పచ్చి విధ్వంసకారుడు చంద్రబాబు

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు అంబ‌టి, కాసు, గోపిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి ఆగ్ర‌హం

ఇది ప్రజాస్వామ్యమా?.. అరాచకమా?:  మాజీ మంత్రి అంబ‌టి

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే టీడీపీ ప్లాన్‌

ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల్లో తయారు చేసిన వార్తలను విస్తృతంగా ప్రచారం 

చంద్రబాబు తెచ్చిన జీవో ప్రకారమే పార్టీ ఆఫీసులు కడుతున్నాం

వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ పోరాటం చేస్తుంది:  కాసు మ‌హేష్‌రెడ్డి

ఎస్పీకి కాల్స్ చేసినా పట్టించుకోలేదు:  మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

తాడేపల్లి:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌చ్చి విధ్వంస‌కారుడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు అంబ‌టి రాంబాబు, కాసు మ‌హేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి మండిప‌డ్డారు.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. రామకృష్ణారెడ్డిని కోర్టుకు తీసుకెళ్తుంటే టీడీపీ నేత దాడి చేయడానికి ప్రయత్నించడమేంటి?. ఇటువంటి దాడులకు భయపడేది లేదని  పిన్నెల్లిని ఓడించాలని టీడీపీ కుట్రలు చేసిందన్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే టీడీపీ ప్లాన్‌.. అంటూ దుయ్యబట్టారు. ఫేక్‌ న్యూస్‌లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు.

పిన్నెల్లిపై ఎన్నికలకు ముందు నుంచే చంద్రబాబు కుట్ర-  అంబటి రాంబాబు, మాజీ మంత్రి

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సుదీర్ఘకాలం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలుపొందుతూ వచ్చారని అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా గెలిచిన ప్రజాదరణ కలిగిన నాయకుడన్నారు. ఎన్నికల ముందే చంద్రబాబు భారీ ప్లాన్ వేశారని, ఏ విధంగానైనా ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలని, ఎంతకైనా తెగించాలనే ఉద్దేశంతో రాజకీయాలకు దూరంగా ఉన్న బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టారన్నారు. ఎన్నికల్లో ఈవీఎంను పగులగొట్టిన వీడియో లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చిందన్నారు. అది పోలీసులు గానీ, ఎలక్షన్ కమిషన్ గానీ విడుదల చేయలేదన్నారు. ఇది పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చే కేసేనని.. కానీ పిన్నెల్లికి బెయిల్ రావడానికి వీల్లేదనే దురుద్దేశంతో 307 కేసులు రెండు పెట్టారన్నారు. ఈ ఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు పెట్టారన్నారు. ఇది ఫ్యాబ్రికేటెడ్ అని అర్థం అవుతోందన్నారు. ఏదో ఒక విధంగా కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఇలా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల తప్పుడు వార్తలు
రామకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ కు సొంత కారులో వెళ్లడంపైనా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలు రాశాయన్నారు. రాత్రి 12 గంటలకు రామకృష్ణారెడ్డి గారిని కోర్టులో హాజరుపర్చడానికి వెళ్తే కొమ్మెర శివ అనే వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లాడంటున్నారని, ఇదో కక్ష సాధింపు చర్య అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఫాల్స్ కేసులు తమపై పెడతారని ముందే తెలుసన్నారు. కానీ మరింతగా రాటుదేలుతామని, అందులో సందేహం లేదన్నారు. ఇలాఫాల్స్ న్యూస్ రాసి వ్యక్తిత్వ హననానికి దారి తీసేలా ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదని చెప్పారు. అంతకు ముందు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి భార్యపై దాడి చేశారన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి అనేక వార్తలు వస్తున్నాయని, జగన్ మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని రాసి పారేశారన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత కారులో వెళ్లి సరెండ్ అయితే, బాత్రూమ్ లో దాక్కున్నారని ఓ టీవీలో రాశారన్నారు. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని కోరారు. 

ముగ్గురు కలిస్తే 60 శాతం, మా ఒక్కరికే 40 శాతం
12 ఏళ్ల కిందట ప్రారంభమైన రాజకీయ పార్టీగా, తొలిసారి 67 సీట్లు గెలుచుకున్నామని, ఆ తర్వాత 151 సీట్లు గెలుచుకున్నామని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైనప్పటికీ 40 శాతం ఓటు షేర్ ఉన్న రాజకీయ పార్టీ తమదన్నారు. అక్కడ ముగ్గురుకలిస్తే 60 శాతం వచ్చాయన్నారు. మేం ఒక్కళ్లమే 40 శాతం ఉన్నామన్నారు. చాలా బలమైన రాజకీయ పార్టీగా ఏర్పడినది జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలన్నారు. 

