బాబూ.. రేవంత్‌తో ఏం చర్చించావ్‌.. ఏం సాధించావ్‌?

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి
 

నెల్లూరు జిల్లా: చంద్రబాబు.. రేవంత్‌రెడ్డితో ఏం చర్చించారో రాష్ట ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.

కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమాధానం చెప్పాలి. వెంకటేశ్వరస్వామి ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజామా కాదా?. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు రూపంలో ఏపీకి పాపం తగిలింది. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చారు. ఏపీకి చెందిన ఆస్తులు వదిలేసి ఎందుకు పారిపోయి వచ్చారు.’’ అంటూ కాకాణి నిలదీశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ ఆరంభ శూరత్వాలే. ఆయన అనుకూలం మీడియా ఆహా.. ఓహో అనడం తప్ప సాధించిన ఫలితాలు లేవు. తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశంపై ఎంతో హైప్ క్రియేట్ చేశారు. ఈ భేటీలో ఏ అంశాలపై స్పందించారో.. వేటికి పరిష్కారం లభించిందనే విషయాన్ని వెల్లడించలేదు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కోసం ఒక ఆర్కిటెక్ మాదిరిగా చంద్రబాబును రేవంత్‌రెడ్డి పిలిచినట్టుంది’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు.

ఈ సమావేశానికి ఒక దశ.. దిశా లేదు.. పరా డబ్బా.. పరస్పర డబ్బా తప్ప సాధించింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా వీరి చర్యలు ఉన్నాయి. పోలవరానికి సంబంధించి ఐదు గ్రామాలు ఇవ్వాలని తెలంగాణ కోరినట్లు.. దానిపై చంద్రబాబు ఏమి మాట్లాడారనే విషయాన్ని వెల్లడించలేదు. తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు పోలవరం గురించి ఆలోచించలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆ గ్రామాలపై నిర్ణయం తీసుకుంటే భారీ తప్పిదమే అవుతుంది.’’ అని గోవర్థన్‌రెడ్డి హెచ్చరించారు.

ముంపు మండలాల్లోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. టీటీడీలో కూడా వాటా అడిగినట్లుగా సమాచారం వచ్చింది.. దీనిని మంత్రులు ఎవరూ ఖండించలేదు. ఓటుకు నోటు కేసులో.. చిక్కుకున్న చంద్రబాబు హడావుడిగా..  అక్కడ నుంచి వచ్చేశారు.. దీనివల్ల లక్షన్నర కోట్ల మేర ఆంధ్ర రాష్ట్రానికి నష్టం కలిగింది. 9,10 షెడ్యూల్ కింద రావాల్సిన ఆస్తులు  ఎన్నో ఉన్నాయి.. వీటిపై చంద్రబాబు స్పందించ లేదు’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి దుయ్యబట్టారు.

 

Back to Top