గుంటూరు : పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల కోసం తాను గ్రీన్ బుక్ రాస్తానని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి పదవీ స్వీకార సభ జరిగింది. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు అధ్యక్షత వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా అంబటి, మోదుగుల మాట్లాడారు. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటానని అంబటి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తోందని, తాము గెలిస్తే బ్లడ్ బుక్ రాస్తామని గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి హెచ్చరించారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగిస్తూ... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా కార్యకర్త మాదిరిగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు ప్రసంగించారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైయస్ఆర్‌సీపీ కేడర్‌కు మనోధైర్యాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్లే సత్తా అంబటికి, మోదుగులకు ఉందన్నారు. పార్టీకి దూరమైన వారిని కూడా దగ్గర చేసే దిశగా ప్రతి ఒక్కరూ సాగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఓడిన వారం రోజుల్లోనే ప్రజా సమస్యలపై రోడ్డెక్కిన ఘనత వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకే చెందుతుందన్నారు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా తోడుగా నడిచేందుకు పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలకు సముచిత స్థానం కల్పించి పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకున్న నిర్ణయం సంతోషకరం అన్నారు. నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ పాలన పక్కన పెట్టి కేవలం వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ ఓడిపోలేదని, మోసపోయిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఈ విషయం గ్రహించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ రెండింటిని నిర్వీర్యం చేస్తోందన్నారు. వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయడం తగదన్నారు. పార్టీ నేత పూనూరి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ వంద రోజుల పాలనలో 60 మందిని పొట్టనబెట్టుకున్న చంద్రబాబుపై 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గ్రంథాలయాల మాజీ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు నెలల కాలంలోనే ప్రజలంతా విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వమని మండిపడ్డారు. దాదాపు 40 శాతం ఓట్లు ఉన్న జగనన్నకు ప్రజల్లో ఎక్కడా ఆదరణ తగ్గడం లేదని చెప్పారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పాలన ఈ దేశంలో ఎవరూ అందించలేదన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పార్టీని ఒక తాటిపై తీసుకు వచ్చి విజయానికి కృషి చేద్దామన్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. వైఎస్ జగన్ ప్రతి జిల్లా నాయకులతో రివ్యూ మీటింగ్‌లు పెట్టి పార్టీని బలోపేతం చేస్తున్నారని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో పార్టీని ఈ సారి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ జగన్‌ను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. మచిలీపట్నం పోర్ట్ మాజీ డైరెక్టర్ మేకతోటి దయాసాగర్ మాట్లాడుతూ పార్టీని తిరిగి నిర్మించుకునేందుకు జిల్లా నాయకత్వంతో కలిసి ముందుకు సాగుదామన్నారు. పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి దొంతిరెడ్డి, వేమారెడ్డి మాట్లాడుతూ ఈ సభ చూస్తుంటే యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని సంకేతం ఇచ్చినట్లు ఉందన్నారు. పార్టీ నేత గంజి చిరంజీవి మాట్లాడుతూ నాలుగున్నరేళ్లు ప్రజల సమస్యలపైనే పోరాటం సాగించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, పలు అనుబంధ విభాగాల నేతలు మండేపూడి పురుషోత్తం, సీడీ భగవాన్, పక్కాల సూరిబాబు, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, మామిడి రాము, కొత్త చిన్నపరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే వారికి తగిన ప్రాధాన్యం పదవీ స్వీకార సభలో వైయస్ఆర్‌సీపీజిల్లా అధ్యక్షుడు అంబటి మా వారిపై దాడి చేసే ప్రత్యర్థుల కోసం బ్లడ్ బుక్ రాస్తాం గుంటూరు, నరసరావు పేట పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడు మోదుగుల హెచ్చరిక మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే పొరపాటే : వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే పొరపాటే. ఇకపై ఎవరికి వారే రెడ్ బుక్ రాసుకోండి. నాలుగు నెలల పాలన చూస్తేనే పూర్తిగా టీడీపీ వైఫల్యం అర్థమవుతోంది. ప్రతిపక్షం లేకుండా ఎలిమినేట్ చేయాలనే దురుద్దేశంతో రాక్షస మూకలు హింసా కాండలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోతున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వై.యస్.జగన్ ఒక్క కనుసైగ చేసి ఉంటే అసలు ఇవాళ టీడీపీ ఉండేది కాదు. పవిత్రమైన తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీని బీజేపీలో కలిపేసినట్లు వ్యవహరిస్తున్నారు. కార్యకర్తల కోసం ఏర్పాటైన సభలా ఉంది: మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు, నరసరావుపేట, పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడు మేం అధికారంలోకి రాగానే బ్లడ్ బుక్ రాస్తాం. ఈ సభ కార్యకర్తల కేర్ సభలా ఉంది. మళ్లీ అధికారంలోకి రాగానే ప్రతి పథకం కేడర్ చేతుల మీదుగానే అమలయ్యేలా వై.యస్.జగన్ దృష్టికి తీసుకెళ్తా. దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపారు. వై.యస్.జగన్ వారికి సంక్షేమాన్ని అందజేశారు. నేను రెండు త్రిపుల్ ఆర్ సినిమాలు చూశా. ఒకటి ఎన్టీఆర్ నటించింది కాగా... రెండో సినిమాలో రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు నటించిన చిత్రం చంద్రబాబు డైరెక్షన్‌లో చూశా. మా వాళ్లపై దాడి చేస్తే బ్లడ్ బుక్‌లో రాయడం ఖాయం. అధికారులు వ్యవహరిస్తున్న తీరును అనుక్షణం గమనిస్తాం. నిత్యం అందుబాటులో ఉంటా: వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఈ సభ ద్వారానే తాను గ్రీన్‌బుక్ ఓపెన్ చేస్తున్నా. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త పేరు ఆ బుక్‌లో రాస్తా. అధికారంలోకి వచ్చిన తరువాత వారి పేరును వై.ఎస్.జగన్ దృష్టికి స్వయంగా తీసుకెళతా. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపి ముందుకు సాగే దిశగా అన్ని వేళలా అందుబాటులో ఉంటా. గుంటూరు జిల్లాలో ఎంపీ, ఏడు ఎమ్మెల్యే స్థానాలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్తను కలుపుకొంటూ ముందుకు సాగుతాం. ఓటమి, నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి విజయ బావుటా ఎగుర వేసేందుకు అడుగులు వేయాలి. మహానేత వైయస్ఆర్, జననేత వైయస్ జగన్ తో త్రికరణశుద్ధిగా వెంటనడిచా.