ధర్మంగా, న్యాయంగా పార్టీ ఆఫీసుల నిర్మాణం
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా చట్టబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా ప్రభుత్వం తమకు స్థలాలు కేటాయించిందన్నారు. ఇదేమీ కొత్త కాదన్నారు. ఇది చంద్రబాబు పెట్టిన సంప్రదాయం, చంద్రబాబు ఇచ్చిన జీవో అన్నారు. ఆ జీవోల ప్రకారమే తెలుగుదేశం పార్టీ ఆఫీసులన్నీ ఇలా కేటాయించుకుని కట్టుకున్నవేనని, వాటిని మేం అధికారంలోకి వచ్చాక వాటిని పడగొట్టడానికి ప్రయత్నించలేదని గుర్తు చేశారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజా వేదికను కూల్చేశారని మాట్లాడిన నోళ్లు తాడేపల్లిలో మా పార్టీ కార్యాలయాన్ని కూల్చేసినప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. అది ప్రభుత్వానిదని, ప్రభుత్వ ఆస్తిని జగన్ మోహన్ రెడ్డి గారు తొలగించారన్నారు. కానీ మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ ఆఫీసును పగలగొడితే అది విధ్వంసం కాదా? పచ్చి విధ్వంసకారుడు నారా చంద్రబాబు నాయుడు అని అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చనిపోలేదని ఒకడు అంటాడని, మీ ఉద్దేశం మమ్మల్ని చంపేయాలనా? మా పార్టీ ఆఫీసులు పడగొట్టేయాలనా? అని అంబటి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ ఆఫీసులు కొన్ని చోట్ల కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయన్నారు. విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైయస్సార్ జిల్లా.. ఇలా అన్నీచోట్లా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. నిర్మాణాలు అక్రమం అని అనుమానాలుంటే అక్కడికి సంబంధిత అధికారి వెళ్లి నోటీసు అంటించాలన్నారు. తెలుగుదేశం మంత్రులకు ఏం పని? ఎమ్మెల్యేలకు ఏం పని? అని ప్రశ్నించారు. మా పార్టీ ప్రాంగణాల్లో ప్రెస్ మీట్లు పెట్టి కూలుస్తామని చెబుతున్నారని, ఏమిటీ అరాచకం అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? అరాచక పాలనా? అని నిలదీశారు. వీటిపై హైకోర్టుకు విన్నవించామని, హైకోర్టు వారు వింటున్నారన్నారు. చట్టపరంగా కోర్టులో తేల్చుకుంటామని, చట్టబద్ధంగా అవన్నీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ అని స్పష్టంచేశారు. మీకు అధికారం వచ్చిందని, మంచి సంప్రదాయాలు పాటిస్తే మళ్లీ వచ్చే ప్రభుత్వాలు వాటినే పాటిస్తాయని అంబటి రాంబాబు అన్నారు. కానీ మీరు క్రియేట్ చేసిన సంప్రదాయాలు మీకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే దశకు చేరుకోవద్దని అంబటి హితవు పలికారు.

కాసు మహేష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గురజాల

టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పల్నాడులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలాగైనా అరెస్ట్‌ చేయాలని, అందుకే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నట్లు ప్రవర్తిస్తున్నారని కాసు మహేష్‌ మండిపడ్డారు. పిన్నెల్లి లాంటి ఒక సీనియర్‌ లీడర్‌ పోలీస్‌ కస్టడీలో ఉంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని, కానీ ఆయన అరెస్ట్‌ సమయంలో కూడా టీడీపీ నేతలు ఆయనపై దాడి చేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు. గతంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చూడలేదని, పైగా టీడీపీ నేతలు హేళన చేయడం, దాడికి ప్రయత్నించడం చేయడమే కాక మళ్ళీ రామకృష్ణారెడ్డే గుద్దారని రాతలు రాయించడం ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు...ఈవీఎం కేసు అని పోలింగ్‌ తర్వాత ఊదరగొట్టి ప్రచారం చేశారో ఆ కేసులో కోర్టు నిన్న రాత్రి బెయిల్‌ ఇచ్చిందన్నారు, కానీ ఆయనపై పెట్టిన అక్రమ కేసుల ద్వారా ఆయన్ను జైల్లో పెట్టారని మండిపడ్డారు. కారంపూడిలో సీఐపై ఒత్తిడి తెచ్చి పెట్టిన కేసు, పాల్వాయి గేట్‌లో టీడీపీ నాయకుడు పెట్టిన కేసుల్లోనే పిన్నెల్లిని జైల్లో పెట్టారని, దీనిపై చట్టపరంగా పోరాటం చేస్తామని మహేష్‌ తెలిపారు. తప్పకుండా మా నాయకుడు బయటికి వస్తారు, అందరం కలిసి జగన్‌ గారి నాయకత్వంలో పల్నాడు ప్రాంతంలో చేసిన అభివృద్దిని నిరూపించుకుంటామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం అని పార్టీని తిరిగి నిలబెట్టుకుంటామని కాసు మహేష్‌ ధీమా వ్యక్తం చేశారు. 

