కాకినాడ జిల్లా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేయడం ఇదేం ధర్మమమని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అరె శ్యామల ఫైర్ అయ్యారు. పిఠాపురంలో దళితుల దుస్థితి ఇలా ఉందంటే పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలన్నారు. మల్లాం గ్రామంలో దళితుల గ్రామ బహిష్కరణ ఘటనపై శ్యామల స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. శ్యామల ఏమన్నారంటే.. ` ఆ మధ్య అమరావతిలో కొందరు పెత్తందార్లు మా మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటే సామాజిక సమతూల్యం దెబ్బతింటుందని కేసులు వేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వాటిని ఖండించలేదు సరికదా..కొద్దిరోజుల తరువాత వారితోనే పొత్తులు పెట్టుకొని కూటమిగా ఏర్పడి పీపీపీగా(పిఠాపురం పిఠాధిపతి పవన్ కళ్యాణ్)గా అవతరించారు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం పరిధిలోని మల్లాం గ్రామంలో దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెనుకబడిన వర్గాలకు ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదంటూ హుకుం జారీ చేసిన పెద్ద మనుషులను పవన్ ప్రశ్నించలేదు. ఇలా మాట్లాడితే ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ, ఆయనకు అర్థమయ్యే భాషలో అనగా సనాతన ధర్మంలోని ఒక భాగమైన భగవత్గీతలో ఏం చెప్పారో తెలుసా సర్. దళితులను గ్రామ బహిష్కరణ చేయడం, కనీసం నిత్యావసర సరుకులు కూడా క్రయ విక్రయాలు లేకుండా చేయడం ఇదేం ధర్మం సర్. ఎంత వరకు న్యాయం? ఇంత జరుగుతుంటే కనీసం మీరు నోరు తెరచి మాట్లాడరా? ఈ రోజుల్లో కూడా అంటరానితనాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు న్యాయం. అలాంటి మీరు ఏపీకి డీసీఎంగా ఉండటం దురదృష్టకరం. ఈయనా మా నియోజకవర్గ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడుతున్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ఐదేళ్లు పాలన అందించిన వ్యక్తి వైయస్ జగన్. అలాంటి పాలనను మళ్లీ తెచ్చకుంటాం` అంటూ శ్యామల వీడియో సందేశం పంపించారు.