చంద్రబాబు తప్పిదం వల్లనే విజయవాడ విపత్తు

ఇది కచ్చితంగా మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్‌

మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టీకరణ

వరద బాధితుల కంటే పబ్లిసిటీనే ముఖ్యమా?

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ మర్చిపోయిన సీఎం

మీడియా మేనేజిమెంట్‌పైనే చంద్రబాబు దృష్టి

విపత్కర పరిస్ధితుల్లో చేతులెత్తేసిన ప్రభుత్వం

ప్రజలకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలం

మాజీ మంత్రి కన్నబాబు ఫైర్‌

వరదల కంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ నష్టం

8 రోజులైనా ఏ మాత్రం తగ్గని వరద కష్టాలు

విజయవాడ వరద విపత్తుపై భిన్న ప్రకటనలు

వరదపై అలెర్ట్‌ వచ్చినా స్పందన శూన్యం

ప్రజలను పూర్తిగా గాలికొదిలేసిన వైనం 

రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయ లోపం

అదే విజయవాడ వరద బాధితులకు శాపం

నిత్యావసర సరుకుల పంపిణీలో విఫలం

సహాయక చర్యల్లో ప్రభుత్వ తీరుపై ప్రెస్‌మీట్‌లో కన్నబాబు ధ్వజం

తాడేపల్లి: సీఎం చంద్రబాబు తప్పిదం వల్లనే విజయవాడ విపత్తు సంభవించిందని, ఇది కచ్చితంగా మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్‌ అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. బుడమేరు రెగ్యులేటర్‌ డీఈ, స్పెషల్‌ సీఎస్‌ (రెవెన్యూ) ఆర్‌పీ సిసోడియా, జిల్లా కలెక్టర్‌.. ఈ ముగ్గురు అధికారుల స్టేట్‌మెంట్స్‌ అదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయని ఆయన వెల్లడించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

