గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సూట్‌కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో రూ.3వేల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి కోట్లాధి రూపాయలు కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్ళించేందుకే ఈ తాజా అరెస్ట్‌ల డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే.... తన అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. అరెస్ట్‌లకు ఎవరూ అతీతం కాదని చంద్రబాబు అంటున్నారు. తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసేస్తాననే పద్దతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన ఏపీలో అనేక చోట్ల పనిచేశారు. నీతీ, నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. పదోన్నతులతో డీజీపీ స్థాయికి వచ్చారు. డీజీపీ కావాల్సిన అధికారిని ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. గతంలో ఒక కేసులో ఆనాటి ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కూడా ఎదురు కేసులు నమోదు చేశారు. వారిద్దరూ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పీఎస్‌ఆర్ ఆంజనేయులు పనిచేస్తున్నారు. ఆయన కోర్ట్‌కు వెళ్ళలేదు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు. ఈ రోజు హటాత్తుగా ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు సిద్దహస్తుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను, బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తూ చంద్రబాబు అబద్దాల కోరు అని జనం చర్చించుకుంటున్నారు. ఒక్క హమీని కూడా నెరవేచ్చని దుర్మార్గమైన పాలన సాగుతోంది. దీనిపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకు తాజాగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఉర్సు అనే కంపెనీకి విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 99 పైసలకు ఎకరం చొప్పున ఇచ్చేశారు. ఇది దోపిడీ కార్యక్రమం కాదా? ఇది ప్రజలు చర్చించుకోకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కసిరెడ్డిలను అరెస్ట్ చేసి, దానిపై పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. మరోవైపు రాజధాని పేరుతో విపరీతంగా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువస్తున్నారు. ఆ సొమ్ముతో కాంట్రాక్ట్‌లకు ఇస్తూ, వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారు. ఈ పనులకు రెండో తేదీన అమరావతిలో రెండోసారి శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఆహ్వానించారు. విపరీతమైన దోపిడీతో రాష్ట్రం సతమతమవుతోంది. లిక్కర్, ఇసుక, మట్టి పేరుతో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలోని టీడీపీ నాయకులు, చంద్రబాబు, నారా లోకేష్‌లు విపరీతంగా దోచుకుంటూ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం పదకొండు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక్కటే. ఏపీలో లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే, దానిలో కుంభకోణం ఎలా జరుగుతుంది. ఒక్క కొత్త డిస్టలరీకి కూడా వైయస్ జగన్ గారి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం కన్నా తక్కువ రేట్లకే మద్యం విక్రయించాం, బెల్ట్ షాప్‌లను తొలగించాం దీనికి ఎవరైనా లంచాలు ఇస్తారా? పర్మిట్ రూంలు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టలరీలకు అర్డర్లు ఇచ్చాం. దీనిలో ఏదో స్కాం జరిగిపోయిందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు కేసులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉంటారా? సీఎంలు మారితే ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయవచ్చా? డీజీపీలుగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్‌లు చేయవచ్చా? ఏమిటీ ఈ అన్యాయం? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాలపై న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా వారికి బుద్ది రావడం లేదు. పోసాని కృష్ణమురళిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టినందుకు సదరు విచారణాధికారిని కోర్ట్ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి మీద ఎక్స్‌ట్రార్షన్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే, కోర్ట్ దానిని తీవ్రంగా ఆక్షేపించింది. అవసరమైతే డీజీపీని కోర్ట్‌కు పిలుస్తామని కూడా హెచ్చరించాయి. కలకాలం చంద్రబాబే సీఎంగా ఉండరని గుర్తుంచుకోవాలి. పరిపాలన చేయలేక, కక్షసాధింపులతో పనిచేస్తున్నారు. కూటమి పార్టీలకు ఓటు వేసిన వారు సిగ్గుపడేలా పరిపాలన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పాలన చేయాలనుకున్న వారు ఎవరూ మనజాలలేదు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇది కక్షసాధింపు చర్యలు కావా? నిజంగా పోలీసులు తప్పు చేశారని నిర్ధారిస్తే దీనికి బాధ్యత వహించి హోమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పోలీసులు ఆలోచించాలి. మీ తోటి అధికారులను కక్షసాధింపుల్లో భాగంగా తప్పుడు కేసులతో మీతోనే అరెస్ట్ చేయించింది. ఇదే పద్దతి కొనసాగితే రేపు ప్రభుత్వాలు మారితే మీమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయవచ్చు కదా? ఈ సంప్రదాయం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? ప్రతి ఐపీఎస్ అధికారి దీనిపై ఆలోచించుకోవాలి. అణిచివేస్తే భయపడతామా? గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధి, జయలలిత, వైయస్ జగన్ వంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులపై వారి ప్రభుత్వాలు వచ్చిన తరువాత ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? చంద్రబాబును అరెస్ట్ చేశారనే కక్షతోనే ఇలా అరెస్ట్‌లు చేసుకుంటూ పోతున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్‌లు మాజీలు కాకుండా పోతారా? ప్రభుత్వాలు మారి, మీరు ప్రతిపక్షంలోకి రాకుండా పోతారా? ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేస్తారా? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరింత బలంగా ఈ అక్రమాలపై పోరాడేందుకు ముందుకు వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. మూడున్నరేళ్ళ పదవీకాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారు. కూటమి కోసం తన పదవిని వదిలేశారు. కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందీ? వారి మాటలకు, వాదనలకు విలువ ఏముంటుందీ?