గడిచిన వారం రోజులుగా వైయ‌స్ఆర్‌సీపీ ఆఫీసుల విషయంలో టీడీపీ నేతలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న రాద్దాంతంపై ఆయన మండిపడ్డారు. గతంలో టీడీపీ వారు ఇచ్చిన జీవోల ఆధారంగానే వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాలు నిర్మించుకున్నామని, కొన్ని కార్యాలయాల్లో టీడీపీ నేతలు వచ్చి ప్రెస్‌మీట్లు పెడుతున్నారు, ఇది ఎంతవరకు సమంజసంమని ఆయన నిలదీశారు. ఈ రోజు మాకు జరిగింది, రేపు మీకు జరగచ్చు. మేం చట్టపరంగా చేశామా లేదా అన్నది చెక్‌ చేసుకోండి, రూల్‌ ప్రకారమే పార్టీ కార్యాలయాలు నిర్మించాం, మేం సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఎదురుదాడి రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు. మా పార్టీ కార్యాలయాలకు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి ప్రెస్‌ మీట్లు పెట్టడం, మా ఆఫీసులు ఆక్రమించుకుంటామని ప్రకటనలు చేయడం వంటి పరిణామాలు ఎటు దారి తీస్తాయో టీడీపీ నేతలకే వదిలేస్తున్నామని కాసు మహేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నరసరావుపేట

మాచర్లలో పిన్నెల్లిని ఎలాగైనా ఓడించాలని టీడీపీ సృష్టించిన వివాదాలు, అల్లర్లు అందరూ గమనించాలని గోపిరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ పొత్తు తర్వాత పురందేశ్వరి గారు చెప్పినట్లు ఎస్‌పీలను మార్చారన్నారు. కొత్తగా వచ్చిన ఎస్‌పీ పల్నాడు జిల్లా మొత్తం వదిలేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మాచర్లకే పరిమితమయ్యారని ఆయన గుర్తుచేశారు. మేం ఎవరు ఫోన్‌ చేసినా  ఎస్‌పీ స్పందించలేదని, పిన్నెల్లి గారి సొంతగ్రామం కండ్లగుంటలో ఏకంగా ఒక డీఎస్పీని కేటాయించి ఓటర్‌ స్లిప్పులు కూడా ఆయనతో ఇప్పించారని గోపిరెడ్డి అన్నారు. టార్గెట్‌ చేసి ఎలక్షన్‌ పూర్తిచేశారన్నారు. ఈవీఎంను పిన్నెల్లిగారు పగలగొట్టారనే వీడియో బయటికి ఎక్కడి నుంచి వచ్చింది, లోకేష్‌ ట్విట్టర్‌ నుంచి వచ్చింది కాదా అని నిలదీశారు, రాష్ట్రంలో 13 చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎక్కడా వీడియో బయటికి రాలేదు, కేవలం రామకృష్ణారెడ్డి వీడియో మాత్రమే రిలీజ్‌ చేశారని ఇది కుట్ర కాదా అని నిలదీశారు, టీడీపీ వారు వైఎస్‌ఆర్‌సీపీ వారిని బెదిరించి బయటికి పంపి ఎన్నిక ఏకపక్షంగా చేసుకుంటున్నారని పిన్నెల్లిగారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఈ పరిణామం జరిగిందన్నారు, ఆ తర్వాత ఆయన భార్య, కుమారుడిపై కూడా దాడి చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సిట్‌ వేసి అన్ని కేసులు 307 సెక్షన్‌ కింద పెట్టారని, పోలీసులు వారికి ఇష్టమొచ్చినట్లు కేసులు నమోదు చేసి అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడులో ఇది కొత్తకాదు, మేం కచ్చితంగా ఎదుర్కొంటాం, మేమంతా కలిసి పనిచేసి పల్నాడు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని తిరిగి బలోపేతం చేస్తామని గోపిరెడ్డి స్పష్టం చేశారు.

Back to Top