    విపత్కర పరిస్ధితుల్లో అప్రమత్తంగా ఉండి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. గడిచిన కొన్ని రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల బాధలను చూస్తుంటేం ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
    విజయవాడతో సహా దాదాపు 20 జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టం జరిగినా బాధితును ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కన్నబాబు అన్నారు. భారీ వర్షాల కంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగాని తనమే విజయవాడను ముంచేసిందని విరుచుకు పడ్డారు. వరదల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవడం సహజమన్న ఆయన, ప్రభుత్వం సక్రమంగా పని చేయక పోవడంతోనే విజయవాడ ముంపునకు గురైందని తేల్చి చెప్పారు. 8 రోజుల గడుస్తున్నా, వరద బాధితుల కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదని గుర్తు చేశారు.
    విపత్తులు సంభవించే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత ఉన్నా, ప్రభుత్వం ఆ పని చేయలేదని మాజీ మంత్రి ఆక్షేపించారు. సహాయ శిబిరాలు ఎక్కడెక్కడ, ఎన్ని ఏర్పాటు చేశారనేది ఈరోజుకీ ప్రకటించకపోవడం దారుణమన్నారు. 
    ఎన్నికల్లో బాబు గ్యారంటీ అన్న నినాదం ఇచ్చిన చంద్రబాబు, వరద ప్రాంతాల ప్రజలకు ఆదుకుంటానని భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. వరద బాధితుల కంటే పబ్లిసిటీనే ముఖ్యమా? అని గట్టిగా నిలదీశారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ మర్చిన ముఖ్యమంత్రి, మీడియా మేనేజ్‌మెంట్‌పైనే దృష్టి పెట్టారని దుయ్యబట్టారు.
    గతంలో తమ ప్రభుత్వ హయాంలో భారీ వర్షాలు, వరదలు వచ్చినా ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని కన్నబాబు గుర్తు చేశారు. ఇప్పుడు వరదల వల్ల 45 మంది చనిపోయినా, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని దుయ్యబట్టారు. టెక్నాలజీలో దేశానికే అగ్రగణ్యులమని చెప్పుకుంటున్న మీకు, ఇంత మంది ప్రాణాలు కోల్పోయినా సిగ్గనిపించడం లేదా? అని సీఎంను నిలదీశారు. 
    వెలగలేరు రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తడానికి 20 గంటల ముందే రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చామని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతుంటే, అసలు వరదపై తమకు సమాచారమే లేదని జిల్లా కలెక్టర్‌ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని మాజీ మంత్రి అన్నారు. 
మరోవైపు స్పెషల్‌ సీఎస్‌ (రెవెన్యూ) ఆర్‌పీ సిసోడియా.. వరదపై అలెర్ట్‌ వచ్చినా రెండు లక్షల మందిని తరలించడం సాధ్యం కాదని చెప్పడం ద్వారా.. తెలిసే ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిన విషయం స్పష్టమైందన్నారు. 
    ముగ్గురు అధికారుల ప్రకటనలు చూస్తుంటే, ఇది కచ్చితంగా చంద్రబాబు తప్పిదమే అన్న కన్నబాబు.. అందుకే విజయవాడ విపత్తు మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్‌ అని మరోసారి స్పష్టం చేశారు.
    ఆగష్టు 28న అలెర్ట్‌ వచ్చినా.. ముఖ్యమంత్రి స్ధాయిలో కనీసం ఒక సమీక్ష కూడా ఎందుకు నిర్వహించలేకపోయారని మాజీ మంత్రి  ప్రశ్నించారు. అదే రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై కనీస చర్చ కూడా ఎందుకు జరగలేదన్నారు. ముంబై సినీ నటి విషయంలో సీఎంఓ ఆరా తీసిందన్న వార్తలు పత్రికల్లో చూశామన్న ఆయన.. అదే సీఎంఓ వర్షాలు, వరదల గురించి ఎందుకు ఆరా తీయలేదన్నారు. అంటే భారీ వర్షాలు, వరద ముంపును ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకుందన్న విషయం స్పష్టమవుతోందన్నారు.
    ముఖ్యమంత్రి నివాసానికి, సచివాలయానికి సమీపంలోనే మొగల్రాజపురంలో కొండ చరియలు విరిగిపడి ఆరుగురు చనిపోతే.. ప్రభుత్వం అత్యంత దారుణంగా స్పందించిందని ఆక్షేపించారు. కనీసం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కూడా సంఘటన స్ధలానికి వెళ్లకపోవడం శోచనీయమన్నారు. 
    ఇంత భారీ వరద వస్తున్నా, కృష్ణానదిపై పైన ఉన్న మూడు భారీ ప్రాజెక్టుల్లో ప్లడ్‌ కుషన్‌ చర్యలు చేపడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. జరిగిన దారుణం చూస్తుంటే నీటి పారుదల, రెవెన్యూశాఖల మధ్య çస్పష్టంగా సమన్వయ లోపం కనిపిస్తోందన్నారు. 
    ఈరోజు బుడమేరు ఆధునికీకరణ గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు.. 2014–19 మ«ధ్య ఆ పనులు ఎందుకు చేపట్టలేదని? వారిని ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు జగన్‌గారిని నిందించి, తమ తప్పిదాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తేల్చి చెప్పారు.
    ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. చేపట్టిన సహాయక చర్యలు చూస్తే.. ఎన్టీఆర్‌ జిల్లాలో 2,37,502 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని గుర్తిస్తే, కేవలం 55,452 కుటుంబాలకు మాత్రమే సరుకులు అందాయని తెలిపారు. 8 రోజుల తర్వాత కూడా పూర్తిస్ధాయిలో కనీసం నిత్యావసర సరుకులు కూడా ఇవ్వలేని స్ధితిలో ఉన్న ప్రభుత్వం, ఇప్పటికైనా తన పనితీరు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్ధత అంటూ క‌న్న‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ప్రభుత్వ లెక్కలు ప్రకారం 226 బోట్లు పాక్షికంగా, 377 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్న కన్నబాబు, వాటన్నింటినీ తమ పార్టీనే ముంచేసిందని చెబుతారా అని ప్రశ్నించారు. వరదకు కొట్టుకొచ్చిన బోట్లలో పర్యాటక శాఖ బోట్లు కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. నిత్యం బురద జల్లే రాజకీయం చేయడం తప్ప ప్రజలకు చేసిన మంచి ఏం లేదని నిలదీశారు. 
    2018లో వరదకు ప్రకాశం బ్యారేజీ దగ్గర బోటు నిల్చిపోతే ఆ రోజు అధికార పార్టీ కుట్ర అని ట్వీట్‌ చేసిన లోకేష్‌.. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నాం కాబట్టి విపక్షం మీద ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. లక్షల క్యూసెక్కులు వరద వస్తుంటే నాలుగు బోట్లు అడ్డుపెట్టి నీళ్లు మళ్లిస్తారనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
    వరదలు వచ్చినప్పటి నుంచి కలెక్టరేట్‌ వద్ద బస్సులో పడుకుంటున్న చంద్రబాబు 8 రోజుల్లో ఒక్కసారి కూడా సెక్రటేరియట్‌ వెళ్లి ఎందుకు సమీక్ష నిర్వహించలేదని కన్నబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5.04 లక్షల ఎకరాల్లో పంటలతో పాటు రోడ్లు, చెరువులు దెబ్బ తినగా, దానిపై ఎందుకు సమీక్షించలేదని నిలదీశారు. అలాగే కరకట్ట మీద రాకపోకలు ఎందుకు నిలిపివేశారో కూడా బదులివ్వాలని ప్రశ్నించారు. 
    ఇప్పటికైనా ప్రభుత్వం బాధితులకు చేపట్టాల్సిన సహాయ చర్యల్లో వేగం పెంచి ఆదుకోవాలని మాజీ మంత్రి కన్నబాబు డిమాండ్‌ చేశారు. విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరద నష్టాలు ఉన్నాయని అక్కడ సహాయ చర్యలపైనా దృష్టి పెట్టాలన్నారు.  దీంతోపాటు మరోసారి భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలోం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Back to Top