వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం

ముందస్తు చర్యల్లోనూ కూటమి ప్రభుత్వం వైఫల్యం

నిర్వాసితులను ఆదుకోవడంలో చర్యలు శూన్యం

జనం లేని సమయంలో నష్టం అంచనా ఎలా?.

ప్రజలు నష్టపోయిన గృహోపకరణాల సంగతి ఏమిటి?.

ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన మల్లాది విష్ణు

తాడేపల్లి: వరద విపత్తుపై ప్రజలను అలర్ట్‌ చేయడంలోనూ, ముందస్తు చర్యల్లోనూ దారుణంగా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ తర్వాత వరద సహాయక చర్యల్లోనూ వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. నిర్వాసితులను ఆదుకోవడంలో చర్యలు శూన్యం అన్న ఆయన, అసలు జనం లేని సమయంలో నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని, వరదల్లో ప్రజలు నష్టపోయిన గృహోపకరణాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.

    విజయవాడను వరద ముంచెత్తి 8 రోజులు గడిచినా, ప్రభుత్వం ఇప్పటికీ అచేతనంగా ఉందన్న మాజీ ఎమ్మెల్యే, యుద్దప్రాతిపదికన పనులేవీ కనిపించడం లేదని, పైగా బుడమేరు వరదను గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వానికి అంటగట్టడం దారుణమన్నారు. ఆగష్టు 28న వాతావరణ శాఖ హెచ్చరించినా వీకెండ్స్‌లో సీఎం, మంత్రులు, అధికారులు బిజీగా ఉన్నారని, ఆనాడు జరిగిన క్యాబినెట్‌ భేటీలో ఈ విషయాన్ని కనీసం చర్చించలేదని చెప్పారు.
    వరద ముంచెత్తిన తర్వాత కూడా ప్రభుత్వం కళ్ళప్పగించి చూసిందన్న మల్లాది విష్ణు, లక్షలాది మంది సమస్యపై ఇలాగేనా స్పందించేదని నిలదీశారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు జగన్‌గారిపై విమర్శలకే పరిమితమయ్యారన్న ఆయన, రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌పీ సిసోడియానే సమస్యను తక్కువ చేసి మాట్లాడితే ఇంక మిగిలిన వారు ఏం చేస్తారని ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైయస్‌ జగన్, ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా చేశారో తెలుసుకోవాలని సూచించారు. 
    విజయవాడలో అనేక డివిజన్లలో ఇప్పటికీ పారిశుద్ధ్యం దారుణంగా ఉందన్న ఆయన, మెయిన్‌ రోడ్లమీదే హడావిడి చేస్తున్నారు తప్ప, లోపలి ప్రాంతాలకు వెళ్ళడం లేదన్నారు. ఇప్పటికైనా సహాయక చర్యల్లో వేగం పెంచాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 
    ‘రేపటి (సోమవారం) నుంచి ఎన్యూమరేషన్‌ అంటున్నారు. కానీ బాధితులు ఎవరూ ఇళ్ళ దగ్గర లేరు. వారు లేకుండా మీరు ఆ పని ఎలా  చేస్తారు?. ఎక్కడెక్కడికో తరలి పోయిన వరద బాధితులు ఇంకా తమ ఇళ్లకు తిరిగి రాలేదు. ఎందుకంటే వారక్కడ ఉండే పరిస్ధితి లేదు. అలాంటప్పుడు జరిగిన నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు?. అలాగే వారు కోల్పోయిన గృహోపకరణాల సంగతి ఏమిటి?. నిజానికి ఈ వరదల్లో నగరంలో కేవలం ప్రజలే కాదు.. వ్యాపారస్తులు కూడా కోట్లలో నష్టపోయారు. వారికి నష్టపరిహారం విషయంలో కేంద్రంతో ప్రత్యేకంగా చర్చించాలి’.. అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.
    చంద్రబాబు ‘పూర్‌ టూ రిచ్‌’ అన్న నినాదం ఇచ్చారు కానీ, ఇప్పుడు పరిస్ధితి చూస్తే ‘రిచ్‌ పీపుల్‌ కూడా పూర్‌ పీపుల్‌’ అయ్యారని మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈరోజు కృష్ణలంక వాసులు ప్రశాంతంగా ఉన్నారంటే, అందుకు వైయ‌స్ జగన్ నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ కారణమని గుర్తు చేశారు.
    వరదకు బోట్లు కొట్టుకొచ్చి, ప్రకాశం బ్యారేజీ గేట్లకు తగలడాన్ని కుట్రగా అభివర్ణిస్తూ, తమ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్న మల్లాది విష్ణు.. బోట్లతో బ్యారేజ్‌కు డ్యామేజ్‌ చేయాలని ఎవరూ కోరుకోరని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిందను ఆయన తీవ్రంగా తప్పు బట్టారు.
    వరదల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, విపత్తు సహాయక చర్యల్లో వేగం పెంచాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ నేతలు ఇకనైనా వరదను రాజకీయం చేయడం మానుకోవాలని, వరదల్లో నష్టపోయిన వారికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని మ‌ల్లాది విష్ణు కోరారు.

Back to Top