తాడేపల్లి: ముస్లింల పవిత్రమైన హజ్‌యాత్ర కోసం నియమించిన కమిటీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్థానం కల్పించడం దారుణమని ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ బీఎస్ గౌస్ లాజం మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముస్లిం హజ్ కమిటీ నియామకాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం పార్టీ వ్యక్తులతో నియామకాలు చేయడం ముస్లిం సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. ఈ అనుచిత నియామకాల కోసం జారీ చేసిన జీఓ 38ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హజ్ కమిటీలో నియమించిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలను తొలగించాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి ప్రభుత్వం ఈ నెల 16న రాష్ట్ర హజ్ కమిటీకి 13 మందిని నామినేట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సెంట్రల్ హజ్ కమిటీ యాక్టు నెంబర్ 35, 2002 ప్రకారం సబ్ క్లాజ్ 3లో ముగ్గురు మత గురువులను నియమించాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి ముగ్గురు టీడీపీ కార్యకర్తలను నియమించడమే కాకుండా వారిని మతగురువులుగా పేర్కొంటూ జీవో నెంబర్ 38 విడుదల చేసింది. పార్టీ కార్యకర్తలను మతగురువులుగా చూపించి హజ్ కమిటీలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పఠాన్ ఖాదర్ ఖాన్, సయ్యద్ షాహి సుల్తాన్, షేక్ హసన్ బాషా అనే ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు హజ్ కమిటీలో చోటు కల్పించారు. వీరిలో షేక్ హసన్ బాషా అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రిసెప్షనిస్ట్ గా ఉండేవాడు. ఆయన్ను హజ్ కమిటీలో చేర్చారు. హజ్ యాత్రికులు మక్కాకు వెళ్లిన తర్వాత కొన్ని కార్యాలు(అర్కాన్లు) చేయాల్సి ఉంటుంది. అక్కడ అర్కాన్లు చెప్పే సామర్థ్యం కేవలం ముస్లిం సయాలజిస్టులైన ముఫ్తీ, హాఫీజు, ఉలేమాలు, మౌల్విలకు మాత్రమే ఉంటుంది. అటువంటి ఉలేమాలను పక్కనపెట్టి వారి స్థానంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నియమించడం సరికాదు.