శ్రీకూర్మంలో తాబేళ్ల మృతి `కూట‌మి` నిర్లక్ష్యానికి నిదర్శనం 

శ్రీ‌కాకుళం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఫైర్‌

 శ్రీకూర్మం ఆలయాన్ని సంద‌ర్శించిన‌ వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు

శ్రీకాకుళం జిల్లా:  శ్రీకూర్మంలో తాబేళ్ల మృతి… ఇది కూట‌మి ప్రభుత్వ నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనమ‌ని శ్రీ‌కాకుళం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మండిప‌డ్డారు. తిరుపతిలో గోవులు మృతి చెందిన విషాద ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోకముందే, ఇప్పుడు శ్రీకూర్మంలో తాబేళ్లు చ‌నిపోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.  పవిత్ర జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయంటే అది సామాన్యమైన విషయం కాద‌ని, ఇందుకు ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల‌న్నారు.  మంగళవారం శ్రీకూర్మం ఆలయాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు  సందర్శించి, తాబేళ్ల మరణం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌ మాట్లాడుతూ "తిరుపతి గోవుల ఘటన ఇంకా ప్రజల మనసులో ఉంది. అలాంటి ఘటన మర్చిపోకముందే ఇక్కడ తాబేళ్ల మృతి జరుగుతోంది. ఆలయాలు మన సంస్కృతికి ప్రతీకలు. అటువంటి స్థలాల్లో ఉన్న జంతువులను కూడా రక్షించలేకపోతే, అది పాలకుల వైఫల్యమే," అని ధర్మాన పేర్కొన్నారు.

"భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. తాబేళ్ల మరణానికి బాధ్యులెవరో తెలుసుకొని, వారిపై కఠిన చర్యలు తప్పక తీసుకోవాలి. ఇటువంటి దుర్వినియోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి," అని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ధర్మాన కృష్ణ దాస్ వెంట పార్టీ సీనియర్ నాయకులు ఎంవీ పద్మావతి, గొండు రఘురాం, గొండు కృష్ణమూర్తి, మార్పు పృథ్వి, అంబటి శ్రీనివాస్, మూకళ్ళ తాతబాబు, బరాటం నాగేశ్వరరావు, వైవీ.శ్రీధర్, గేదెల పురుషోత్తం, పొన్నాడ రుషి తదితరులు ఉన్నారు. 

Back to Top