తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై ప్రజల దృష్టి మళ్ళించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్‌ను పదేపదే అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డీజీపీ కేడర్‌లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూడా దీనిలో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కాంట్రాక్ట్ సంస్ధల నుంచి ముడుపుల స్వీకారం, హామీలను అమలు చేయకపోవడం, కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా సూట్‌కేసు కంపెనీలకు దారాదత్తం చేయడం వంటి చర్యలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి డర్టీ పాలిటిక్స్‌కు చంద్రబాబు తెరదీశారని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే... గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులుని అరెస్ట్ చేయడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ఎటువంటి అరాచకాలకు పాల్పడుతుందో అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు, లోకేష్ ల చేత నెత్తిన కిరీటం పెట్టించుకోవాలని తహతహలాడుతూ తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులంతా భవిష్యత్తు గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. రాబోయేది మళ్లీ వైయస్సార్సీపీ ప్రభుత్వమే. జగన్ సీఎం అయ్యాక తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి జైళ్లకు పంపుతాం. అమరావతి కాంట్రాక్ట్‌ల్లో పెద్ద ఎత్తున అవినీతి చంద్రబాబు చేస్తున్న అవినీతిపై అమరావతిలో నిర్మాణాల భూమిపూజకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించాలి. గతంలో ప్రధాని సైతం చంద్రబాబు అవినీతిపై స్వయంగా మాట్లాడిన వీడియోలను తెప్పించుకుని చూడాలి. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ఏటీఎంలా ఎలా వాడుకుంటున్నాడో ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. గతంలో అమరావతి కోసం రూ. 36 వేల కోట్లతో టెండర్లు పిలిచి భూమి పూజ చేశారు. ఇప్పుడు అవే టెండర్లను రూ. 77 వేల కోట్లకు పెంచి మళ్లీ ప్రధాని మోడీని భూమి పూజకు పిలుస్తున్నారు. గతంలో వైయస్సార్సీపీ హయాంలో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలను రద్దు చేశారు. చంద్రబాబు తన జేబులు నింపుకునేందుకు మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని తెచ్చిపెట్టారు. రాజధానిలో అన్ని వర్గాలు నివాసం ఉండాలి. కానీ వైయస్ జగన్ 55 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు సీఎం అయ్యాక రద్దు చేశారు. ఆయన, ఆయన బినామీలు, ఆయన సామాజిక వర్గం తప్ప ఇంకెవరూ రాజధానిలో ఉండటానికి అర్హులు కాదా? చేతికి వాచీ లేదు, జేబులో డబ్బుల్లేవని చెప్పే చంద్రబాబు రాజధానిలో 5 ఎకరాల భూమి రూ. 150 కోట్లతో ఎలా కొనుగోలు చేశాడు? నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకి ఆయన పార్టనర్ పవన్ కళ్యాన్ కి ఇన్నేళ్లలో ఆంధ్రాలో ఇళ్లు కట్టుకోవాలనిపించలేదు. మొన్న ఎన్నికలకు ముందు ఓట్లు ఆంధ్రాకి మార్చుకుని ఇక్కడ ఇళ్లు కడుతున్నట్టు దొంగాట ఆడుతున్నారు. ఇన్నిసార్లు తనను గెలిపించిన కుప్పంలో చంద్రబాబు ఎందుకు ఇళ్లు కట్టుకోలేదు? విజయవాడలో ఇళ్లు కట్టుకోవడానికి చంద్రబాబు ఇంతకాలం ఎందుకు పట్టింది? ఇప్పటికీ వీకెండ్ వచ్చిందంటే చాలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లిపోతారు. రాజకీయాలు చేసేది ఏపీలో, నివాసం ఉండేది హైదరాబాద్‌లోనా? 