రాజమహేంద్రవరం: పేదల ద్వేషి చంద్రబాబునాయుడు అని, ప్రజలను మోసం చేయడమే ఆయన పని అని అయినా.. పవన్‌కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని వైయస్ఆర్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు గుప్పించిన చంద్రబాబుకు, కూటమి పార్టీలు, ఎల్లో మీడియా వంత పాడాయని, ఆ తర్వాత బాబు ఆ హామీలు అమలు చేయకపోయినా, ఎవరూ నోరెత్తడం లేదని గుర్తు చేశారు. ఇకనైనా వారు ప్రశ్నించాలని కోరారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కావని వైయస్ జగన్‌గారు స్పష్టంగా చెప్పారని, ఇప్పుడు ఏడు నెలల తర్వాత స్వయంగా చంద్రబాబు నోట అదే మాట వచ్చిందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. తప్పుడు హమీలతో ప్రజలను వంచించి అధికారంలోకి రావడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు కారణంగా రాజకీయ నాయకులపై ప్రజల్లో నమ్మకం పోతోందని ఆక్షేపించారు. రాజమహేంద్రవరంలో వైయస్ఆర్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. వంచన చంద్రబాబు నైజం: ఎన్నికలప్పుడు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక హమీలు అమలు చేయలేకపోతున్నానని దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని, చేయకూడని ప్రకటన చంద్రబాబు చేశాడు. చంద్రబాబు మాటలు విన్న తర్వాత గతంలో చంద్రబాబు గురించి కొణిజేటి రోశయ్య అన్నమాటలు గుర్తొస్తున్నాయి. ఎన్నికలప్పుడు కోటి వరాలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక నాకేమీ అర్థం కావడం లేదు. హామీలు అమలు చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని చేతులెత్తేశాడని ఆనాడే రోశయ్య చెప్పారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అవే మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు సార్లూ హమీలు అమలు చేయకుండా ప్రజలను వంచించిన నీచ చరిత్ర చంద్రబాబుది. రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడని చంద్రబాబు: తన ఎదుగుదలకే చంద్రబాబు విజనరీ తప్ప.. రాష్ట్రానికి ఆయన విజన్ ఏనాడూ ఉపయోగపడలేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పదవీ కాంక్షతో 2014లో రాష్ట్ర విభజన కోసం డిమాండ్ చేసిన చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రం చిన్న మాట కూడా మాట్లాడలేదు. 2014 ఎన్నికల సందర్భంగా అనుభవం ఉందని డప్పేసుకుని, అలవికాని హామీలు గుప్పించాడు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల్ని దారుణంగా వంచించాడు. రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశాడు. చివరకు డ్వాక్రా మహిళలను కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. వారి రుణమాఫీ చేస్తానని చెప్పి, వారినీ మోసం చేశారు. ఇంకా అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులను, ఇంటికో ఉద్యోగం, అప్పటి వరకు ప్రతి నెలా నిరుద్యోగభృతి ఇస్తానని చెప్పి, ఆ మాట కూడా నిలబెట్టుకోకుండా వారినీ మోసం చేశారు. వైయస్ జగన్ సాకు చూపలేదు: చంద్రబాబు చెప్పే సూపర్ సిక్స్ హామీలు అమలు కావాలంటే రూ.1.5 లక్షల కోట్లు కావాలని, మోసం చేయడానికే అమలు సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నాడని.. ఆనాడే జగన్‌గారు చెప్పారు. కానీ చంద్రబాబు తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు తరుచూ జగన్‌గారిపై నిందలు మోపి బాధ్యతల నుంచి పారిపోతున్నారు. విజనరీనని చెప్పుకునే నాయకుడు నడుచుకునేది ఇలాగేనా?. వైయస్ జగన్ సీఎంగా ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి గురించి చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. రాష్ట్రం శ్రీలంక అయిపోందని అప్పులపై తప్పుడు ప్రకటనలు చేశాడు. 