప్రకారం అగ్రిమెంట్ అయితే, చంద్రబాబు మాత్రం 2015-16 రేట్ల ప్రకారం రూ.1,332 కోట్లు సమర్పించేశారు.
నామినేషన్‌ పద్ధతిలో నవయుగకు పెంచిన 2015-16 రేట్ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 3 వేల కోట్లు పనిని అప్పగించారు.

అవినీతి డబ్బు కోసమే చంద్రబాబు తాపత్రయం
రాష్ట్ర ప్రజల సంక్షేమం, వ్యవసాయం బాగుండాలని రాజశేఖరరెడ్డి గారు ఈ  ప్రాజెక్టును ప్రారంభిస్తే జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేవలం కరప్షన్‌ కోసం, డబ్బుల కోసం చంద్రబాబు తీసుకునే ప్రయత్నం చేశారని అంబటి దుయ్యబట్టారు. ఇది సాక్షాత్తూ మీ పార్ట్నర్ గా ఉన్న మోడీ గారు చెప్పిందేనన్నారు. ఆరోజు మోడీ దగ్గర నుంచి విడిపోయి.. ప్రత్యేక హోదా, పోలవరానికి డబ్బులు ఇవ్వడం లేదని బజారుకెక్కినప్పుడు మోడీ గారు ఈ విషయాలు చెప్పారన్నారు. పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని మోడీ బహిరంగ సభలో చెప్పారని గుర్తు చేశారు. 2016లో ఒప్పందం కుదిరిన తర్వాత ట్రాన్స్ ట్రాయ్ ని తీసేసి నవయుగను ఎంటర్ చేశారన్నారు. నవయుగ కాంట్రాక్టర్ రామోజీరావు బంధువేనన్నారు. కాంట్రాక్టర్ ను నామినేషన్‌ పద్ధతిలో మార్చారన్నారు.  నవయుగను జేబు సంస్థగా పెట్టుకుని డబ్బులు కొట్టేసే కుట్రచేసినందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ ద్వారా నవయుగను మార్చి మేఘకు ఇచ్చామని గుర్తు చేశారు. ట్రాన్స్ ట్రాయ్ నుంచి నవయుగకు మీరు మార్చవచ్చు గానీ, నవయుగ నుంచి మార్చడం చాలా విధ్వంసం అంటూ వ్యాఖ్యానించడం బాబుకే చెల్లిందన్నారు. 

చంద్రబాబువి పచ్చి అబద్ధాలు..
కాఫర్‌ డ్యాములు పూడ్చకపోవడం వల్లనే డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు. ఇదే జగన్‌ మోహన్‌ రెడ్డి గారు చేసిన తప్పు అని చంద్రబాబు వ్యాఖ్యానించారన్నారు. నది డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్లు ఎగదన్నితే నది పైభాగంలో ఉన్న 54 గ్రామాలు మునిగిపోతాయన్నారు. స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ కంప్లీట్ అయిన తర్వాత, నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మాత్రమే కాఫర్‌ డ్యాముల డ్యామేజీలను పూడ్చాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబు గేట్లు పెట్టకుండా రేకులు పెట్టి పాటలు పాడించి, భజనలు చేయించారని గుర్తుచేశారు. నదిని డైవర్ట్ చేయడం అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, మరో చానల్ పూర్తి చేసి నదిని డైవర్ట్ చేసిన తర్వాత కాఫర్‌ డ్యాములు నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉంటుందన్నారు. డైవర్ట్ కంప్లీట్ కాలేదు, డయాఫ్రం వాల్ కట్టేశారు, కాఫర్‌ డ్యాములు వేసేశారు, బొక్కలు పెట్టారు, మమ్మల్ని పూడ్చాలంటారు, కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల పూడ్చలేదంటారు... ఇన్ని అబద్ధాలు ఎందుకంటూ ప్రశ్నించారు. డయాఫ్రం వాల్ దెబ్బతిందని నేషనల్ పవర్ కార్పొరేషన్‌ నిపుణులు వచ్చి ఆరు నెలలు పరీక్షించి చెప్పారన్నారు. దాన్ని మరమ్మతులు చేసుకుంటారో, సమాంతరంగా మరో డయాఫ్రం వాల్ నిర్మించుకుంటారో చూసుకోవాలని చెప్పారన్నారు. 

ఎవరు చేసినా రెండు దశల్లో పోలవరం పూర్తి చేయాలి
ఇవాళ జరిగిన సమావేశంలో 41.15 ఏమిటి? 45.72 ఏమిటని మీడియా ప్రతినిధులు అడిగితే చంద్రబాబు చూడాలి.. అంటూ దాటవేశారన్నారు. బహుశా ఆయనకూ అర్థం కాలేదేమోనన్నారు. 41.15 ఎత్తున ప్రాజెక్టు తొలిదశ పూర్తవుతుందన్నారు. ఆ మేరకు నీటిని నిలబెట్టాలన్నారు. గ్రావిటీ ద్వారా పంపిస్తారన్నారు. ఆ తర్వాత ప్రాజెక్టును పరిశీలించాక రెండో దశ 45.72కు నీళ్లు నింపుతారన్నారు. 41.15కు రిహాబిలిటేషన్ గానీ, భూ సేకరణ గానీ ఒక పద్ధతిలో ఉంటుందని, 45.72కు అయితే పెరుగుతుందన్నారు. అది కూడా కేంద్రమే ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. ఈ రెండు దశల్లో మాత్రమే ఎవరు అధికారంలో ఉన్నా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మూడు తప్పిదాలూ మీమీద రుద్దే ప్రయత్నం చేయడం దుర్మార్గం, అన్యాయమన్నారు. 

మా హయాంలో ఏ తప్పూ చేయలేదు..
ఐదే సంవత్సరాల పాటు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం పోలవరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏ విధమైన తప్పిదాలూ చేయలేదని అంబటి స్పష్టీకరించారు. మరీ ముఖ్యంగా పోలవరం విషయంలో అతి జాగరూకతతో వ్యవహరించామన్నారు. చిన్న తప్పు కూడా జరగకుండా శాస్త్రీయంగా, కరోనా ఉన్నప్పటికీ కూడా అత్యంత వేగవంతంగా చేసే ప్రయత్నం చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి నీళ్లు గలగల మంటూ ప్రవహిస్తే రాజశేఖరరెడ్డి గారి ఆత్మ ముందుగా శాంతిస్తుందన్నారు. కానీ, మీ ధోరణి చూస్తే పూర్తి చేసేటట్లు లేరని, మళ్లీ రాజశేఖరరెడ్డి కొడుకే దీన్ని ప్రారంభిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ప్రాజెక్టుల విషయంలో అనేక పాపాలు చంద్రబాబు చేశారని, ఆ పాపాలన్నీ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిపై రుద్దాలని ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు వయసులో పెద్దవారు అయినంత మాత్రాన అబద్ధాలు చెప్పొద్దని, వాస్తవాలు అంగీకరించి చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తి చేయాలని హితవు పలికారు.

Back to Top