'ఉర్సా'కిచ్చిన భూ కేటాయింపులు రద్దు చేయాలి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని వైయస్ జగన్ కలలు కంటే కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖను సర్వనాశనం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీసీ మహిళ అని కూడా చూడకుండా విశాఖ మేయర్ పదవి నుంచి దించేశారు. ఉర్సా అనే 60 రోజులు ముందు పుట్టిన సూట్ కేస్ కంపెనీకి రూ. 3వేల కోట్లు విలువ చేసే 60 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. నారా లోకేష్ ఐటీ మంత్రిగా ఉండగా ఆయన ప్రమేయం లేకుండా ఈ భూ కేటాయింపు జరిగి ఉండే అవకాశమే లేదు. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఆయన పార్టనర్‌కి చెందిన డొల్ల కంపెనీకి 60 ఎకరాలు ఎలా ఇచ్చారు? ఈ కంపెనీకి అమెరికాలో కూడా సరైన కార్యాలయం కూడా లేదు. ఇది దోపిడీ కాదా? ఈ కంపెనీకి ఇచ్చిన భూ కేటాయింపులను కూడా వెంటనే రద్దు చేయాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై, హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో అంతుబట్టడం లేదు. అవసరమైనప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటారా? జగన్‌ని తిట్టడానికి పరుగులు పెట్టుకుంటూ వచ్చే వపన్ ఇప్పుడెందుకు బయటకు రావడం లేదు? చంద్రబాబుకి అవసరం అయినప్పుడు మాత్రమే ఆయన బయటకొస్తారేమో. దళితుల మీద దాడులు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. ఆలయాల మీద దాడులు జరుగుతుంటే మాట్లాడటం లేదు. తన నియోజకవర్గం సహా రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. సినిమా ఫంక్షన్‌లో అభిమానులు చనిపోతే అభిమానుల కుటుంబాలను పరామర్శించలేదు. బాధిత కుటుంబాలను ఆయన ఉన్నచోటకే పిలిపించినా సరే మాట్లాడకుండా వెళ్లిపోయాడు. జగన్ ని ఓడించి చంద్రబాబుని సీఎం చేస్తే వచ్చిన ప్యాకేజీ తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు నాయకుడు. చంద్రబాబు చెప్పినట్టు నడుచుకోవడమే ఆయన పని. విద్యావంతులెవరూ పవన్ ని నమ్మడం లేదు. సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్‌కి గట్టిగా బుద్ధి చెబుతారు. లేని లిక్కర్ స్కామ్‌ను అబద్దాలతో సృష్టించారు ఎంపీ మిధున్‌రెడ్డి లొక్‌సభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉండి కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతుంటే తట్టుకోలేకనే జరగని లిక్కర్ స్కాంలో ఆయన పేరును చేర్చింది. మద్యం ప్రభుత్వం అమ్మితే స్కాం జరిగినట్టా? ప్రైవేటు వ్యక్తులు అమ్మితే స్కాం జరిగినట్టా? ప్రభుత్వం అమ్మితే లంచాలొస్తాయా? ప్రైవేటు వ్యక్తులు అమ్మితే లంచాలొస్తాయా? ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా చూసేందుకు మద్యం అమ్మకాల వేళలు తగ్గించడం జరిగింది. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశాం. లిక్కర్ షాపులు, బార్ల సంఖ్యను తగ్గించాం. మా హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో చంద్రబాబు పాలనలో జరిగిన లిక్కర్ స్కాం మీద కూడా కేసులు వేయడం జరిగింది. దమ్ముంటే దీనితోపాటు ఆయన పాలనలో జరిగిన లిక్కర్ అమ్మకాలు, డిస్టిలరీస్‌కి ఇచ్చిన అనుమతుల మీద కూడా విచారణ జరిపితే, ఎవరు అవినీతికి పాల్పడ్డారో తేలిపోతుంది. వైయస్సార్సీపీ హయాంలో స్కీములే జరిగాయి. చంద్రబాబు హయాంలో జరిగేవన్నీ స్కాములే. లిక్కర్ స్కాంల గురించి ఎవరో చెబితే ప్రజలు తెలుసుకునే స్థితిలో లేరు. లిక్కర్ అమ్మకాలు పెరిగాయి. విచ్చలవిడిగా మద్యం తాగి దాడులకు పాల్పడుతున్నారు. మందు బాబుల ఆగడాలను మహిళలు భరించలేకపోతున్నారు. రోడ్లపై కూడా నడవలేని పరిస్థితి నెలకొంది. వైయస్ జగన్ పాలనలో మహిళలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడితే చంద్రబాబు పాలనలో మహిళలకు అడుగడుగునా వేధింపులు తప్పడం లేదు.