2019లో మా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో రూ.100 కోట్లే ఉన్నాయని నాటి ఆర్థిక మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు అన్న మాటలు గుర్తు చేస్తున్నా. అయినా ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించారు. చంద్రబాబులా ఏనాడూ నిందిస్తూ కూర్చోలేదు. కరోనా ఉందని సాకులు చూపించలేదు. తప్పుడు హమీలతో ప్రజలను వంచించి అధికారంలోకి రావడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు కారణంగా రాజకీయ నాయకులపై ప్రజల్లో నమ్మకం పోతోంది. సంపద సృష్టి అంటే బాదుడే బాదుడు: విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వలంటీర్ వ్యవస్థను తీసేసి 2.60 లక్షల మందిని ఉద్యోగాల్లోంచి తీసేశారు. రేషనలైజేషన్ పేరుతో సచివాలయ ఉద్యోగులను తగ్గించేస్తున్నారు. మొదటి సంతకం పెట్టిన డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ హామీ 8 నెలలైనా అమలుకు నోచుకోలేదు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు.. వివిధ ట్యాక్సుల రూపంలో అదనపు భారం మోపుతూ వేధిస్తున్నాడు. ఇప్పటికే రూ.19 వేల కోట్ల కరెంట్ బిల్లుల భారం మోపాడు. విలేజ్ రోడ్లకు టోల్ ట్యాక్సులు అంటున్నాడు. ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువ పెంచుతున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, రోడ్లు, ఆఖరుకి ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటుపరం చేస్తున్నాడు. ఇదేనా ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన పాలన. ఇలా చేస్తాడని చెప్పుంటే కూటమి అధికారంలోకి వచ్చేదా? కూటమి పాలనలో బాగు పడింది వారే!: కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం, అమరావతిని అడ్డం పెట్టుకుని కమీషన్లతో చంద్రబాబు, హెరిటేజ్ ఆస్తులు పెంచుకుని ఆయన కుటుంబం లాభపడ్డారు. నారా లోకేశ్, పవన్‌కళ్యాణ్ పదవులు పొందారు. టీవీ–5 బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి దక్కింది. మార్గదర్శి కేసులకు సంబంధించి ఈనాడుకి మేలు జరిగింది. కానీ చంద్రబాబు పాలనలో పేదవర్గాలన్నీ నష్టపోయాయి. నీతి ఆయోగ్ రిపోర్టుపై అబద్ధాలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా కుదేలైపోయిది. ఎన్నికల ప్రచారంలో ఏపీ అప్పులు రూ.14 లక్షల కోట్లని చెప్పిన చంద్రబాబు, బడ్జెట్ ప్రకటనలో మాత్రం రూ.4.6 లక్షల కోట్లేనని తేల్చేశారు. బిల్లులతో కలిపి రూ.9.5 లక్షల కోట్లని తాజాగా ప్రకటించాడు. ఇది మోసం చేయడం కాదా?. నీతి అయోగ్ నివేదిక ప్రకారమే చూసినా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 8 నెలల్లో రూ.73,635 కోట్లు అప్పు చేశారు. గత టీడీపీ పాలనలో వార్షిక మూల ధన వ్యయం కేవలం రూ.13,860 కోట్లు కాగా, గత వైయస్ జగన్‌గారి పాలనలో అది రూ.15,632 కోట్లు. అలాగే ప్రభుత్వ పన్నుల ఆదాయం చూస్తే.. 2018–19లో చంద్రబాబు హయాంలో రూ.58,107 కోట్లు కాగా, 2023–24లో వైయస్ జగన్ దిగిపోయే నాటికి అది రూ.92,978 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన నాయకుడిగా జగన్ నిలిచారు. సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయం టీడీపీ హయాంలో రూ.2,437 కోట్లుగా ఉంటే, వైయస్ జగన్ ప్రభుత్వం రూ.5,224 కోట్లు ఖర్చు చేసిందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ వివరించారు.