తాడేపల్లి: చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో తప్పుడు కేసును బనాయిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంలో మరో పేజీ రాస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అ«ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. తమ పార్టీ నాయకుల ప్రతిష్టను దిగజార్చేందుకు గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగినట్టు తప్పుడు కేసులు నమోదు చేసి, అందరినీ ఇరికించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. వారు అనుకున్న కథను ప్రజల్లకి పంపడానికి చిన్న చిన్న ఉద్యోగులను బెదిరించి వాంగ్మూలాలు ఇచ్చినట్టు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెప్పారు. వైయస్ఆర్‌సీపీలో కీలకంగా పని చేస్తున్న నాయకుల వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పథక రచన చేస్తుంటే దానికి పోలీసులు వంత పాడుతున్నారని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో నమోదైన కేసులు కప్పి పుచ్చుకునేందుకే, అలా తమపై బురద చల్లుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో టీజేఆర్ సుధాకర్‌బాబు చెప్పారు. ప్రెస్‌మీట్‌లో టీజేఆర్ సుధాకర్‌బాబు ఏం మాట్లాడారంటే..: రూ. 1300 కోట్ల లిక్కర్ కుంభకోణం: 2014–19 మధ్య కాలంలో చంద్రబాబు హాయంలో జరిగిన లిక్కర్ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? లిక్కర్ స్కాంకి పాల్పడినట్టు చంద్రబాబు మీద సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మాట వాస్తవమా? కాదా? తన అనుకూలమైన డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చినట్టు, వారి నుంచి ఆర్డర్లు తీసుకున్నట్టు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసిన విషయం వాస్తవం కాదా? ఈ కేసులో చంద్రబాబు ఏ–3గా, కొల్లు రవీంద్రబాబు ఏ–2గా, ఎక్సైజ్ కమిషనర్‌గా ఏ–1గా సీఐడీ కేసులు నమోదు చేసింది. ఆ కేసు ఏమైనట్టు? ఈరోజు వరకు ఇప్పుడున్న సీఐడీ ఎందుకు ప్రశ్నించలేదు? మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టిలరీ, యనమల పాత్రుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కి చెందిన ఏఎంకే డిస్టిలరీలకు అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి అడ్డదారులు తొక్కినమాట వాస్తవం కాదా? ఇందు కోసం ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీనే మార్చిన మాట వాస్తవం కాదా? 2012–15 వరకు మద్యం ద్వారా పన్నుల రూపంలో రూ.2984 కోట్లు వసూలు కాగా, 2015లో తీసుకొచ్చిన కొత్త పాలసీ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడిచారనే కారణంగానే సీఐడీ కేసు నమోదు చేసింది. రెండు బేవరేజీలు, మూడు డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రోకి పాల్పడిందని సీఐడీ కేసులు నమోదు చేస్తే వాటినిప్పుడు ఎందుకు విచారణ చేయడం లేదు? ఈ ఒక్క కుంభకోణం ఫలితంగా దాదాపు రూ.1300 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. అడ్డగోలుగా అనుమతులు: 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ తేదీ నాటికి ఎన్ని కొత్త డిస్టిలరీలకు చంద్రబాబు అననుమతులిచ్చారు? అంత హడావుడిగా అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరాలకు మించి డిస్టిలరీలకు అనుమతులిచ్చి నిబంధనలకు విరుద్ధంగా 70 శాతానికి పైగా మద్యం బ్రాండ్లు కొనుగోలు చేశారు. జీవో వచ్చే రోజుకన్నా ముందే లావాదేవీలు జరిపి దానికి అనుగుణంగా జీవోలు తెచ్చుకున్నారు. చంద్రబాబునాయుడు అనుభవం మొత్తం ఈ ఒక్క స్కాంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కాంను వదిలేసి సంబంధం లేని అంశాన్ని పట్టుకుని ఇప్పుడు కక్ష సాధింపులకు దిగుతున్నారు. వైయస్ జగన్‌కి ఎవరూ అండగా ఉండకూడదనే ఉద్దేశంతో, ఆయన మనశ్శాంతిగా ఉండొద్దనే కుట్రతో ఆయన చుట్టూ ఉన్నవారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. నోట్ ఫైల్స్‌తో సహా దొరికిన చంద్రబాబు: అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు రాష్ట్రంలో 2012 నుంచి అమలులో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును నాటి చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. దీనిపై వైయస్ఆర్‌సీపీ హయాంలో సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతో పాటు, దాన్ని 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపితే దానిపై కేబినెట్‌లో చర్చించకపోగా కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం.. అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలనే ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపారు. ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో:218 జారీ చేసింది. అంటే కేబినెట్‌కు తెలియకుండానే నిర్ణయం జరిగిపోయింది. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరుతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబరు 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించి బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015, సెప్టెంబరు 1న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అంటే బార్ల యజమానుల నుంచి వినతిపత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు లేని వినతి పత్రాన్ని సృష్టించారు. అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015, డిసెంబర్ 11న జీవో:468 జారీ అయింది. అక్రమాన్ని కప్పి పుచ్చుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. ఇంతటి దారుణమైన స్కాం మన కళ్ల ముందే జరిగినా, దీనిపై సీడీఐ ఆధారాలు సేకరించినా, ఎఫ్‌ఐఆర్ నమోదైనా ఈ కేసు ఎందుకు ముందుకు నడవడం లేదు? దీనిపై ఏం సమాధానం చెప్తారు? వాంగ్మూలం తీసుకుని వాసుదేవరెడ్డిని రిలీవ్ చేశారు: గతేడాది జూన్ 12న అధికారంలోకి రాగానే చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. దీని కోసం తీవ్రస్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 12 రోజులు గడవక ముందే జూన్ 24 మద్యం వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఒక తప్పుడు కేసు నమోదు చేశారు. ఇందులో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ, వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరు చేసింది. వాసుదేవరెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం మొత్తం 4 కేసులను నమోదు చేసింది. ఈ నాలుగు కేసుల్లో కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా తనను సీఐడీ అధికారులు హింసిస్తున్నారని వాసుదేవరెడ్డి హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అయినా పగ చల్లారని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సీఐడీ అక్టోబరు 2024లో మరొక కేసును నమోదు చేసింది. బెదిరించి భయపెట్టి, తమకు అనుకూలంగా చివరకు వాసుదేవరెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకుని, దాని ఆధారంగా ఈ కథను నడపాలనుకుంటున్నారు. వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజునే వాసుదేవరెడ్డిని మళ్లీ కేంద్ర సర్వీసుకు రిలీవ్ చేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది? దాని ఆధారంగా చేసే దర్యాప్తునకు ఏం విలువ ఉంటుంది? కిందిస్థాయి ఉద్యోగుల నుంచి బలవంతపు వాంగ్మూలాలు: వాసుదేవరెడ్డి సహా ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్లో ఉన్న మరికొంత మంది చిన్నస్థాయి ఉద్యోగులను భయపెట్టి అక్రమ నిర్బంధాలకు గురి చేసి వారిపై వేధింపులకు దిగారు. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వపు ఉద్యోగి సత్యప్రసాద్‌ను ఇదే తరహాలో సీఐడీ అధికారులు వేధించారు. సత్యప్రసాద్ ఎక్సైజ్ శాఖలో దిగువస్థాయి ఉద్యోగి. అలాంతి వారిని భయపెట్టి తీసుకునే వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది? సత్యప్రసాద్ తరహాలోనే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో డీటీపీ క్లర్కుగా పని చేస్తున్న మరో మహిళ నుంచి కూడా అక్రమంగా నిర్బంధించి, బెదిరించి ఆమె చేత 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం తీసుకున్నారు. వీటిన్నింటి లక్ష్యం తమకు కావాల్సిన పేర్లను వారితో చెప్పించి, వారిని ఇబ్బందులు పాలు చేయాలన్నదే లక్ష్యం. వీళ్ల చేత తప్పుడు సాక్ష్యాలు చెప్పించి, జగన్ చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయాలన్న చంద్రబాబు ప్లాన్‌నే సీఐడీ అమలు చేస్తోంది. ఇలాంటి తప్పుడు సాక్ష్యాలకు ఏం విలువ ఉంటుంది? పెద్దిరెడ్డిగారి కుటుంబమే చంద్రబాబు టార్గెట్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మిథున్‌రెడ్డి లోక్‌సభ ఎంపీ. గతంలోనూ, ఇప్పుడు కూడా లోక్‌సభలో పార్టీకి నాయకుడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యహారాలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి. ఇక మిథున్‌రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వ హయాంలో మొదట పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానూ, తర్వాత విద్యుత్, అటవీశాఖ మంత్రిగా పని చేశారు. వీరికి ఎక్సైజ్ శాఖతో కానీ, సంబంధిత విభాగాలతో గానీ ఎలాంటి సంబంధం లేదు. వాటి