ఉర్సా క్లస్టర్స్‌కు భూకేటాయింపుల్లో భారీ అవినీతి

రెండు నెలల కిందట పుట్టిన కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూమి

భూకేటాయింపుల కోసం ప్రోసీజర్‌లను పరుగులు తీయించింది ఎవరూ?

కనీస పరిశీలన కూడా లేకుండా అప్రూవల్స్ ఎలా ఇచ్చారు

ప్రభుత్వం దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలి

మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ డిమాండ్

విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్

విశాఖపట్నం: విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను ఎటువంటి అర్హతలు లేని ఉర్సా క్లస్టర్స్‌కు కారుచౌకగా కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రెండు నెలల కిందట ఏర్పాటైన కంపెనీకి ఏకంగా రూ.3 వేల కోట్ల విలువైన భూములను ఎకరం 99 పైసలకు కట్టబెట్టే కుట్రలో చంద్రబాబు, లోకేష్‌లే సూత్రదారులని ఆరోపించారు. కనీస ప్రభుత్వ నిబంధనలను, ప్రొసీజర్‌లను కూడా పాటించకుండా భూకేటాయింపుల ఫైల్‌ను పరుగులు తీయించింది ఎవరో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఇంకా ఆయనేమన్నారంటే...

ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన రిజిస్టర్ అయ్యింది. ఈ సంస్థ పెయిడప్ క్యాపిటల్ కేవలం రూ.10 లక్షల మాత్రమే. ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు సతీష్ అబ్బూరి, కౌశిక్ పెందుర్తి ఈ సంస్థకు డైరెక్టర్‌లుగా ఉన్నారు. రెగ్యులేటరీ పర్మీషన్ల కోసం హైదరాబాద్‌ శేరిలింగంపల్లిలో ఒక అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ విశాఖలో రూ. 5728 కోట్లతో డేటా సెంటర్‌ను ప్రారంభిస్తామని ముందుకు వచ్చింది. గతంలో ఈ సంస్థకు ఇలాంటి ప్రాజెక్ట్‌లు చేసిన అనుభవం లేదు. వారికి కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రభుత్వ పరమైన అన్ని ఆమోదాలను ఇచ్చేసింది. కాపులుప్పాడులో రూ.3వేల కోట్ల విలువైన 56 ఎకరాల భూమిని ఎకర 99 పైసలకు కేటాయించింది.

ప్రభుత్వ ప్రొసీజర్లను అపహాస్యం చేశారు

ఏదైనా సంస్థకు భూ కేటాయింపులు చేసే సమయంలో కొన్ని ప్రొసీజర్‌లు ఉంటాయి. సదరు సంస్థ ఇలా తాము రాష్ట్రంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తామని ప్రతిపాదనలతో వస్తే, దానికి సంబంధించిన అన్ని అంశాలను, అర్హతలు, అనుభవం, సామర్థ్యం తదితర విషయాలను పరిశీలిస్తారు. ఆ తరువాత ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ తరువాత సీనియర్ ఐఎఎస్ అధికారులతో కూడిన ఎస్ఐపీసి చర్చిస్తుంది. సాధ్యాసాధ్యాలను సమీక్షించి ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఎస్‌ఐపీబీకి నివేదిస్తుంది. దీనిలో పలువురు మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారులు ఉంటారు. ఈ బోర్డ్‌లో కూడా సదరు సంస్థపై చర్చించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ రెండు నెలల కిందట స్థాపించిన ఉర్సా క్లస్టర్స్ సంస్థకు ఎస్‌ఐపీసీ, ఎస్‌ఐపీబీలు వెంటనే ఆమోదం తెలపడం, తరువాత కేబినెట్‌కు పంపడం, అక్కడ కూడా ఆమోదం పొందడం కూడా చకచకా  జరిగిపోయింది. ప్రభుత్వ ప్రోసీజర్లను ఉర్సాకు భూకేటాయింపుల్లో అపహాస్యం చేశారు. సీఎం, సంబంధిత మంత్రి లోకేష్ ప్రోత్సాహం లేకుండా ఒక ఫైల్ ఇంత వేగంగా క్లియర్ అవుతుందా? ప్రభుత్వం ఈ సంస్థకు ఎలా ఆమోదం తెలిపారు? ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు అయిదు వేల కోట్లు ఎలా తీసుకురాగలరు, వీరిని నమ్మి ఎలా వేల కోట్ల భూములు వారికి ఇచ్చేందుకు సిద్దమయ్యారు? వారి అనుభవాన్ని ఎలా పరిగణలోకి తీసుకున్నారనేది చెప్పాలి. 

చంద్రబాబుకు ఆది నుంచి ఇది అలవాటే

రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌ని ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఉర్సాకు కేటాయించినట్లుగా ఇటువంటి భూకేటాయింపులు మాకు సర్వసాధారణం, గతం నుంచి ఇలాగే చేస్తున్నామని నిస్సిగ్గుగా అంగీకరించారు. ఉర్సా సంస్థ సూట్‌కేస్ కంపెనీ అని ప్రతిపక్షంగా మేం ఆధారాలు చూపించాం. అలాగే వైర్ అనే డిజిటల్ మ్యాగజైన్ పెద్ద ఎత్తున దీనిపై పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. అనేక ప్రశ్నలు ప్రభుత్వం ముందు ఉంచింది. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? టీసీఎస్‌కు ఎకరం 99 పైసలకు కేటాయించారు. అదే ముసుగులో ఈ సూట్‌కేస్ కంపెనీకి కూడా ఇలాగే 99 పైసలకే కేటాయించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు హైదరాబాద్‌లో ఐఎంజీ భారత్ అనే సంస్థకు బిల్లీరావు అనే వ్యక్తికి నాలుగు వందల ఎకరాలను కేటాయించాలని చూశారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇలాంటివి చంద్రబాబుకు అలవాటు. సూట్‌కేస్ కంపెనీలను తీసుకురావడం, వారికి భూములు కేటాయించడం, వారి నుంచి ప్రతిగా క్విక్ బ్యాగ్‌లను తీసుకోవడం చేస్తున్నారు. కూటమి పార్టీలు దీనిపై సమాధానం చెప్పాలి. 

విశాఖను అవినీతి రాజధానిగా చేస్తున్నారు

గతంలో విశాఖను అడ్మినిస్ట్రేటీవ్ క్యాపిటల్‌గా దేశంలోనే ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలని అనుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విశాఖపట్నలోని విలువైన భూములను ప్రైవేటు సంస్థలక దారాదత్తం చేస్తూ, కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతి సొమ్మును దండుకుంటున్నారు. దాదాపు రూ.1500 కోట్ల విలువైన పదమూడు ఎకరాలు లులూ మాల్‌కు, రూ.3 వేల కోట్ల విలువైన కాపులుప్పాడులో యాబై ఆరు ఎకరాల భూమిని ఊరుపేరు లేని, ఎటువంటి అనుభవం లేని ఉర్సాకు కట్టబెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే మాజీ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. దానిలో కంపెనీ డైరెక్టర్‌లకు తన సోదరుడతో ఉన్న సంబంధాలను గురించి వివరించారు. ఈ కంపెనీపై విచారణ జరిపించాలని కోరారు. ఇప్పటికైనా చంద్రబాబు దీనిపై స్పందించాలి. అంతేకాదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ప్రైవేటు సంస్థలకు చేసిన కేటాయింపులపై కూడా వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాం.
 

Back to Top