రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం

 వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి 

హైకోర్టు ఏర్పాటును అడ్డుకుని బెంచ్‌ని చేస్తాననటం సరికాదు

హెచ్.ఎన్.ఎస్.ఎస్ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసిన ఘనత వైయ‌స్ఆర్‌ది

గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని వైయ‌స్‌ జగన్ పెంచారు

పోర్టులు, మెడికల్ కాలేజీలను వైయ‌స్ జగన్ తెస్తే వాటిని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు

తాడేపల్లి: సీఎం చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అభివర్ణించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు ఏర్పాటును అడ్డుకుని బెంచ్‌ని చేస్తాననటం సరికాదన్నారు.

రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినా రాయలసీమ వాసులు కాదనలేదు. కనీసం హైకోర్టు వస్తుందని రాయలసీమ వాసులు భావించారు. ఇప్పుడు అదికూడా లేకుండా చేస్తున్నారు. శంకుస్థాపన జరిగిన లా యూనివర్సిటీని ఎందుకు తరలిస్తున్నారు?. మా కళ్లెదుటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేక పోతున్నాం. హెచ్.ఎన్.ఎస్.ఎస్ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసిన ఘనత వైయ‌స్ఆర్‌ది. ఆయన వలన అనంతపురం జిల్లా కరువులోకి పోకుండా ఆపగలిగారు. ఆ తర్వాత చంద్రబాబు ఆ ప్రాజెక్ట్‌ని నాశనం చేశారు. జిఎన్.ఎస్.ఎస్ ప్రాజెక్టు నీటిని చంద్రబాబు కుదించారు అంటూ శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని వైయ‌స్‌ జగన్ పెంచారు. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ను చంద్రబాబు పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడుని వైయ‌స్ఆర్ పూర్తి చేయటం వలన సాగునీరు అందుతోంది. శ్రీసిటీ, కొప్పర్తి ప్రాజెక్టులు వైయ‌స్ఆర్ , వైయ‌స్ జగన్‌ల వలనే సాధ్యమయ్యాయి. చంద్రబాబు ఏ ఒక్కపనీ చేయకపోగా వైయ‌స్ కుటుంబం చేసిన పనులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు దారుణం. వరద బాధితులకు పులిహోర పెట్టి రూ.550 కోట్లు కొట్టేశారు. అగ్గిపెట్టెల కోసం రూ.23 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించారు. వీటిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’’ అని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు.

మరి చంద్రబాబు, లోకేష్‌లు వైయ‌స్ జగన్‌ని కించపరిచేలా పోస్టులు పెడితే వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల పేరుతో టీడీపీ వారే దొంగ ఖాతాలను ఓపెన్ చేసి దారుణంగా పోస్టులు పెడుతున్నారు. చట్టం ఎవరికైనా ఒకటే అన్నట్టుగా ఉండాలి. అధికారంలో ఉన్న వారికి ఒకలాగ,  ప్రతిపక్షంలోని వారికి ఇంకోలా ఉండటం సరికాదు. ల్యాండ్ టైట్లింగ్ వలన భూసమస్యలు పరిష్కారమయ్యేవి. కానీ దానిపై విష ప్రచారం చేసి జనాన్ని భయపెట్టి ఎన్నికలలో పబ్బం గడుపుకున్నారు

ప్రజాజీవితంలో ఉన్నవారికి మంచితనం కూడా ఉండాలి. అబద్దాలే ప్రచారం చేసుకుని బతుకుతామంటే కుదరదు. పోలవరం ప్రాజెక్టులో 90 శాతం అనుమతులు వైయ‌స్ఆరే తెచ్చారు. కానీ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్టు చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కన్నా వైయ‌స్ జగన్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. చంద్రబాబు పాలనలో విధ్వంసం మాత్రమే జరిగింది. కానీ అభివృద్ధి మొత్తం తన హయాంలోనే అన్నట్టుగా బిల్డప్‌లు ఇస్తున్నారు. 

పోర్టులు, మెడికల్ కాలేజీలను వైయ‌స్ జగన్ తెస్తే వాటిని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇదేనా సంపద సృష్టించటం అంటే?. అదాని పరిశ్రమపై దాడి చేయటం దారుణం. వైయ‌స్ జగన్ హయాంలో పారిశ్రమలు పెట్టటానికి పారిశ్రామిక వేత్తలు వచ్చారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక వేత్తలు భయంతో‌ పారిపోతున్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తెస్తానని ఎప్పట్నుంచో చెప్తూనే ఉన్నారు. మాటలు కాదు పనుల్లో చేసి చూపించాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు.

Back to Top