నిర్ణయాల్లో భాగస్వామ్యం కాని, ప్రమేయం కాని ఉండే అవకాశం లేదు. చంద్రబాబుకి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్టూడెంట్‌గా ఉన్న సమయం నుంచే రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేవారు. స్టూడెంట్ ఎన్నికల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి తుక్కుతుక్కుగా ఓడించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పెద్దిరెడ్డి నేతృత్వంలో ఓడించారు. దీంతో అవమానభారం తట్టుకోలేక ఇప్పుడు అధికారం ఉందనే అహంకారంతో చంద్రబాబు తనయుడు లోకేష్ .. పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిపై రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ కేసులు బనాయిస్తున్నాడు. రాజ్‌కసిరెడ్డికి ఏం సంబంధం?: ఇప్పుడు రాజ్ కసిరెడ్డి పేరుతో నడుపుతున్న కుట్ర కూడా ఇందులో ఒక భాగమే. రాజ్ కసిరెడ్డి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో సేవలందించిన సలహాదారుల్లో ఒకరు. ఐటీ సలహాదారుగా ఉన్నారు. అది కూడా కోవిడ్ సంక్షోభం తీవ్రంగా ఉన్న రోజుల్లో పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీకి సంబంధించి నలుగురు సలహాదారుల్లో ఆయన కూడా ఒకరు. ఆ తర్వాత సలహాదారుగా ఎలాంటి పొడిగింపు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, ఇతర వ్యవహారాల్లో కానీ ఏ హోదాల్లోనూ లేరు. అలాంటి వ్యక్తిని జరగని మద్యం కుంభకోణంలో నిందితుడిగా పేర్కొంటూ, రాజ్ కసిరెడ్డి చుట్టూ ఎల్లో మీడియా సహాయంతో తప్పుడు వార్తలు వండి వార్చి, ఏదో జరిగిపోయిందనే అభిప్రాయాన్ని కలిగించడానికి, తద్వారా తప్పుడు కేసును ముందుకు నడపడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. నిజంగా రాజ్ కసి రెడ్డితో వ్యవహారాన్ని నడిపించాలనుకుంటే ఏకంగా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గానే పెట్టేవారు కదా? తప్పడు వాంగ్మూలాలు తప్ప ఆధారాలున్నాయా?: అదాన్ ఏజెన్సీకి, ఎస్పీవై డిస్టిలరీకి మధ్య జరిగిన లావాదేవీల మీద కూడా తప్పుడు భాష్యం చెప్పి, అదొక నేరంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ అప్పు తీసుకోవడం, దానికి తిరిగి చెల్లించడం.. ఇవన్నీ ఏ కంపెనీలోనైనా సహజంగా జరిగే ప్రక్రియ. పైగా అది చెక్కు రూపంలో జరిగినప్పుడు వేలెత్తి చూపించడానికి ఏముంటుంది? అలాంటి వ్యవహారాలను కూడా లిక్కర్ పాలసీకి ముడి పెట్టడం, దాని చుట్టూ ఈ కేసును నడపాలనుకుకోవడం దుర్మార్గం కాదా?. ఈ వ్యవహారంలో మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎస్పీవై డిస్టిలరీ కొత్తగా వచ్చిన కంపెనీ కాదు. ఎస్పీవై కంపెనీ వచ్చింది చంద్రబాబు హయాంలో కాదా? ఈ కంపెనీకి అనుమతులు వచ్చింది 2016లో కాదా? ప్రభుత్వం మద్యాన్ని కొనుగోలు చేసే డిస్టిలరీల కంపెనీగా ఎంప్యానెల్ అయ్యింది చంద్రబాబు హయాంలోనే కదా? ఆర్డర్లు కూడా పొందింది చంద్రబాబు హయాంలోనే కదా? మరి ఇన్నిఫేవర్లు ఆ కంపెనీకి చేసిన చంద్రబాబు, నిబంధనల ప్రకారం ఎంపానెల్మెంట్ అయిన కంపెనీల నుంచి పద్దతి ప్రకారం కొనుగోలు చేస్తే దాన్ని స్కాంగా చెప్పడంం వీళ్లు చేస్తున్న ఆరోపణల్లో బలం లేదని ఇట్టే అర్థం అవుతుంది. అసలు ఈ ప్రైవేటు కంపెనీలు చేసుకున్న లావాదేవీల వ్యవహారానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఏం నష్టం జరిగింది? నష్టం జరిగిందంటూ మీరు చేస్తున్న ఆరోపణలకు మీ దగ్గరున్న ఆధారాలు ఏంటి? మీరు చెప్పించిన తప్పుడు సాక్ష్యాలు కాకుండా ఏమున్నాయి. మద్యం షాపుల నుంచి లంచాలు ఎలా వస్తాయి?: వైయ్ససార్సీపీ హయాంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నేరుగా ప్రభుత్వానికి వచ్చేలా వైయస్ జగన్ చేశారు. చంద్రబాబులా అడ్డదారులు తొక్కలేదు. అసలీ లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కామ్ చేసింది ఎవరు? మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? తక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం విక్రయాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం విక్రయ వేళల్ని తగ్గిస్తే లంచాలు వస్తాయా? లేక వేళాపాలా లేకుండా అమ్మితే లంచాలు వస్తాయా? లిక్కర్ అమ్మే షాపులను పెంచితే లంచాలు ఇస్తారా? లేక షాపులను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? షాపులకు తోడు పర్మిట్ రూమ్లు, వాటితోపాటు బెల్టు షాపులుపెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్‌లు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?. 