పెన్ష‌న్ల‌కు రాజ‌కీయ రంగు

పెన్షన్ల పంపిణీకి వలంటీర్లు దూరం

టీడీపీ ఈవెంట్‌గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!

రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలనే వలంటీర్‌ వ్యవస్థను తెచ్చిన వైయ‌స్ జ‌గ‌న్‌

అమ‌రావ‌తి: వలంటీర్‌ వ్యవస్థను ముట్టుకోమన్నారు. పైగా అధికారంలోకి వచ్చాక వాళ్లకు పది వేల రూపాయాలకు జీతం పెంచుతామన్నారు. అధికారం చేపట్టాక.. నెల తిరగక ముందే ఆ హామీని తుంగలో తొక్కేశారు. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను పూర్తిగా దూరం చేసేశారు. పైగా ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని పసుపుమయంగా మార్చేసుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుందనే చర్చ మొదలైంది. టీడీపీ అధికారిక కార్యక్రమంగా మారిందది. పెన్షన్ల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ.. ఫొటోలకు ఫోజులిస్తూ హల్‌ చల్‌ చేస్తున్నారు.

‘‘వలంటీర్‌ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావని బెదిరించారు. కానీ, ఒక్కరోజులోనే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఎన్నికల సమయంలో పెన్షన్ల కోసం ఎండలో తిప్పారు. ఫలితంగా 33 మంది చనిపోయారు’’ అని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత లబ్ధిదారుల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ టైంలో వలంటీర్ల ద్వారా ఫించన్లు పంపిణీ చేయనీయకుండా ఈసీకి ఫిర్యాదు చేసిందెవరో అందరికీ తెలుసు.

చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. సచివాలయ సిబ్బందిని పక్కకు నెట్టేసి.. టీడీపీ ఆధ్వర్యంలోనే పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ వ్యవహారమంతా గత జన్మభూమి కమిటీల తరహాలోనే నడుస్తోందన్న చర్చ మొదలైంది. గతంతో.. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలనే వలంటీర్‌ వ్యవస్థ ద్వారా వైయ‌స్ జగన్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేపట్టింది. ప్రతీకార రాజకీయాలు ఉండవని, వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి నేతలు.. ఇప్పుడు వైయ‌స్ జగన్‌ తెచ్చిన ఆ వ్యవస్థనే లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఏపీలో ముందు ముందు కూడా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతల  జోక్యం ఇలాగే కొనసాగుతుందా? అనేది చూడాలి.

Back to Top