2014–19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లకు కాకుండా బేసిక్ రేట్లు పెంచి డిస్టలరీల నుంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా? లేక అవే రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్సులు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ఎంపిక చేసుకున్న 4–5 డిస్టలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? లేక అన్ని డిస్టలరీలకు దాదాపుగా సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ఇప్పుడున్న డిస్టలరీలకు సింహభాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టలరీకి అనుమతి ఇవ్వని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా?. ఇంతటి భారీ స్కాం మీరు చేసి, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, బేతాళుడి మాదిరిగా ఒక కథ అల్లి, దాని చుట్టూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి, జగన్ చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు ఉండవల్లి కొంపకు మద్యం కమీషన్లు: 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి వైయస్సార్ సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు లేనిపోని నిందలేశారు. లిక్కర్ రేట్లు తగ్గిస్తామని, నాణ్యమైన మద్యం అందిస్తామని, అన్ని బ్రాండ్లూ అందుబాటులోకి తెస్తామని, రూ.99కే చీప్ లిక్కర్ అందిస్తామని హామీలు గుప్పించారు. తీరా గద్దెనెక్కిన తర్వాత ఒక్క బ్రాండు రేటూ తగ్గించలేదు సరికదా.. రేట్లు మరింత పెంచేశారు. సిండికేట్ గా మారి మద్యం షాపులన్నీ తన గుప్పెట్లో పెట్టుకోవడం మొదలు.. మార్జిన్ మనీ పెంచి వేల కోట్లు ఉండవల్లి కొంపకు చేరేలా కమీషన్లు దండుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల 30 శాతం కమీషన్ దోపిడీ: చంద్రబాబు కొత్త దుకాణాలకు టెండర్లు పిలిచిన తర్వాత అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియలో టీడీపీ సిండికేట్ కుట్రకు పాల్పడింది. కమీషన్ ఇస్తారో.. లేక దుకాణాలు వదలుకుంటారో తేల్చుకోండని ఎమ్మెల్యే, ఎంపీలు హుకుం జారీ చేశారు. మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు దిగారు. చాలా చోట్ల టీడీపీ సిండికేట్ సభ్యులు కానివారు కూడా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసిన వారిని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గుర్తించి వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. దారికి రాని వారిపై దాడులు కూడా చేశారు. లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్ దక్కినా సరే.. వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు తమకు కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. మద్యం దుకాణాల లాటరీ తంతు ముగిసిన తర్వాత అక్కడక్కడా స్వల్పంగా షాపులు దక్కించుకున్న ఇతరులకు టీడీపీ సిండికేట్ చుక్కలు చూపించింది. తమను ధిక్కరించి వ్యాపారం చేయలేరని.. వాటాలు చెల్లిస్తారో, దుకాణాలు అప్పగిస్తారో తేల్చుకోవాలని లేదంటే ఎక్సైజ్, పోలీసు దాడులు తప్పవని తీవ్ర బెదిరింపులకు గురి చేసింది. ప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం దుకాణాలను ఎత్తివేసి స్కాములకు పాల్పడ్డారు. అలా ఎత్తివేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి అందులోనూ తన వాళ్లకు వచ్చేటట్టుగా చేసి మరో స్కాము చేశారు. కూటమి పాలనలో మద్యం షాపులపై ఎక్సైజ్ అధికారులు ఇంతవరకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఒక్క కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు. ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు ఇవ్వడంతో పాటు వీటికి అనుబంధంగా ప్రతి గ్రామంలో, ప్రతివీధిలో, గుడిపక్కన, బడి పక్కన బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో తన పార్టీ కార్యకర్తలకు బెల్ట్ షాపులు కట్టబెట్టడం, ఆ బెల్టు షాపులకూ వేలం పాటలు నిర్వహించి డబ్బులు దండుకోవడం ద్వారా మరో కుంభకోణం చేశారు. ఎమ్మార్పీ కన్నా క్వార్టర్ బాటిల్ మీద రూ.20 నుంచి రూ.30 వరకు ఎక్కువ పెట్టి అమ్ముకోవడం ద్వారా కరకట్ట కొంపకు కమీషన్ చేరేలా కుట్ర పన్నారు. మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాలంటే వేలం పాటలు నిర్వహించారు. ఆ షాపుల్లో రేట్లతో సంబంధం లేకుండా అధిక రేట్లకు అమ్ముకోవడంతో పాటు, వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి మరీ ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ రకంగా లిక్కర్ మాఫియా ప్రతి ఇంటికీ చేరింది. ప్రతి ఇంటినీ గుల్ల చేస్తోంది. వారి ఆదాయాలను మద్యం రూపేణా లాగేస్తోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు వివరించారు.